Tuesday, January 31, 2023
Tuesday, January 31, 2023

ఎరుపెక్కిన ఏపీ

వాడవాడలా సీపీఐ వ్యవస్థాపక దినోత్సవం

. రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు, బహిరంగ సభలు
. కమ్యూనిస్టు సిద్ధాంతం సజీవం: ఈడ్పుగంటి
. లౌకిక, ప్రజాతంత్ర శక్తులు ఏకం కావాలి: రామకృష్ణ పిలుపు

భారత కమ్యూనిస్టు పార్టీ 98వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. వాడవాడలా సీపీఐ పతాకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎక్కడికక్కడే భారీ ప్రదర్శనలు, బహిరంగ సభలు నిర్వహించారు. పార్టీ పతాకాలు, తోరణాలు, బ్యానర్లు, కటౌట్ల అలంకరణలతో, రెడ్‌ వాలంటీర్ల కవాతులతో రాష్ట్రంలో ఎటుచూసినా ఎరుపుమయమైంది. సీపీఐ, ఏఐవైఎఫ్‌, ఏఐఎస్‌ఎఫ్‌, మహిళా సమాఖ్య, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఏఐటీయూసీ, దానికి అనుబంధంగా ఉన్న అనేక సంఘాలకు చెందిన కార్యకర్తలు ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఎక్కడచూసినా ఒక పండుగ వాతావరణం నెలకొంది. ‘‘ఎరుపులోన మెరుపు ఉంది, పోరాడే శక్తి ఉంది. జిందాబాద్‌ కమ్యూనిస్టు పార్టీ, వర్థిల్లాలి ఎర్రజెండా, లాంగ్‌లీవ్‌ సీపీఐ’’ అనే నినాదాలతో రాష్ట్రం మారుమ్రోగింది.

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: ప్రపంచంలో కమ్యూనిస్టు పార్టీ, సిద్ధాంతాలు సజీవంగా ఉన్నాయని, భావజాల రంగంలో పెద్ద ఎత్తున కృషి చేసి పేద ప్రజల విశ్వాసాలను పొందాలని కమ్యూనిస్టు పార్టీ సీనియర్‌ నాయకులు ఈడ్పుగంటి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. విజయవాడలో సీపీఐ రాష్ట్ర కార్యాలయమైన దాసరి భవన్‌ వద్ద ఆయన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ స్థాపన చారిత్రక ఘటనగా అభివర్ణించారు. ఆనాడు సమాజంలో కులాలవారీ పెత్తందారుల పెత్తనం ఉండేదన్నారు. వర్గ దోపిడీ, కులపీడనల నిర్మూలనలో కమ్యూనిస్టు పార్టీ కీలక పాత్ర పోషించిందన్నారు. బొంబాయి, మీరట్‌, చిట్టగ్యాంగ్‌ ప్రాంతాల్లో పారిశ్రామిక పోరాటాలు జరిగాయన్నారు. చిట్టగ్యాంగ్‌ పోరాటం తరువాత ఇతర పార్టీల్లోని నాయకులు పెద్ద సంఖ్యలో కమ్యూనిస్టు పార్టీలో చేరారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత, కామ్రేడ్‌ చండ్ర రాజేశ్వరరావు నాయకత్వంలో మంగళాపురం, మునగాల భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగాయన్నారు. గోవాలో జరిగిన పోరాటానికి డాంగే నాయకత్వం వహించారని, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌లో కమ్యూనిస్టు ఉద్యమాలు పెద్దఎత్తున కొనసాగాయని చెప్పారు. సంస్థానాల్లో రైతాంగ పోరాటాలు, భాషాప్రయుక్త రాష్ట్రాల ఉద్యమంలో కూడా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన పాత్ర పోషించిందన్నారు. అప్పుడు దేశంలో రెండవ అతిపెద్ద పార్టీగా కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిందన్నారు. 6 రాష్ట్రాల్లో ప్రధాన ప్రతి పక్షంగా ఉందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో 4 వేల మంది ప్రాణాలు కోల్పోయారని, వారిలో కృష్ణా జిల్లాలో 2 వేల మంది, విజయవాడ నగరంలో 200 మంది ఉన్నారని తెలిపారు. ఆటుపోట్ల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలని, విప్లవ వారసత్వం మనకు ఉందన్నారు. ఉప్పలపాటి రామచంద్రరావు, తమ్మిన పోతరాజు వంటి మిలిటెంట్‌ తరహా నాయకులు మనకు ఉన్నారని, ముఖ్యంగా సమరశీల పోరాటాలకు తొలినుంచి విజయవాడ నగరం వేదికగా ఉందని వివరించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అధ్యక్షత వహించగా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, సీనియర్‌ నాయకులు వై.చెంచయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనేపూడి శంకర్‌, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు చంద్రానాయక్‌, కోశాధికారి ఆర్‌.పిచ్చయ్య విప్లవ గేయాలను ఆలపించారు.
