సీపీఎం, సీపీఐ సంతాపం
రాజకీయ పార్టీల దిగ్భ్రాంతి
న్యూదిల్లీ: ప్రముఖ రాజకీయవేత్త, భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) కన్నుమూశారు. శ్వాసకోశ, ఇతర ఆరోగ్య సమస్యలతో దిల్లీలోని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం 3.30 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్‌తో ఏచూరి ఆగస్టు 19న ఎయిమ్స్‌లో చేరారు. ఏచూరి సర్వేశ్వర సోమయాజులు, కల్పకం దంపతులకు 1952 ఆగస్టు 12న చెన్నైలో జన్మించారు. ఏచూరి మృతికి జాతీయ పార్టీలు సంతాపం ప్రకటించాయి. సీపీఎం, సీపీఐ కేంద్ర కమిటీలు సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపాయి. గొప్ప పార్లమెంటేరియన్‌ను కోల్పోయామని నాయకులు పేర్కొన్నారు. ఆయన మృతి సమకాలీన భారత రాజకీయాలకు తీరని లోటని తెలిపారు.
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కమ్యూనిస్టు ఉద్యమంలో చెరగని ముద్ర వేసుకున్నారు. విద్యార్థి ఉద్యమం నుంచి నాయకత్వ స్థానంలోకి వచ్చిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి జాతీయస్థాయి నాయకుడిగా ఎదిగారు. 1974లో ఎస్‌ఎఫ్‌ఐలో చేరారు. 1975లో సీపీఎం ప్రాథమిక సభ్యుత్వం తీసుకున్నారు. 2005 నుంచి 2017 వరకు పశ్చిమబెంగాల్ నుంచి రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. 1985లో పన్నెండవ పార్టీ కాంగ్రెస్ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. పుచ్చలపల్లి సుందరయ్య, ఈఎంఎస్, బీటీఆర్, హరికిషన్ సింగ్ సూర్జిత్, బసవ పున్నయ్య, జ్యోతిబసు వంటి సీనియర్ నాయకులతో కలిసి పనిచేశారు. 1992లో జరిగిన 14వ పార్టీ కాంగ్రెస్‌తో పొలిట్‌బ్యూరోకు చేరుకున్నారు. మతతత్వం, నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా ఏచూరి క్రమం తప్పకుండా పార్లమెంటులో జోక్యం చేసుకున్నారు. రవాణా, పర్యాటక, సాంస్కృతిక శాఖల స్టాండిరగ్ కమిటీ చైర్మన్‌గా ముఖ్యమైన నివేదికల తయారీకి ఆయన నాయకత్వం వహించారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం, 2004లో మొదటి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటులో ఏచూరి కీలకపాత్ర పోషించారు. సీతారాం ఏచూరి విద్యాభ్యాసం హైదరాబాద్‌లో సాగింది. ఆ తర్వాత దిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో బీఏ, జవహర్ లాల్ నెహ్రూ వర్సిటీలో ఎంఏ పూర్తి చేశారు. ఆర్థిక శాస్త్రంలో పరిశోధనలు ప్రారంభించిన ఆయన… ఎమర్జెన్సీ సమయంలో జైలుకెళ్లడంతో వాటిని కొనసాగించలేకపోయారు. భారతీయ రాజకీయ, సామాజిక పరిస్థితులను ప్రజా ఉద్యమాలకు తాత్విక స్పష్టతతో తీర్చిదిద్దే రాజకీయ, సంస్థాగత బాధ్యతను నిర్వర్తించిన నాయకుడు ఏచూరి. ఆయన భార్య ప్రముఖ పాత్రికేయురాలు, రచయిత్రి సీమా చిస్తీ. బ్రిటన్‌లో యూనివర్సిటీ టీచర్‌గా పనిచేస్తున్న అఖిలా ఏచూరి, జర్నలిస్టు ఆశిష్ ఏచూరి పిల్లలు. పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి (35) కోవిడ్ సమస్యలతో 2021లో మృతి చెందారు. ఇంగ్లీషు, హిందీ, తెలుగు, తమిళం, బెంగాలీ భాషల్లో ప్రావీణ్యం ఉన్న ఏచూరి లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్, వాట్ ఈజ్ హిందూ రాష్ట్ర, సోషలిజం ఇన్ ట్వంటీ-ఫస్ట్ సెంచరీ, కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరిజం, ఘృనా కీ రాజనీతి (హిందీ) వంటి పుస్తకాలు రచించారు.
ఎయిమ్స్‌కు భౌతికకాయం
సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని ఎయిమ్స్‌కు అప్పగించనున్నారు. ఏచూరి మృతదేహాన్ని ఎంబామింగ్ నిమిత్తం రేపు సాయంత్రం 6 గంటల వరకు మార్చురీలో ఉంచనున్నారు. అనంతరం వసంత్ కుంజ్‌లోని ఆయన ఇంటికి తరలిస్తారు. 14వ తేదీ ఉదయం 11 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్‌లో మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తర్వాత ఏచూరి భౌతికకాయాన్ని దిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలోని అనాటమీ విభాగానికి అప్పగించనున్నారు.