రాహుల్‌పై అనర్హతవేటు సరికాదు: సీపీఐ
న్యూదిల్లీ : అనేక సమస్యలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసేందుకు వెళుతున్న ప్రతిపక్ష పార్టీల ఎంపీలను దిల్లీ పోలీసులు నిర్బంధించడాన్ని సీపీఐ తీవ్రంగా ఖండిరచింది. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీకి శిక్ష విధించడం, వెంటనే ఆయనను ఎంపీగా అనర్హుడిగా ప్రకటించడాన్ని తప్పుపట్టింది. సీపీఐ జాతీయ కార్యదర్శివర్గం ఈ మేరకు శుక్రవారం పత్రికలకు ఓ ప్రకటన విడుదల చేసింది. సీపీఐ ఎంపీ సంతోశ్ కుమార్ సహా ప్రతిపక్ష ఎంపీలను కేంద్ర హోంమంత్రిత్వశాఖ నియంతృణలో పనిచేస్తున్న దిల్లీ పోలీసులు నిర్బంధించడం విచారకరమని సీపీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్‌గాంధీపై అనర్హత వేటు ప్రజాస్వామ్య భవిష్యత్తు, అసమ్మతిని వ్యక్తం చేసే స్వేచ్ఛ, రాజ్యాంగ సంస్థల ఉనికి వంటి అనేక ప్రశ్నలను లేవనెత్తుతోందని పేర్కొంది. అదానీ కుంభకోణంపై జేపీసీ వేయాలన్న డిమాండ్‌ను తిరస్కరించడం ద్వారా బీజేపీఆర్‌ఎస్‌ఎస్ ప్రభుత్వం పార్లమెంటును, ప్రజాస్వామ్య విలువలను మంటగలిపిందని విమర్శించింది. దేశంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం బీజేపీ
ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, అందుకోసం అన్ని లౌకిక, ప్రజాస్వామిక శక్తులు, ప్రజలు ఐక్యంగా పోరాటం చేయాలని సీపీఐ పిలుపునిచ్చింది.