లౌకిక, ప్రజాతంత్ర శక్తులు ఐక్యం కావాలి: రామకృష్ణ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా, రాజ్యాంగ వ్యతిరేక విధానాలు, మతోన్మాద శక్తుల చర్యలను నిరసిస్తూ పోరాడాల్సిన బాధ్యత కమ్యూనిస్టులపై ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. అశాస్త్రీయ పద్ధతులలో పరిపాలన చేస్తున్న బీజేపీని సైద్ధాంతికంగా ఎదుర్కొనే శక్తి కమ్యూనిస్టులకే ఉందని అన్నారు. దీని కోసం లౌకిక, ప్రజాతంత్ర పార్టీలు ఐక్యం కావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కమ్యూనిస్టు ఉద్యమం పునరేకీకరణ జరగాలని ఉద్ఘాటించారు. భారత కమ్యూనిస్టు పార్టీ 98వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలలో భాగంగా సీపీఐ గుంటూరు నగర సమితి అధ్వర్యంలో స్థానిక లాడ్జి సెంటర్‌ నుంచి మల్లయ్యలింగం భవన్‌ వరకు రెడ్‌ షర్ట్‌ వలంటీర్ల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని జంగాల అజయ్‌కుమార్‌ ఆవిష్కరించారు. ప్రపంచ సోషలిస్టు రాజ్య స్థాపకులు కామ్రేడ్‌ విఐ లెనిన్‌ విగ్రహానికి సీపీఐ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిం చారు. అనంతరం మల్లయ్యలింగం భవన్‌లోని వీఎస్‌కే హాలులో నగర కార్యదర్శి కోట మాల్యాద్రి అధ్యక్షతన జరిగిన సభలో రామకృష్ణ మాట్లాడుతూ పోరాటాల పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని, దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనడమే కాకుండా సంస్థానాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కూడా సీపీఐ కీలక భూమిక పోషించిందని గుర్తుచేశారు. దున్నే వానికి భూమి పంచాలని, వ్యవసాయ కూలీలను చేరదీసి కోట్లాది మందికి భూములు దక్కడానికి, స్వాతంత్య్ర అనంతరం కూడా పేద ప్రజలు, కష్టజీవులు, కార్మికులు, రైతుల కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తున్న పార్టీ సీపీఐ అన్నారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తూ, రాజ్యాంగ సంస్థలను ధ్వంసం చేస్తోందన్నారు. పేద, సామాన్య ప్రజలకు వ్యతిరే కంగా పనిచేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి లౌకక శక్తులన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఏఐటీ యూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వెలుగూరి రాధాకృష్ణమూర్తి, సీపీఐ నగర నాయకులు రావుల అంజిబాబు, ఆకిటి అరుణ్‌కుమార్‌, ఇఫ్టా జాతీయ కార్యదర్శి గని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కమ్యూనిస్టు ఉద్యమాలతోనే
సామాజిక భద్రత: జల్లి విల్సన్‌, హరినాథరెడ్డి
భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాలతోనే సామాజిక భద్రత లభిస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ అన్నారు. విశా లాంధ్ర దినపత్రిక కార్యాలయంలో జరిగిన కమ్యూనిస్టు పార్టీ 98వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సీపీఐ విశాలాంధ్ర శాఖ సహాయ కార్యదర్శి వి.రమేష్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జల్లి విల్సన్‌ పార్టీ పతాకాన్ని ఆవిష్కరిం చారు. అనంతరం మాట్లాడుతూ పార్టీ చేపట్టిన ఉద్యమాల ద్వారా న్యాయమైన కూలిరేట్లు సాధించటం జరిగింద న్నారు. దళిత, గిరిజన, మైనార్టీలపై జరుగుతున్న దాడు లకు వ్యతిరేకంగా, అంటరానితనాన్ని నిర్మూలించటానికి ఎన్నో పోరాటాలు చేసినట్లు చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్య దర్శివర్గ సభ్యులు, విశాలాంధ్ర జనరల్‌ మేనేజర్‌ పి.హరి నాథరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ నియంతృత్వ పోకడలతో రాజ్యాంగ విలువల్ని మార్చే కుట్ర చేస్తున్నారని చెప్పారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విశాలాంధ్ర ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ కూన అజయ్‌బాబు, విశాలాంధ్ర ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యదర్శి మోదుమూడి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
