Friday, September 22, 2023
Friday, September 22, 2023

ఉద్యమించిన మామిడి రైతు

చిత్తూరు కలెక్టరేట్‌ ముట్టడి
అడుగడుగునా అరెస్టులు
రోడ్లపై మామిడి కాయలు పారబోసి నిరసన

విశాలాంధ్ర- చిత్తూరు : మామిడి రైతు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆరుగాలం కష్టపడి పండిరచిన పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు ఆందోళన బాటపట్టారు. అడుగడుగునా పోలీసులు నిర్బంధకాండ కొనసాగించినా రైతులు బెదరలేదు. సోమవారం గిట్టుబాటు ధరలకోసం చలో కలెక్టరేట్‌కు ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా సమితి పిలుపునిచ్చింది. పోలీసులు బి కొత్తకోట, మొలకల చెరువు, తవణంపల్లి, పీలేరులలో రైతు సంఘం ప్రతినిధులను గృహనిర్బంధంలో ఉంచారు. పోలీసుల అడ్డంకులను తప్పించుకుని సోమవారం ఉదయమే కలెక్టరేట్‌ చేరుకున్న మామిడి రైతులు కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. గిట్టుబాటు ధరలు ప్రకటించే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. కలెక్టర్‌ కార్యాలయం ఎదుట మామిడి కాయలను రోడ్డుపై పారబోసి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టి జనార్థన్‌, పి ఎల్‌ నరసింహులు మాట్లాడుతూ మామిడిరైతులకు న్యాయం చేసేవరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. మామిడి గుజ్జు యాజమానులు సిండికేట్‌గా మారి రైతును చావు దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతు పండిరచిన మామిడి ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా జిల్లాలోని ఒక మంత్రి సాయంతో అడ్డుకట్ట వేశారని, రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ మొత్తంలో లాభం గడిరచారని విమర్శించారు. రైతు బహిరంగ మార్కెట్‌లో మామిడిని అమ్ముకోనీయకుండా చాపకింద నీరులా చక్రం తిప్పారని ఆగ్రహం వక్తం చేశారు. మామిడి రైతులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ప్రయత్నాలు సత్ఫలితాలు ఇవ్వలేదని, మామిడి గుజ్జు పరిశ్రమ యజమానులదే పైచేయిగా మారిందన్నారు. ఏడాదిపాటు కంటికి రెప్పల కాపాడుకుంటూ వచ్చిన మామిడి పండ్లను రోడ్డుపై పారబోసి వినూత్నంగా నిరసన తెలిపారు. జిల్లాలో సింహభాగం రైతులు మామిడి పంటపై ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. లక్షల వ్యయం చేసి పంట పండిస్తే ప్రభుత్వ విధానాల వలన రైతుకు చివరికి అప్పులే మిగులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోకడ పూర్తిగా రూపుమాపాలంటే మామిడి ధరకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి మామిడి సిండికేట్‌ మాఫిమాపై ఉక్కుపాదం మోపాలని కోరారు. మామిడి రైతుల కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమం జయప్రదం కావడంతో రైతులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో టూటౌన్‌ సీఐ యుగంధర్‌ జోక్యం చేసుకుని కలెక్టర్‌ లేనందున ఆయన ప్రతినిధిగా డీఆర్‌ఓ మురళి, ఉద్యానవనశాఖ సహాయ సంచాలకులు కోటేశ్వరరావును ధర్నా శిబిరం వద్దకు తీసుకొచ్చారు. రైతు సంఘం ప్రతినిధులు అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.హేమ లత, రైతు నాయకులు, కె.కుమార్‌రెడ్డి, నాయకులు హరిబాబు నాయుడు, హరి, కోదండ యాదవ్‌, శాంతమూర్తి, శ్రీనివాస్‌రెడ్డి, బాలాజీ, యువరాజ్‌, దామోదరం, జయచంద్రారెడ్డీ, మునిరెడ్డి, బాలాజీ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జనార్థన్‌ మీడియాతో మాట్లాడారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర ఇప్పిస్తామని చెప్పిన ప్రభుత్వం చేతులు ఎత్తి వేసిన వైఖరికి నిరసనగా 23తేదీన కలెక్టరేట్‌ వద్ద సామూహిక నిరాహార దీక్ష చేపట్ట నున్నట్లు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img