విభజన ప్రక్రియలో అస్తవ్యస్త విధానాలతో ఇబ్బందులు
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రజాందోళనలు
అధికారపార్టీ నేతల్లోనూ తీవ్ర అసంతృప్తులు
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: ఉగాది రోజే కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభించాలన్న పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా విభజన ప్రక్రియ చేస్తుండగా, మరోపక్క ప్రజల్లోనూ అదేస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తామని వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనడంతోపాటు, పాదయాత్రలో సీఎం జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఆమేరకు రెండున్నరేళ్ల తర్వాత విభజన ప్రక్రియను అర్థాంతరంగా జగన్ తెరపైకి తెచ్చారు. అనేక ప్రజా సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో ప్రజలను పక్కదారి పట్టించేందుకే జిల్లాల విభజన చేపట్టారని ప్రతిపక్షాలు విమర్శిస్తుండగా, విభజన ప్రక్రియలో ప్రభుత్వం ఏకపక్షంగా అవలంబిస్తున్న అశాస్త్రీయ, అస్తవ్యస్త విధానాలతో అన్ని జిల్లాల్లోనూ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కొత్త జిల్లాల పేర్ల ఎంపిక, జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, శాసనసభ నియోజకవర్గాల సరిహద్దు గ్రామాల విలీనంలో మార్పులు తదితర అనేక అంశాలపై ప్రజాందోళనలు జరుగుతున్నాయి. ఏ జిల్లాను పరిశీలించినా, ఏ ఊరును కదలించినా అనేక కొత్త ఇబ్బందులు, సమస్యలు వెలుగు చూస్తున్నాయి. వాస్తవానికి కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరించే అవకాశం ప్రభుత్వం కల్పించింది. మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ముందుగా ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ప్రకారం ఏర్పాట్లు చేపడుతోంది. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుసరించిన విధానాన్ని కూడా అధికారులు అధ్యయనం చేస్తున్నారు. అయితే పార్లమెంటు నియోజకవర్గానికి ఒక జిల్లా ఏర్పాటుతో తెలంగాణ కంటే ఏపీలో తేలిగ్గా విభజన ప్రక్రియ జరగనుంది. ఏజెన్సీ ప్రాంతాన్ని రెండు జిల్లాలు చేస్తున్న ప్రభుత్వం, మిగిలిన 24 పార్లమెంటు నియోజకవర్గాలను ఒక్కొక్క జిల్లాగా విభజిస్తోంది. లోక్‌సభ స్థానాల సరిహద్దులకు కట్టుబడి జిల్లాల ఏర్పాటుకు వివిధ అంశాలు అననుకూలంగా ఉన్నా యంటూ భిన్నమైన ప్రాతిపదికలను వర్తింపు చేసి జిల్లాల సరిహద్దులను, జిల్లాల కేంద్రాలను, రెవెన్యూ డివిజన్లను నిర్ణయించింది. అలాగే కొత్త జిల్లా పేర్లపై కూడా ప్రభుత్వం కనీసం అఖిలపక్ష సమావేశం నిర్వహించడం గాని, ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం కాని చేయలేదు. చివరకు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సూచనలు సైతం పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఆపార్టీ నేతలు బహిరంగంగానే ప్రభుత్వ నిర్ణయాలను విమర్శిస్తున్నారు. ఆనాడు రాష్ట్ర విభజనలాగే ప్రస్తుతం జిల్లాల విభజన ప్రక్రియ విధానం అశాస్త్రీయంగా ఉందని నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి మీడియా సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. అలాగే జిల్లాల పునర్విభజనలో భౌగోళిక స్వరూపాన్ని, సామాజిక – సాంస్కృతిక అంశాలను, విస్తీర్ణం – జనాభా, సహజ వనరులు, పరిశ్రమలు, సాగునీటి సదుపాయాలు, విద్యా సంస్థలు, రవాణా తదితర మౌలిక సదుపాయాలను, చారిత్రక ప్రాధాన్యతాంశాలను పరిగణలోకి తీసుకోలేదు. ఫలితంగా కొన్ని జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఉదాహరణకు కృష్ణాజిల్లాలో ప్రస్తుతం ఒక ప్రభుత్వ, రెండు ప్రైవేటు మెడికల్ కళాశాలలు ఉండగా, ఇవి మూడూ కొత్తగా ఏర్పాటయ్యే ఎన్టీఆర్ జిల్లా ప్రజలకే అందుబాటులో ఉండనున్నాయి. అలాగే ఇంజనీరింగ్ కాలేజీలు కూడా మెజార్టీ ఎన్టీఆర్ జిల్లాకే పరిమితం కానున్నాయి. అలాగే జలశయాలు, నీటి పంపకాల్లో కూడా ఇబ్బందులు ఎదురు కానున్నాయి. ఇలా ప్రభుత్వం జారీ చేసిన నూతన జిల్లాల గెజిట్ నోటిఫికేషన్లును పరిశీలిస్తే అసంబద్ధమైన, ఏ మాత్రం హేతుబద్ధత లేని అంశాలున్నాయి. కాబట్టే ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు, కొత్త కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. 2026లో డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాలని 2001లో పార్లమెంటు చట్టం చేసింది. దానిప్రకారం రాష్ట్రంలో ఎంపీ సీట్లు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014, విభాగం-3, సెక్షన్ -26(1) మేరకు ప్రస్తుతం ఉన్న 175 శాసనసభ నియోజకవర్గాలను 225కు పెంచుతూ భారత ఎన్నికల కమిషన్ పునర్విభజన చేయాలి. ఏడేళ్లు గడిచిపోయినా మోదీ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ దీనిపై దృష్టిసారించలేదు. దీనిప్రకారం డీలిమిటేషన్ జరిగితే ప్రస్తుతం ఉన్న పార్లమెంటు నియోజకవర్గ సరిహద్దుల ప్రకారం ఏర్పాటవు తున్న కొత్త జిల్లాల పరిస్థితి మళ్లీ అస్తవ్యస్తమవుతుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ జరిగిన తర్వాతే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని రాజకీయ విశ్లేషకులు కోరుతున్నారు. లోక్ సభ నియోజకవర్గం కాకుండా శాసనసభ నియోజకవర్గం సరిహద్దులను ప్రామాణికంగా తీసుకోవాలని, అది కూడా శాసనసభ స్థానాల పునర్వి భజన అనంతరం జిల్లాల పునర్విభజన ప్రక్రియ చేపడితే సమస్యలు తలెత్తే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇక కొత్త జిల్లా పేర్ల నిర్ణయం కూడా అశాస్త్రీయ పద్ధతిలో జరిగింది. ఉదాహరణకు కృష్ణాజిల్లాలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జన్మించిన నిమ్మకూరు గ్రామం మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉండగా, దానికి ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టాల్సింది పోయి, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ జిల్లాకు ఆయన పేరు పెట్టడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, 6 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కృష్ణానది పారుతూ ఉంటుంది. కృష్ణా బ్యారేజ్ కూడా ఇక్కడే ఉంది. అటువంటి నియోజకవర్గానికి కృష్ణా నది పేరు ఉంచి, ఎన్టీఆర్ జన్మించిన మచిలీపట్నం నియోజకవర్గానికి ఎన్టీఆర్ జిల్లా నామకరణం చేస్తే సబబుగా ఉంటుందని కొందరు సూచిస్తుండగా, అదే నియోజకవర్గానికి చెందిన భూపోరాట యోధ, కమ్యూ నిస్టుపార్టీ అగ్రనాయకులు అమరజీవి చండ్ర రాజేశ్వర రావు పేరు పెట్టాలని మెజారిటీ ప్రజలు కోరుతున్నారు. అలాగే విజయవాడ నగరంలో భాగంగా ఉన్న పెనమ లూరు, ఆ నియోజకవర్గ పరిధిలోని దాదాపు 50 గ్రామా లకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నం