Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

ఉబ్బితబ్బిబ్బైన బోరిస్‌ జాన్సన్‌

భారత్‌ ఘన స్వాగతానికి ఫిదా
సచిన్‌, అమితాబ్‌లా ఫీలయ్యానంటూ వ్యాఖ్య
రక్షణవాణిజ్య బంధం మరింత పటిష్టం : కీలక క్షేత్రాల్లో ఒప్పందాలు ఎఫ్‌టీఏ, ఉక్రెయిన్‌, అఫ్ఘాన్‌, ఇండోపసిఫిక్‌ అంశాలపై
భారత్‌, బ్రిటన్‌ ప్రధానుల విస్తృత చర్చలు ` కలిసి పనిచేయాలని నిర్ణయం

న్యూదిల్లీ : బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తొలిసారిగా భారత్‌లో అధికారికంగా పర్యటించారు. రెండు రోజుల పర్యటన కోసం దేశానికి వచ్చిన ఆయన గురువారం ప్రధాని మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌ను సందర్శించారు. అక్కడ తనకు లభించిన ఘన స్వాగతానికి ఫిదా అయ్యారు. కాసేపు సచిన్‌ టెండూల్కర్‌, అమితాబ్‌ బచ్చన్‌లా ఫీలయ్యానని చెప్పారు. మోదీ తనకు ప్రత్యేక మిత్రుడని అన్నారు. ఆయనను మొదటి పేరుతో అనేకసార్లు సంబోధించారు. బ్రిటన్‌, భారత్‌ మైత్రిని, భాగస్వామ్యాన్ని, సహకార బంధాన్ని మరింత పటిష్టపర్చుకోవడమే తన ఈ పర్యటన ముఖ్యఉద్దేశంగా జాన్సన్‌ చెప్పారు. శుక్రవారం దిల్లీలో పర్యటించిన జాన్సన్‌కు ప్రధాని మోదీ ఘనంగా స్వాగతం పలికారు. ఇరువురు పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇరు దేశాల మధ్య రక్షణ, వాణిజ్యపరంగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద పనులు ఈ ఏడాది చివరికి పూర్తి చేయాలని నిర్ణయించారు. భారత్‌ సొంతంగా యుద్ధ విమానాలు తయారు చేసుకునేలా తమ వంతు సహకరిస్తామని బోరిస్‌ జాన్సన్‌ హామీనిచ్చారు. ద్వైపాక్షిక అంశాలు, అంతర్జాతీయ పరిణామాలపైనా ఇరువురు చర్చించారు. భారత్‌కు ఓపెన్‌ జనరల్‌ ఎక్స్‌పోర్ట్‌ లైసెన్స్‌ (ఓజీఈఎల్‌)ను యూకే ఇవ్వనున్నట్లు జాన్సన్‌ తెలిపారు. తద్వారా రక్షణపరంగా ప్రొక్యూర్‌మెంట్‌కు బ్యూరోక్రసీ తగ్గుతుందని, సరఫరా సమయం ఆదా అవుతుందన్నారు. భూమి, సముద్రం, గగనతలం, అంతరిక్షంతో పాటు సైబర్‌ క్షేత్రాల్లోనూ పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. నూతన ఫైటర్‌ జెట్‌ టెక్నాలజీ (యుద్ధ విమాన పరిజ్ఞానం)తో పాటు సముద్రంలో ముప్పును పసిగట్టడం, స్పందించడంలోనూ భారత్‌కు సహకరిస్తామని బ్రిటన్‌ ప్రధాని చెప్పారు. రక్షణ, భద్రతా భాగస్వామ్యాన్ని విస్తరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) సంబంధించిన పనులను అక్టోబరులో దిపావళికి ముందు పూర్తి చేయాలని ఇరు దేశాల సంబంధిత ప్రతినిధులకు ఆయన సూచించారు. మోదీ మాట్లాడుతూ, ఎఫ్‌టీఏకు సంబంధించి మంచి పురోగతి సాధించామని, యుఏఈ, ఆస్ట్రేలియాతో ఎఫ్‌టీఏ ఒప్పందాలు పూర్తి అయ్యాయని, అదే గతితో బ్రిటన్‌ ఒప్పందంపైనా భారత్‌ పనిచేస్తుందని అన్నారు. రక్షణపరంగా సహకారాన్ని పెంచుకోవాలని తాము నిర్ణయించినట్లు చెప్పారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యసాధనకు బ్రిటన్‌ మద్దతును స్వాగతిస్తున్నామని అన్నారు. తయారీ రంగాలతో పాటు టెక్నాలజీ, డిజైన్‌, అభివృద్ధిపరంగానూ భారత్‌కు బ్రిటన్‌ సహకరిస్తోందని మోదీ చెప్పారు. ఉక్రెయిన్‌ సంక్షోభం గురించి మాట్లాడుతూ, తక్షణమే కాల్పుల విమరణ జరగాలని నొక్కిచెప్పారు. దౌత్యపరంగా చర్చల ద్వారా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ముందు నుంచి సూచిస్తున్నామన్నారు. ఇండో పసిఫిక్‌ సముద్ర వ్యవహారంలోనూ బ్రిటన్‌తో కలిసి భారత్‌ పనిచేస్తుందని అన్నారు. శాంతియుత, సుస్థిర, సురక్షిత అఫ్ఘాన్‌ను భారత్‌ ఆకాంక్షిస్తోందని చెప్పారు. అఫ్ఘాన్‌ భూభాగాన్ని ఇతర దేశాల్లో ఉగ్రవాదాన్ని వ్యాపింపజేసేందుకు వినియోగించరాదన్నారు. జాన్సన్‌ మాట్లాడుతూ మోదీతో చర్చలు అద్భుతంగా జరిగినట్లు తెలిపారు. బ్రిటన్‌, భారత్‌ స్నేహం పటిష్టమైనదన్నారు. బ్రిటన్‌లో తయారయ్యే వైద్యపరికరాలను భారత్‌కు ఎగుమతి చేసేందుకు కొత్త చర్యలను ప్రకటిస్తున్నట్లు తెలిపారు. బ్రిటన్‌ ఉన్నత విద్యార్హుతల పరస్పర గుర్తింపునకూ హామీనిస్తున్నట్లు చెప్పారు. స్వచ్ఛమైన పునరుత్పాదక శక్తి కోసం సహకారంపైనా ఇద్దరు ప్రధాన మంత్రులు చర్చించారని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, గ్రీన్‌ హైడ్రోజన్‌ను పెంచేలా, సీఓపీ26లో ప్రకటించిన గ్రీన్‌ గ్రిడ్స్‌ ఇనిషియేటివ్‌కు అనుగుణంగా ప్రణాళికలు ఉండేలా నిర్ణయించినట్లు పేర్కొన్నాయి. వర్చువల్‌ హైడ్రోజన్‌ సైన్స్‌, ఇన్నోవేషన్‌ హబ్‌లను ఇరు వర్గాలు ప్రారంభించాయని తెలిపాయి. ఇదిలావుంటే, వాణిజ్య, ఆర్థిక, రక్షణ, భద్రత, వాతావరణమార్పు తదితర కీలక క్షేత్రాల్లో పరస్పరం సహకరించుకునేలా పదేళ్ల కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకోవడం, ఆచరించడం కోసం కట్టుబడి ఉన్నట్లు మోదీ, జాన్సన్‌ వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img