నియంతల పాలనకు చరమగీతం: ఓబులేసు
దేశ, రాష్ట్ర రాజకీయాలతో పేద, బడుగు, బలహీన శ్రామిక వర్గాలు అధ: పాతాళానికి తొక్కబడుతున్నాయని, కేంద్రంలోని మోదీ ప్రభుత్వ పాలనకు, రాష్ట్రంలోని జగన్‌ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడేందుకు పార్టీ శ్రేణులు నడుం బిగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులేసు ప్రజలకు పిలుపునిచ్చారు. సీపీఐ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా కడపలో ప్రదర్శన అనంతరం జరిగిన బహిరంగ సభకు పార్టీ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా జి.ఓబులేసు మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో ఏమాత్రం భాగస్వామ్యం లేని బీజేపీ సుస్థిర పాలన అందిస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో మూడున్నరేళ్ల జగన్‌ పాలనలో దొమ్మీలు, దోపిడీలు, కబ్జాలు వంటి వాటితో రాష్ట్ర ప్రజలు విసుగుచెందారని, వీటన్నింటిని పరిష్కరించడానికి ప్రజల తరపున ఆయు ధంగా నిలబడేది ఒక్క కమ్యూనిస్టు పార్టీయేనని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి వెంకటశివ, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రామయ్య, నాగసుబ్బారెడ్డి, సుబ్రమణ్యం, వేణుగోపాల్‌, సుబ్బారెడ్డి, బషీరున్నిసా, వీరశేఖర్‌, బాదుల్లా, గంగాసురేష్‌ పాల్గొన్నారు.
దోపిడీ అంతమయ్యేవరకు కమ్యూనిజం అజేయం: కేవీవీ ప్రసాద్‌
సీపీఐ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పెనమలూరు నియోజక వర్గం కంకిపాడులోని రిజిస్ట్రార్‌ కార్యాలయం సమీపంలోని పార్టీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ముఖ్య వక్తగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కేవీవీ ప్రసాద్‌ పాల్గొని ఎర్రజెండాను ఎగుర వేశారు. విద్యార్థి సమాఖ్య నాయకులు మోతుకూరి అభ్యుదయ కేక్‌ కోసి పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో కేవీవీ ప్రసాద్‌ మాట్లాడుతూ అసమాన తలు, సంక్షోభం అంతం అయ్యే వరకు కమ్యూనిజం అజేయం అన్నారు. ఈ కార్యక్రమంలో మేరుగు విజయ్‌ కుమార్‌, మున్నంగి నరసింహరావు, మోతుకూరి అరుణ కుమార్‌, బండి వెంకటరత్నం, పోతురాజు నాగేశ్వరరావు, పాశం రవికుమార్‌, రమేష్‌, బాలస్వామి, సజ్జా కనక మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఎర్రజెండా అజేయం: పి.రామచంద్రయ్య
సీపీఐ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎర్రజెండా రెపరెపలాడిరది. అన్ని శాఖల్లో సీపీఐ జెండాలను సీపీఐ నాయకులు, బాధ్యులు సీనియర్‌ నాయకులు ఆవిష్కరించారు. పత్తికొండలోని వీకే ఆదినారాయణరెడ్డి నగర్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.రామచంద్రయ్య జెండాను ఆవిష్కరిస్తూ దోపిడీ ఉన్నంతకాలం ఎర్రజెండా అజేయంగా ఉంటుందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య కర్నూలు నగరంలోని సీఆర్‌ భవన్‌ వద్ద జెండాను ఆవిష్కరించారు. సీపీఐ రాష్ట్రకార్యవర్గ సభ్యులు కె.రామాంజనేయులు, నంద్యాల జిల్లా డోన్‌ పట్టణంలోని నక్కిరామన్న భవన్‌ వద్ద సీపీఐ జెండాను ఆవిష్కరించారు. సీపీఐ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణ సమితి అధ్వర్యంలో పట్టణంలో విద్యార్థులు, యువకులతో రక్తదాన శిబిరం నిర్వహించారు. కర్నూలు, నంద్యాల జిల్లాలోని అన్ని శాఖల్లో సీపీఐ జెండాను ఆవిష్కరించుకొని స్వీట్లు పంపిణీ చేశారు.
