Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

ఉపాధిహామీకి నిధులు పెంచాలి

. పథకానికి ఏకంగా 30 శాతం నిధుల కోత దుర్మార్గం
. తక్షణమే రూ.2 లక్షల 40 వేల కోట్లకు పెంపు చేయాలి
. లేకుంటే దళితులు, గిరిజనులు, పేదలకు తీవ్ర అన్యాయం
. వ్యవసాయ కూలీలకు కనీసం వేతనం రూ.600 ఇవ్వాలి
. వ్య.కా.సం, డీహెచ్‌పీఎస్‌, గిరిజన సమాఖ్య రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
. ఎన్‌జీఈఆర్‌ఎస్‌ను నిర్వీర్యం చేస్తే పతనమే : జల్లి విల్సన్‌

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో దళిత, గిరిజన, పేదలకు తీవ్ర అన్యాయం జరిగిందని, వెంటనే బడ్జెట్‌ను సవరించడం ద్వారా ఆయా ప్రజలకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ డిమాండ్‌ చేశారు. ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీ, ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ పథకాలకు కేటాయింపుల్లో జరిగిన అన్యాయంపై వ్యవసాయ కార్మిక సంఘం, దళిత హక్కుల పోరాట సమితి, గిరిజన సమాఖ్యల ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. దీనిలో భాగంగా విజయవాడ చుట్టుగుంటలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ భవన్‌ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జల్లి విల్సన్‌ మాట్లాడుతూ గత బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి రూ.89,400 కోట్లు కేటాయించగా, ఈ పథకాన్ని మరింత బలోపేతం చేయడానికి బదులు 30శాతం నిధులు కోత విధించి, కేవలం 60 వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం దుర్మార్గమన్నారు. ప్రతి వ్యవసాయ కూలీకి 200 రోజులు ఉపాధి కల్పించి, రోజుకు 600 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తక్షణమే కేటాయింపులు పెంపు చేయాలని, 2లక్షల 40 వేల కోట్లు కేటాయించి గ్రామీణ శ్రమజీవులకు ఉపాధి కల్పించాలన్నారు. నిరుపేదలకు అండగా ఉండే ఈ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేయాలని చూస్తే ప్రభుత్వ పతనం తప్పదని హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు సీహెచ్‌ కోటేశ్వరరావు మాట్లాడుతూ 9 దశాబ్దాలుగా సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘాలు పనైనా కల్పించండి..భృతైన ఇవ్వండని జరిపిన పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఉపాధి హామీ పథకాన్ని నీరు గార్చేందుకు మోదీ ప్రభుత్వం బడ్జెట్లో కోతలు విధించి గ్రామీణ పేదలకు తీవ్ర అన్యాయం చేస్తోందని విమర్శించారు. దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి బుట్టి రాయప్ప మాట్లాడుతూ 25శాతం నిధులతో దళితులకు మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయకపోగా, బడ్జెట్లో అరకొర నిధులతో సరిపెట్టడం దారుణమన్నారు. గిరిజన సమాఖ్య రాష్ట్ర నాయకులు బాణావత్‌ పెద్ద బాలునాయక్‌ మాట్లాడుతూ బడ్జెట్లో జరిగిన అన్యాయంపై ఐక్య పోరాటాలు చేయటం ద్వారా హక్కులను సాధించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం ఎన్టీఆర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరు వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు ఉప్పే నరసింహారావు, ఇస్లావత్‌ బుడ్డియా, డీహెచ్‌పీఎస్‌ విజయవాడ నగర అధ్యక్షులు సంగుల పేరయ్య, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కొడాలి ఆనందరావు, లింగాబత్తుల శివకుమార్‌, రాహేల్‌ బాబు, విమల్‌, పూసర్ల లక్ష్మణరావు, ఇస్లావత్‌ కోటమ్మ, తేజావత్‌ లక్ష్మి, ఇస్లావత్‌ హోన, పత్తిపాటి రాజు తదితరులు పాల్గొన్నారు.
