ప్రధానికి కేంద్ర కార్మిక సంఘాల విజ్ఞప్తి
న్యూదిల్లీ : టాటాలకు ఎయిర్ ఇండియా అమ్మకాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ పది కేంద్ర కార్మిక సంఘాలు మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఒక సంయుక్త లేఖను రాశాయి. ‘జాతీయ ఆస్తుల అమ్మకం విధానం’ అని పేర్కొంటున్న దానిని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశాయి. దేశ ప్రజలు, ప్రత్యేకించి ఎయిర్ ఇండియా ఉద్యోగులు ఇటీవల ప్రకటించిన జాతీయ రవాణా సంస్థ అమ్మకం పట్ల అసంతృప్తితో ఉన్నారని కార్మిక సంఘాలు తెలిపాయి.
‘తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం’
‘ఎయిర్ ఇండియాను హుక్ లేదా క్రూక్ ద్వారా విక్రయించడం ద్వారా ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించింది’ అని లేఖలో పేర్కొన్నాయి. అయితే గతంలో ఎయిర్ ఇండియా ప్రమాదకర ఆర్థిక స్థితిలో ఉంచిన నిర్ణయాలను జాబితా చేసింది. 900 విదేశీ, భారత విమానాశ్రయాలలో 1,800 అంతర్జాతీయ, 4,400 దేశీయ స్లాట్లు, సుశిక్షితులైన సిబ్బంది, 141 విమానాలతో కూడిన ఎయిర్ ఇండియా అమ్మకం కొత్త యజమానులకు లాభదాయకత కోసం మరిన్ని మార్గాలను అందిస్తుందని పది కేంద్ర కార్మిక సంఘాలు నొక్కి చెప్పాయి.
పరిమిత పోటీని సులభతరం చేస్తుంది..
‘ఎయిర్ ఇండియాను టాటాలకు విక్రయించడం ఒలిగోపోలీ(పరిమిత పోటీ)ని సులభతరం చేస్తుంది. ఎయిర్ ఇండియా, విస్తారా, ఎయిర్ ఏషియా (చివరి రెండు కూడా టాటాల యాజమాన్యంలో ఉన్నాయి) మూడు ఎయిర్లైన్స్ల సంయుక్త ఆదాయం.. మొత్తం పరిశ్రమ మొత్తం ఆదాయాలలో 95,700 కోట్లుకుగాను 2020లో40,500 కోట్లు, అంటే 42.32 శాతం. అయితే ఇండిగో 37.41 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఏ విధంగా చూసినా, ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ఫలితంగా భారతదేశంలో అత్యంత కేంద్రీకృత మార్కెట్లలో ఒకటి ఏర్పడిరదని దీని అర్థం’ అని పేర్కొన్నాయి. కోవిడ్`19 లాక్డౌన్ సమయంలో విశేష సేవలు అందించిన 14 వేల మంది విమానయాన ఉద్యోగుల భవిష్యత్తుపై స్పష్టత లేదని వివరించాయి. ఈ లేఖపై కేంద్ర కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హిందూ మజ్దూర్ సభ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్, ఏఐసీసీటీయూ, లేబర్ ప్రోగ్రెసివ్ ఫెడరేషన్, యూటీయూసీలు సంతకాలు చేశాయి.