జిల్లా కేంద్రం కావడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. విజయవాడ నగరంతో దశాబ్దాలుగా మమేకమైన నూజివీడు పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో కలప డాన్ని వ్యతిరేకిస్తూ ఆ ప్రాంత ప్రజలు నిరవధిక ఆందోళన చేస్తున్నారు. నెల్లూరు పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న గూడూరు పరిస్థితి కూడా అలాగే ఉంది. కడప జిల్లాలో అన్నమయ్య జన్మస్థలం తాళ్లపాక రాజం పేటకు సమీపంలో ఉండగా, దానికి అన్నమయ్య జిల్లాకు నామకరణం చేసి, జిల్లా కేంద్రాన్ని రాజంపేటకు బదులు రాయచోటిని ప్రతిపాదించారు. హిందూపురం లోక్ సభ నియోజకవర్గం కేంద్రం. అనంతపురం జిల్లాలో రెండో పెద్ద పట్టణం. బెంగళూరు అంతర్జాతీయ విమానా శ్రయానికి సమీపంలో ఉంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అన్ని అవకాశాలు ఉన్న పట్టణం. నందమూరి బాలకృష్ణను దృష్టిలో పెట్టుకుని ఆ పట్టణాన్ని కాదని పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ఎంపిక చేశారు. పాలకొండ, పార్వతీపురం, సాలూరు, కురుపాం శాసనసభ నియోజకవర్గాలతో నూతనంగా మన్యం (గిరిజన) జిల్లాను పార్వతీపురం కేంద్రంగా ప్రతిపాదిం చగా, పాలకొండను జిల్లా కేంద్రం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పాడేరు, అరకు, రంపచోడవరం శాసనసభ నియోజకవర్గాలతో నూతనంగా అల్లూరి సీతారామరాజు జిల్లాను పాడేరు కేంద్రంగా ప్రతిపాదించారు. రంపచోడవరం నియోజకవర్గానికి పాడేరు సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అందువల్ల రంపచోడవరం కేంద్రంగా 11 మండలాలతో ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలి లేదా రాజమహేం ద్రవరం దగ్గరలో ఉన్నది కాబట్టి తూర్పు గోదావరి జిల్లాలో చేర్చాలని కోరుతున్నారు. నర్సీపట్నంను జిల్లా కేంద్రంగా కాకుండా విశాఖపట్నానికి అతిసమీపంలో ఉన్న అనకాపల్లిని జిల్లా కేంద్రంగా ఎంపిక చేయడం, విశాఖపట్టణంలో అంతర్భాగంగా ఉన్న పెందుర్తి శాసనసభ నియోజకవర్గాన్ని అనకాపల్లి జిల్లాలో చేర్చడంపై విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. కోనసీమ జిల్లాలో చేర్చబడిన గోకవరం, ఆలమూరు మండలాలను రాజమహేంద్రవరం కేంద్రంగా ప్రతిపాదించబడాన్ని వ్యతిరేకిస్తున్నారు. లోక్ సభ నియోజకవర్గం కేంద్రమైన నర్సాపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తు న్నారు. కందుకూరు శాసనసభ నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ, ప్రకాశం జిల్లాను రెండు జిల్లాలుగా విభజించాలని, మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ప్రజలు ఆందోళన చేస్తున్నారు. మదనపల్లి కేంద్రంగా పుంగ నూరు, పీలేరు, తంబళ్లపల్లి, మదనపల్లి శాసనసభ నియోజకవర్గాలతో ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇలా అన్ని జిల్లాల్లోనూ కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, జిల్లాల పేర్ల ఎంపిక, సరిహద్దుల్లో మార్పులు తదితర అంశాలపై ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటిపై రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో ప్రభుత్వం చర్చించాలని, ప్రజాభిప్రా యాన్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం హేతుబద్ధంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు.