ఎలాంటి బలవంతం లేదు
నూతన విద్యా విధానంపై దృష్టి పెట్టాలి
పాఠశాలల్లో సదుపాయాలపై ఒక నంబరు
భాషా ఉచ్ఛారణపై దృష్టి
ప్రతిరోజూ మూడు పదాలు నేర్పాలి
బసమీక్షా సమావేశంలో సీఎం జగన్
విశాలాంధ్ర బ్యూరో ` అమరావతి : ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వానికి అప్పగించడం అన్నది పూర్తిగా స్వచ్ఛందమని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణల అమలుపై సీఎం జగన్ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో బుధవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన విద్యా విధానం అమలు, తీసుకున్న చర్యలపై సీఎం ఆరాతీశారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా టీచర్లను నియమించడంతోపాటు సబ్జెక్టుల వారీగా టీచర్లు, వారితో బోధనే లక్ష్యంగా నూతన విద్యా విధానం వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా శాటిలైట్ ఫౌండేషనల్ స్కూళ్లు, ఫౌండేషనల్ స్కూళ్లు, ఫౌండేషనల్ ప్లస్ స్కూళ్లు, ప్రీ హైస్కూళ్లు, హైస్కూళ్లు, హైస్కూల్ ప్లస్ స్కూళ్లపై ముఖ్యమంత్రికి అధికారులు వివరాలు అందించారు. సీఎం మాట్లాడుతూ వివిధ కారణాలతో నడుపుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారికి ప్రభుత్వం ఒక అవకాశం మాత్రమే కల్పిస్తుందని ప్రస్తావించారు. ఇష్టం ఉన్నవారు స్వచ్ఛందంగా ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయొచ్చని, లేదంటే యథాతథంగా నడుపుకోవచ్చని పునరుద్ఘాటించారు. విలీనం చేస్తే వారి పేర్లు కొనసాగిస్తామని, ప్రభుత్వంలో విలీనానికి ముందు అంగీకరించిన వారు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని నడుపుకుంటామంటే నిరభ్యంతరంగా వెనక్కి తీసుకోవచ్చని సూచించారు. విద్యార్థులకు మంచి సదుపాయాలు, నాణ్యమైన విద్య అందాలన్నదే ఉద్దేశమన్నారు. ఈ ప్రక్రియలో ఎక్కడా బలవంతం లేదని, ఈ విషయంలో అపోహలకు గురికావొద్దని, రాజకీయాలు కూడా తగవని చెప్పారు. అనంతరం 202122 నుంచి 2022-23, 2023-24 వరకూ మూడు విద్యా సంవత్సరాల్లో నూతన విద్యా విధానం మూడు దశలుగా పూర్తిగా అమలు కానున్నట్లు అధికారులు సీఎంకు చెప్పారు. దీనిలో భాగంగా 25,396 ప్రాథమిక పాఠశాలలను యూపీ(అప్పర్ ప్రైమరీ) స్కూళ్లు, హైస్కూళ్లలో విలీనం చేయనున్నట్లు తెలిపారు. తొలి దశలో భాగంగా ఈ విద్యా సంవత్సరం 2,663 స్కూళ్లు విలీనం చేశామని, 2,05,071 మంది విద్యార్థులు నూతన విద్యావిధానం అనుసరించి విలీనం అయ్యారని వివరించారు. మొత్తంగా ఈ ప్రక్రియలో 9.5 లక్షల మంది విద్యార్థులకు నూతన విద్యావిధానం ఈ సంవత్సరమే అందుబాటులోకి వచ్చిందని అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై సీఎం మాట్లాడుతూ రానున్న విద్యా సంవత్సరంలో నూతన విద్యావిధానం అమలు చేయడానికి అవసరమైన చోట్ల అదనపు తరగతి గదుల నిర్మాణంపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. సీబీఎస్ఈ అఫిలియేషన్‌పై సమీక్ష సీబీఎస్ఈ అఫిలియేషన్ సీఎం సమీక్షలో భాగంగా, 1,092 పాఠశాలలను 2021
22 విద్యా సంవత్సరంలో సీబీఎస్ఈ అఫిలియేషన్ జరిగాయని అధికారులు వివరించారు. ఈ విద్యార్థులు 2024`25 నాటికి పదోతరగతి పరీక్షలు రాస్తారని తెలిపారు. దీనిపై సీఎం మాట్లాడుతూ ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్న డైట్ సంస్థల సమర్థత పెంచాలని, వారికి అత్యంత నాణ్యమైన శిక్షణ అందాలని అన్నారు. ప్రతి పాఠశాలలో సదుపాయాలపై ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే వెంటనే కాల్ చేసేలా ఒక నంబర్ పెట్టాలని ఆదేశించారు. ఈ కాల్ సెంటర్‌ను అధికారులు పర్యవేక్షణ చేసిన వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని, తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇంగ్లీషు ఉచ్ఛారణ, భాష, వ్యాకరణాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, దీనికోసం పాఠ్యప్రణాళికలో దృష్టిపెట్టాలని పేర్కొన్నారు. పిల్లలకు ఇదివరకే నిఘంటువులు ఇచ్చామని, వాటిని వినియోగించుకోవాలని తెలిపారు. ప్రతిరోజూ కనీసం మూడు పదాలు నేర్పించాలని, ఆ పదాలను వినియోగించడంపై పిల్లలకు నేర్పించాలని ఆదేశించారు. మన ఇంట్లో మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలని ఎలా అనుకుంటామో, పిల్లలు చదివే పాఠశాలల్లో కూడా మరుగుదొడ్లు అలాగే ఉండాలని అధికారులకు సూచించారు. నాణ్యమైన సదుపాయాలు అన్నది అందరి లక్ష్యం కావాన్నారు. పాఠశాలలకు హెడ్మాస్టర్లు కుటుంబ పెద్దలు అని, ఆ పాఠశాలల్లో నాణ్యమైనరీతిలో బోధన దగ్గర నుంచి మొదలు భోజనం నుంచి ఇతర సదుపాయాలు, మౌలిక వసతులపై తనిఖీలు చేసి వాటిని సవ్యంగా ఉండేలా వారు చూడాలని ఆదేశించారు. అంతర్జాలం, ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా వివిధ అంశాలను నేర్చుకోవడం, వాటిని ఇతరులకు నేర్పించడం లాంటి కాన్సెప్ట్‌ను పిల్లలకు నేర్పించాలని అధికారులకు సీఎం నిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.ఆర్.అనురాధ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ (ఎండీఎం అండ్ శానిటేషన్) బి.ఎం.దివాన్, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కృతికా శుక్లా, సర్వశిక్షా అభయాన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ వెట్రిసెల్వి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.చినవీరభద్రుడు, ఏపీఆర్ఈఐఎస్ సెక్రటరీ వి.రాములు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.