సోషలిజం, సమానత్వమే లక్ష్యం: జగదీష్‌
భారత కమ్యునిస్టు పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు అనంతపురంలో ఉత్సవంలా నిర్వహించారు. నగరంలోని టవర్‌ క్లాక్‌ కూడలిలో సీపీఐ జెండాను పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు జగదీష్‌ ఆవిష్కరించారు. అనంతరం సుమారు ఐదు వందల మంది సీపీఐ రెడ్‌ షర్ట్‌ వలంటీర్లు ఆర్ట్స్‌ కళాశాల నుంచి టవర్‌ క్లాక్‌, సప్తగిరి సర్కిల్‌, గాంధీ బజార్‌, తిలక్‌ రోడ్డు మీదుగా ఆ పార్టీ కార్యాలయం వరకు మేళతాళాలతో కవాతు నిర్వహిం చారు. అనంతరం ఏపీ మహిళా సమాఖ్య ప్రతినిధులు నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సంద ర్భంగా జగదీష్‌ మాట్లాడుతూ దేశంలో పేదరికాన్ని రూపుమాపాలని, సమానత్వం, సోషలిస్టు సమాజం తీసుకు రావాలని సీపీఐ పోరాడుతోందన్నారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు నారాయణ స్వామి, మల్లికార్జున, రాజారెడ్డి, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్‌ బాబు, గిరిజన సమాఖ్య అధ్యక్షుడు రామాంజనేయులు పాల్గొన్నారు.
మరో స్వాతంత్య్ర పోరుకు సిద్ధం కండి: డేగా ప్రభాకర్‌
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు రేపుతూ భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తోందని, మరోపక్క అన్ని వ్యవస్థలను ధ్వంసం చేస్తూ ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు శ్రేణులు ప్రజాస్వామ్య, రాజ్యాంగ రక్షణకు మరో స్వాతంత్య్ర పోరాటానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. అమలాపురం గడియారం స్తంభం సెంటర్లో అడపా సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో ప్రభాకర్‌ పాల్గొన్నారు. ఏలూరులో సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణచైతన్య పార్టీ కార్యాలయం వద్ద సీపీఐ పతాకాన్ని ఆవిష్కరించారు. సీపీఐ రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, భీమవరంలో పార్టీ కార్యాలయం వద్ద పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, రాష్ట్ర నాయకులు నెక్కంటి సుబ్బారావు పాల్గొన్నారు.
చిత్తూరులో: చిత్తూరు పార్టీ కార్యాలయం వద్ద జిల్లా కార్యదర్శి ఎస్‌.నాగరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్ర మంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ.రామానాయుడు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. నగర కార్యదర్శి వీసీ గోపీనాథ్‌, మణి, సత్యమూర్తి, చంద్రారావు, కొండయ్య, విజయ్‌, కోమల కుమారి, మునిరత్నం పాల్గొన్నారు.
ఒంగోలులో: ఒంగోలులోని కార్యాలయం వద్ద సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. హాస్పిటల్‌ సెంటర్‌లో డీహెచ్‌పీఎస్‌ ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు, సీవీఎన్‌ రీడిరగ్‌ రూమ్‌ వద్ద ఎస్‌డీ సర్ధార్‌, ఎమ్మెన్నార్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌ సెంటర్‌లో ఒంగోలు నగర సీపీఐ కార్యదర్శి పీవీఆర్‌ చౌదరి, ముఠా యూనియన్‌ వర్కర్స్‌ కార్యాలయం వద్ద జిల్లా మాజీ కార్యదర్శి ఎం.వెంకయ్య, ఆర్టీసీ డిపో వద్ద కొత్త కోట వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర కాలనీలో ఉప్పుటూరు ప్రకాశరావు, దత్తాత్రేయ కాలనీలో లక్ష్మయ్య పార్టీ పతాకాలను ఆవిష్కరించారు.
శ్రీకాకుళంలో: శ్రీకాకుళంలో పార్టీ కార్యాలయం వద్ద సీపీఐ జిల్లా కార్యదర్శి బలగ శ్రీరామ్మూర్తి జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు లండ వెంకటరావు, చాపర సుందర్‌లాల్‌, చిక్కాల గోవిందరావు, చాపర వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. నరసన్న పేటలో ఇస్కఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సనపల నర్సింహులు అరుణపతాకాన్ని ఆవిష్కరించారు.
నెల్లూరులో: నెల్లూరు జిల్లావ్యాప్తంగా సీపీఐ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి దామా వెంకయ్య, అరిగెల నాగేంద్రసాయి పార్టీ పతాకాలను ఆవిష్కరించి, కమ్యూనిస్టు పార్టీ చరిత్ర, పోరాటాలను వివరించారు.
విజయనగరంలో: విజయనగరం జిల్లాలో జరిగిన వ్యవస్థాపక వేడుకల్లో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.కామేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, సహాయ కార్యదర్శి బుగత అశోక్‌, పార్వతీపురంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కోరంగి మన్మథరావు, సహాయ కార్యదర్శి జీవన్‌ తదితరులు పార్టీ పతాకాలను ఆవిష్కరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img