వేసవి అలవెన్స్‌ పునరుద్ధరించాలి : ఆవుల శేఖర్‌
ఉపాధి హామీకి రివైజ్డ్‌ బడ్జెట్‌లోనైనా 2లక్షల 40వేల రూపాయలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్‌ డిమాండ్‌ చేశారు. నంద్యాల జిల్లా టెలి కమ్యూనికేషన్‌ సర్వీసెస్‌ సబ్‌ డివిజనల్‌ ఇంజనీర్‌ ఆఫీస్‌ ముందు నంద్యాల జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షులు సుబ్బరాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆవుల శేఖర్‌ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 30కోట్లకు పైగా జాబు కార్డులు కలిగిన పేదలున్నారని, అయితే అందరికీ సక్రమంగా పని కల్పించాలంటే కేంద్ర బడ్జెట్లో రెండు లక్షల 40వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయన్నారు. కేవలం 60,000 కోట్లు మాత్రమే కేటాయించడం పేదలకు జీవన్మరణ సమస్య అయ్యే అవకాశముందన్నారు. కేంద్రం పునరాలోచన చేసి నిధులు పెంచాలని డిమాండ్‌ చేశారు.
వేసవి అలవెన్స్‌ను పునరుద్ధరించాలని, పని ప్రదేశంలో మెడికల్‌ కిట్లు, ఎండ వేడిమిని తట్టుకొనేవిధంగా టెంట్లు ఏర్పాటు చేయాలని, మజ్జిగ పాకెట్లు, తాగునీరు పని ప్రదేశాల్లో ఉండేలా చూడాలని, ఉపాధి కూలీలకు పనిమట్లు ఇవ్వాలని, ఉపాధి కూలీలతో రైతులు పొలాల్లో ఉపయోగపడే పనులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబాఫకృద్దీన్‌, వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు లక్ష్మిదేవి, గోస్పాడు మండల సీపీఐ కార్యదర్శి హరి, రైతు సంఘం జిల్లా కన్వీనర్‌ సోమన్న, ఏఐటీయూసీ జిల్లా నాయకులు శ్రీనివాసులు, ఏఐఎస్‌ఎఫ్‌ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు సురేష్‌, నాయకులు ప్రతాప్‌, యోసేపు, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.
నర్సీపట్నంలో
నర్సీపట్నంలోని శ్రీ కన్య సెంటర్‌ నుంచి పోస్టల్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం పోస్ట్‌ ఆఫీస్‌ వద్ద నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఐ , అనకాపల్లి జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ పాల్గొని మాట్లాడుతూ ఉపాధి హామీకి భారీగా కోత పెట్టడం వలన గ్రామీణ కష్టజీవులు ఉపాధి హామీ కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ప్రజాసంఘాల నాయకులు శివలంక కొండలరావు, డీసీహెచ్‌. క్రాంతి కుమార్‌, పెద్దాడ లోవ రాజు, జి. గురుబాబు, జి.రాధాకృష్ణ, మేకా సత్యనారాయణ, నల్లబెల్లి శ్రీరామ్మూర్తి , మేకా భాస్కరరావు, వై. పాపారావు, ఎస్‌ .నాగేశ్వరరావు, జోగురాజు తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరులో
ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవటానికి ఎటువంటి త్యాగాలకైనా వెనుకాడమని నెల్లూరు జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి నంది పోగుల రమణయ్య అన్నారు. మంగళవారం నెల్లూరులోని జిల్లా ప్రధాన పోస్ట్‌ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిరాజ్‌, ఎస్‌కె. మున్వర్‌, సీపీఐ నెల్లూరు రూరల్‌ మండల సహాయ కార్యదర్శి యర్రబల్లి ఆది నారాయణ, ఏఐవైఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ మున్నా, సీపీఐ జిల్లాసమితి సభ్యులు వాటంబేటి నాగేంద్ర, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ముక్తియాం, వ్యవసాయ కార్మికసంఘంజిల్లా నాయకులు ఎ.రామచంద్రయ్య, గౌషుబ్‌, హాషిన, విజయమ్మ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img