కార్యకర్తలు, ప్రజలతో భేటీలు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాదర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల బెంగళూరు నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి జగన్ చేరుకున్నారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్‌లో నిర్వహించారు. దీనికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చి సమస్యలను విన్నవించారు. జగన్‌ను కలిసేందుకు ఆయన నివాసం వద్ద బారులు తీరారు. అక్కడి భద్రతా సిబ్బంది వారిని అంచెలంచెలుగా లోపలికి పంపారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం కేవలం పార్టీ నేతలతోనే జగన్ భేటీలు నిర్వహించి, ఓటమికి గల కారణాలను తెలుసుకున్నారు. ఆ తర్వాత పార్టీ నేతలపై దాడులు, హత్యలపై జగన్ తీవ్రంగా స్పందించి దిల్లీలో ధర్నా చేశారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా, కూటమి ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై…తన క్యాంపు కార్యాలయం నుంచే జగన్ మీడియా సమావేశం నిర్వహించి, తగిన వివరణిచ్చారు. ఇప్పుడు మళ్లీ సాధారణ కార్యకర్తలు, ప్రజలతో జగన్ మమేకమవుతున్నారు.
అనూహ్య మార్పు
జగన్‌లో అనూహ్యంగా వచ్చిన మార్పుపై సొంత పార్టీ నేతలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు జగన్ ఎలాంటి ప్రజాదర్బార్ నిర్వహించలేదు. ప్రజలను కలిసేందుకు తగిన కార్యక్రమాలనూ చేపట్టలేదు. అత్యంత భద్రత నడుమ జగన్ నివాసం ఉండేది. పైపెచ్చు జగన్ నివాసం వైపుకు రాకపోకలు లేకుండా నియంత్రించారు. నిత్యం భారీ పోలీసు బందోబస్తు నడుమ జగన్ పర్యటనలు ఉండేవి. ఎన్నికల సమయంలో జగన్ బస్సు యాత్ర సందర్భంగా..అక్కడక్కడా ప్రజలను కలిసేందుకు ప్రయత్నించారు. అంతకుమించి నేరుగా ఆయన ప్రజల్లోకి వెళ్లిన సందర్భాల్లేవు. దీనిపైనా విపక్షాల నుంచి పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. పరదాల మధ్య జగన్ పర్యటనలు ఉంటున్నాయంటూ ఆక్షేపించారు. ఇక ప్రతిపక్ష పార్టీలకైతే కనీసం అపాయింట్‌మెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అందుకు భిన్నంగా సీఎం చంద్రబాబు…విపక్ష పార్టీల నాయకులను కలిసేందుకు అపాయింట్‌మెంట్లు ఇస్తున్నారు. ఓటమి అనంతరం జగన్ తన శైలిలో మార్పులు చేసుకున్నట్లు కన్పిస్తోంది. అందువల్లే కార్యకర్తలు, ప్రజలను కలుసుకుని, వారి సమస్యలను ఆరా తీసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరూ అధైర్య పడవద్దని, మీకు అండగా నిలుస్తామని జగన్ వారికి భరోసా ఇస్తున్నారు. అందరం కలసి కట్టుగా వెళ్లాల్సిన అవసరముందని వారికి సూచిస్తున్నారు. తన దగ్గరకు వచ్చిన సామాన్య ప్రజలు, కార్యకర్తలను జగన్ పలుకరించి, వారి కష్టసుఖాలను ఆలకిస్తున్నారు. రాబోయే కాలంలో ప్రతి కార్యకర్తకు తనతోపాటు వైసీపీ అండగా నిలుస్తుందని చెప్పారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి విశాఖ నగర పాలక సంస్థకు చెందిన వైసీపీ కార్పొరేటర్లు హాజరయ్యారు. చాలా మంది కార్పొరేటర్లు పార్టీని వీడతారన్న ప్రచారంతో వారిని జగన్ తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకున్నట్లు తెలిసింది.