. సుప్రీంలో ముందస్తు బెయిల్‌కు యత్నం
. విచారణ తేదీని ఖరారు చేయని సీజేఐ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డి బుధవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ తన పిటిషన్‌ను విచారించేలా ఆదేశించాలని కోరారు. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో ఆయన పిటిషన్ దాఖలు చేయగా, సీజేఐ ధర్మాసనం విచారణ తేదీని ఖరారు చేయలేదు. విచారణ అత్యవసరమైతే రాతపూర్వక అభ్యర్థన ఇవ్వాలని, దానిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సూచించారు. ఎంపీ అవినాశ్ మంగళవారం సీబీఐ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉండగా… చివరి నిమిషంలో తనకు నాలుగు రోజులు సమయం ఇవ్వాలని సీబీఐని కోరారు. అది కూడా సీబీఐకి ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని పంపారు. మొదట నిరాకరించిన సీబీఐ… విచారణకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. ఆ తరువాత కొద్ది గంటలకే అవినాశ్ విజ్ఞప్తిని సీబీఐ అంగీకరిస్తూ ఈనెల 19న విచారణకు రావాల్సిందిగా ఎంపీకి నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ నుంచి పులివెందుల బయలుదేరిన అవినాశ్‌రెడ్డికి మార్గమధ్యలోనే ఆయన వాట్సాప్‌కు సీబీఐ నోటీసులు అందాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈనెల 19న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాల్సిందే అంటూ దానిలో స్పష్టం చేసింది. అలాగే విచారణకు రావాలని నోటీసు ఇచ్చేందుకు సీబీఐ అధికారులు పులివెందులలోని ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి ఇంటికి వెళ్లగా… ఆయన లేకపోవడంతో తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి డ్రైవరు నాగరాజుకు సీఆర్‌పీసీ 160 నోటీసును అందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సీబీఐ అధికారులు ఈసారి అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావిస్తున్న అవినాశ్… నాలుగు రోజుల గడువు కోరి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.