Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

ఎస్‌డీజీ లక్ష్యాలే ప్రమాణం

. డిసెంబరుకల్లా 5లక్షల ఇళ్లు పూర్తి
. ఉపాధి హామీ కనీస వేతనం రూ.240
. 25న సచివాలయాల్లో ఈ-క్రాపింగ్‌ జాబితాలు
. 26న రైతు భరోసా, ఇన్‌పుట్‌ సబ్సిడీ
. నవంబరు 10న వసతి దీవెన
. కలెక్టర్లతో సీఎం జగన్‌

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: ఎస్‌డీజీ లక్ష్యాలపై కలెక్టర్లు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని, మీ పనితీరు, సమర్థత వాటి ఆధారంగానే నిర్ణయిస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా గురువారం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పనుల మంజూరు, వ్యవసాయం, ఇ- క్రాపింగ్‌, ఉపాధి హామీ పనులు, వైయస్సార్‌ విలేజ్‌, అర్బన్‌ క్లినిక్కులు, గృహనిర్మాణం, ఇళ్ల పట్టాలు, జగనన్న భూ హక్కు – భూ రక్ష సర్వే, స్పందన అర్జీలు, జాతీయ రహదారులకు భూ సేకరణ అంశాలపై సమీక్షించారు. సీఎం జగన్‌ మాట్లాడుతూ ఎస్‌డీజీ లక్ష్యాల సాధనే కలెక్టర్ల లక్ష్యం కావాలన్నారు. అందుకోసం డేటాను సక్రమంగా అప్‌లోడ్‌ చేయాలన్నారు. అప్పుడే ఎస్‌డీజీల్లో మార్పులు కనిపిస్తాయని, ఈ లక్ష్యాలపై మన రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం చూస్తుందని చెప్పారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలనుంచి వచ్చే అభ్యర్థనల మేరకు ప్రాధాన్యత పనుల కోసం ప్రతి గ్రామ, వార్డు సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున నిధులు కేటాయించినందున ఈ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ విషయంలో ఎలాంటి ఆలస్యానికీ, అలసత్వానికీ తావు ఉండకూడదని హెచ్చరించారు. రాష్ట్రంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను ఈ కార్యక్రమం ద్వారా కవర్‌ చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, మండల స్థాయి సిబ్బంది నెలలో కనీసం 6 సచివాలయాలను సందర్శించాలని నిర్దేశించారు. ఎమ్మెల్యే గ్రామ, మండల స్థాయి సిబ్బందితో కలిసి 2 రోజులు సంబంధిత గ్రామ, వార్డు సచివాలయంలో ఉండాలని, ప్రతి ఇంటినీ కవర్‌ చేయాలని స్పష్టం చేశారు. ఒక రోజులో 6 గంటలపాటు గ్రామ, వార్డు సచివాలయంలో గడప గడపకూ కార్యక్రమాన్ని నిర్వహించాలని, మండల అధికారులు, పాలనా సిబ్బంది, సచివాలయ సిబ్బంది అంతే సమయం గడపాల్సిందేనని తేల్చిచెప్పారు.
ఈ-క్రాప్‌ అన్నది అత్యంత ముఖ్యమైన కార్యక్రమమని, పొరపాట్లు లేకుండా కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నూటికి నూరుపాళ్లు పూర్తి చేయాలన్నారు. రైతులను పొలాల్లోకి తీసుకెళ్లి ఫొటో తీసుకుని, వివరాలు నమోదు అనేది సెప్టెంబరు 30లోగా పూర్తిచేయాలని సూచించారు. ఇక రెండోదశ కింద విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌, వీఆర్వోలు బయోమెట్రిక్‌ ద్వారా వీటిని ఆధీకృతం చేయాలన్నారు. అక్టోబరు 3లోగా దీనిని పూర్తిచేయాలని చెప్పారు. విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌, వీఆర్వోలు- రైతుల కేవైసీలను అక్టోబరు 10లోగా పూర్తిచేయాలని జగన్‌ సూచించారు. అక్టోబరు 10 నుంచి రైతులకు ఇ- క్రాప్‌లో డిజిటల్‌ రశీదులు, ఫిజికల్‌ రశీదులు అక్టోబరు 15 లోగా ఇవ్వాలన్నారు. తర్వాత సోషల్‌ ఆడిట్‌ నిర్వహించి అక్టోబరు 25నుంచి వారం పాటు ఇ- క్రాప్‌ చేసిన తుది జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించాలని తెలిపారు. నవంబరు 1 నుంచి ఈ తుది జాబితాను అన్ని పోర్టళ్లలో అందుబాటులో ఉంచాలన్నారు. ఈ షెడ్యూల్‌ ప్రకారం ఇ-క్రాప్‌ పూర్తిచేసే బాధ్యత కలెక్టర్లదేనని సీఎం స్పష్టంచేశారు.
ఇక ఉపాధి హామీ పథకం కింద ఇప్పటివరకూ సగటు వేతనం రూ. 210.02గా ఉందని, దీనిని కనీసం రూ.240లకు పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గృహనిర్మాణం వల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని, డిసెంబర్‌ 21 నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జగనన్న కాలనీల్లో 3.5 లక్షలు, 1.5 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. ఈ ఇళ్లు పూర్తయ్యే నాటికి విద్యుత్‌, నీరు, డ్రైనేజ్‌… ఈ సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలన్నారు. జాతీయ రహదారులకు సంబంధించిన భూ సేకరణపై కలెక్టర్లు దృష్టి సారించాలన్నారు. రైతు భరోసా రెండోవిడత అక్టోబరు 26న, అదేరోజు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తామని, వసతి దీవెన నవంబర్‌ 10న విడుదల చేస్తున్నామని సీఎం ప్రకటించారు. సమీక్షా వేశంలో ముఖ్యమంత్రి ప్రధానసలహాదారు అజేయ కల్లాం, సీఎస్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి.సాయి ప్రసాద్‌, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్‌, రవాణా, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్‌, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ కుమార్‌, వ్యవసాయశాఖ కమిషనర్‌ హరికిరణ్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img