Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

ఏపీకి కొత్త గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

. నలుగురు బీజేపీ నేతలతో సహా ఆరుగురికి అత్యున్నత పదవులు
. మరో ఏడు రాష్ట్రాల ప్రథమపౌరుల బదిలీలు
. కోశ్యారీ, మాధుర్‌ రాజీనామా
. రాష్ట్రపతి ఆమోదం

న్యూదిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌గా అయోధ్య కేసులో కీలకంగా వ్యవహరించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అబ్దుల్‌ నజీర్‌ నియమితుల య్యారు. ఇక అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం, జార్ఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, అసోంతో సహా ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు ఆదివారం నియమితులయ్యారు. వివాదాస్పద అయోధ్య కేసులో తీర్పునిచ్చిన జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, నలుగురు బీజేపీ నేతలు లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్య, సీపీ రాధాకృష్ణన్‌, శివప్రతాప్‌ శుక్లా, గులాబ్‌ చంద్‌ కటారియాకు గవర్నర్‌ పదవులు దక్కాయి. జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు పదవీ విరమణ పొందిన నెల రోజుల్లోగా ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా బాధ్యతలను కేంద్రప్రభుత్వం కట్టబెట్టింది. మరో ఏడు రాష్ట్రాల గవర్నర్లను బదిలీలనూ రాష్ట్రపతి ఆమోదించినట్లు రాష్ట్రపతి కార్యాలయ అధికార ప్రతినిధి వెల్లడిరచారు. మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారి, లడఖ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆర్‌కే మాధుర్‌ రాజీనామాలనూ ముర్ము ఆమోదించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా మాజీ న్యాయ మూర్తి అబ్దుల్‌ నజీర్‌ నియమితులు కాగా ఆ రాష్ట్ర ప్రస్తుత గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ చత్తీస్‌గఢ్‌కు బదిలీ అయ్యారు. జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ 2017, ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాల్లో భాగమైన ఆయన పెద్దనోట్ల రద్దు, మరాఠా కోటా వంటి సున్నితాంశాలు అనేకం విచారించారు. 2023, జనవరి 4న పదవీ విరమణ చేశారు. అయోధ్య భూవివాదం, ట్రిపుల్‌ తలాక్‌, గోప్యతా హక్కు వంటి కీలకాంశాల్లో చరిత్రాత్మక తీర్పులు వెలువరించారు. జార్ఖండ్‌ గవర్నర్‌ రమేశ్‌ బైస్‌ మహారాష్ట్రలో కోశ్యారి స్థానాన్ని భర్తీ చేస్తారు. కాగా, అరుణాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ రిటైర్డ్‌ బ్రిగేడియర్‌ బీడీ మిశ్రాను లడఖ్‌ ఎల్‌జీ మాధుర్‌ స్థానంలో నియమించారు. ఆ రాష్ట్రానికి గవర్నర్‌గా రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ కైవలా త్రివిక్రమ్‌ పర్నాయిక్‌ను నియమించారు. గవర్నర్లుగా నియమితులైన నలుగురు బీజేపీ నేతల్లో ఇద్దరు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారున్నారు. లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్య (సిక్కిం), సీపీ రాధాకృష్ణన్‌ (జార్ఖండ్‌), శివప్రతాప్‌ శుక్లా (హిమాచల్‌ ప్రదేశ్‌), గులాబ్‌ చంద్‌ కటారియా (అసోం) గవర్నర్లుగా నియమితులయ్యారని అధికార ప్రతినిధి వెల్లడిరచారు. అలాగే అనుసూయ యూకేను చత్తీస్‌గఢ్‌ నుంచి మణిపూర్‌కు బదిలీ చేయగా ఎల్‌ఏ గణేశన్‌ను మణిపూర్‌ నుంచి నాగాలాండ్‌కు పంపారు. ఫాగు చౌహాన్‌ను బీహార్‌ నుంచి మేఘాలయకు, రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లెకర్‌ను హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి బీహార్‌కు బదిలీ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img