Friday, August 12, 2022
Friday, August 12, 2022

ఊళ్లకు ఊళ్లే మునక

గోదావరి తీరం గజగజ

51 లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో తెగిన సంబంధాలు

భద్రాచలం వద్ద తగ్గినా ధవళేశ్వరంలో పెరుగుతున్న వరద ఉధృతి
పునరావాస కేంద్రాలకు 80 వేలమంది బాధితులు
మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్‌ ఆదేశం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: గోదావరి వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. భద్రాచలం వద్ద కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద మాత్రం నీటిమట్టం ఎక్కువవుతోంది. దీంతో గోదావరి తీర గ్రామాలు గజ గజ వణుకుతున్నాయి. ప్రస్తుతం 25.29 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ఆ మొత్తాన్ని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అయితే ఎగువ ప్రాంతంలో వరద ఉధృతి కొంత తగ్గుముఖం పట్టడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. భద్రాచలం వద్ద శుక్రవారం నీటిమట్టం 70.8 అడుగులకు చేరుకోగా శనివారం అది 68 అడుగులకు పడిపోయింది. ధవళేశ్వరం వద్ద ఈ రాత్రికి 28 లక్షలకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి ఉధృతితో వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ధగౌతమి పాయలు పోటెత్తుతున్నాయి. గోదావరి పాయలు ముంచెత్తడంతో లంకల్లోకి ఆరడగుల మేర వరద నీరు చేరింది. కోనసీమలో 51 లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దాదాపు 44 మండలాల పరిధిలో 645 గ్రామాలపై వరద ప్రభావం చూపిస్తోంది. తీర ప్రాంతాల్లో ఎటు చూసినా ఊళ్లకు ఊళ్లు నీట మునిగి దర్శనమిస్తున్నాయి. గోదావరి గర్జకు తల్లడిల్లుతున్న ప్రజలు సహాయ శిబిరాలకు తరలుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 177 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయగా, వాటిల్లో 80వేల మంది బాధితులు తలదాచుకుంటున్నారు. వీరుగాక దగ్గరలోని మెరకప్రాంతాల్లో నివసించే బంధువులు, స్నేహితుల ఇళ్లకు వేలాదిమంది తరలి వెళుతున్నారు. ఎన్టీఆర్‌ఎఫ్‌, ఎస్టీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రేయంబవళ్లూ బాధితులకు అవిశ్రాంతంగా సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. ఏటిగట్లపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. 40 వేల ఇసుక బస్తాలతో బలహీన ప్రాంతాల్లో ఏటిగట్లను పటిష్ట పరిచే ఏర్పాట్లు చేపడుతున్నారు. వరద ప్రభావంతో ఇంజినీరింగ్‌ విభాగాలను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. గండ్లు పడే ప్రమాదం ఉన్నచోట అదనంగా సిబ్బందిని, సామగ్రిని సమీకరించాలని ఆదేశించింది. ఏటి గట్లను యుద్ధప్రాతిపదికన మరింత పటిష్టవంతం చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
గోదావరి వరదలపై సీఎం జగన్‌ అత్యవసర సమీక్ష
గోదావరి వరదలు, సహాయ కార్యక్రమాలపై సీఎం జగన్‌ శనివారం ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. తాజా పరిస్థితిపై ఆరా తీశారు. ఎగువ ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టినప్పటికీ మరో 24 గంటలపాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అవసరమైనంత మేర సహాయ బృందాలను వినియోగించుకోవాలని, సహాయ శిబిరాల ఏర్పాటు, సౌకర్యాల కల్పనలో తగిన చర్యలు తీసుకోవాలని, సేవలు నాణ్యంగా ఉండాలని స్పష్టం చేశారు. వరద బాధిత కుటుంబాలకు రేషన్‌ పంపిణీ చేయాలని, ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కిలో పామాయిల్‌, కేజీ ఉల్లిపాయలు అందించాలని సూచించారు. ప్రతి కుటుంబానికి రూ.2వేలు లేదా వ్యక్తికి రూ.వేయి చొప్పున శిబిరాలు విడిచి వెళ్లేలోగానే పంపిణీ చేయాలని, ఈ పనులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి గంటకూ వరద పరిస్థితిపై తనకు నివేదించాలని ఆదేశించారు.
వరద పరిస్థితిని పర్యవేక్షించిన మంత్రి అంబటి
వరద పరిస్థితికి అనుగుణంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆదేశించారు. శనివారం ధవళేశ్వరం బ్యారేజీ వ్యూ పాయింట్‌ వద్ద నుంచి వరద పరిస్థితిపై ప్రత్యేక అధికారి హెచ్‌ అరుణ్‌ కుమార్‌, జిల్లా కలెక్టర్‌ కే మాధవీలతతో సమీక్షించారు. ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి, దిగువకు వరద నీరు విడుదల సమయంలో చేపడుతున్న రక్షణ చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ముంపు ప్రాంతాలలోని కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు పెట్రోలింగ్‌ బృందాలతో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని స్పష్టం చేశారు. జిల్లా వరదల పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టిన ప్రత్యేక అధికారి హెచ్‌ అరుణ్‌ కుమార్‌, జిల్లా కలెక్టర్‌ ప్రస్తుత వరద పరిస్థితిని మంత్రికి వివరించారు. ముంపు గ్రామాలలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిరావాలని కోరినప్పటికీ, కొందరు రావడం లేదని, ముంపునకు గురికామనే ధీమాతో కొందరు ఉన్నట్లు తెలిపారు. వరద పరిస్థితికి అనుగుణంగా అవసరమైతే ప్రతి ఒక్కరినీ తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img