Friday, March 31, 2023
Friday, March 31, 2023

ఏపీకి మళ్లీ మొండిచేయి: రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మరోమారు మొండిచేయి ఎదురైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ఈ బడ్జెట్‌ కేవలం ఉన్నతవర్గాలను ఉత్సాహపరిచేలా ఉందని వ్యాఖ్యానించారు. 2024 లోక్‌సభ ఎన్నికలను, ఈ ఏడాది కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగే ఎన్నికల కోసం కేంద్రం ఈ బడ్జెట్‌ ప్రవేశపెట్టిందని, ఇది కేవలం అంకెల గారడీ మాత్రమేనని ఆయన బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది ఎన్నికలు ఉన్నందున కర్ణాటకకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారని విమర్శించారు. ఎప్పటిలాగానే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి మొండిచేయి చూపించారని, ప్రత్యేక హోదా అంశంగానీ, విభజన చట్ట హామీల అమలుకు చర్యలుగానీ లేకపోవడం విచారకరమని తెలిపారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి నిధుల కేటాయింపు లేదని, పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణాలకు నిధుల ఊసే లేదని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధాని మోదీ ఇచ్చిన హామీ ఈ ఏడాదీ నీటిమూటగానే మారిందని, బడ్జెట్‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాల ఊసే లేకపోవడం విచారకరమని వెల్లడిరచారు. వేతన జీవులకు కొంతమేర ఉపశమనం లభించే ప్రకటన వచ్చినప్పటికీ అది కేవలం ఎన్నికల ఎత్తుగడ మాత్రమేనని తెలిపారు. తొమ్మిదేళ్లలో తలసరి ఆదాయం రెట్టింపయినట్లు ప్రభుత్వం చెబుతున్న లెక్కలు కార్పొరేట్‌ శక్తులు, పెట్టుబడిదారులకు వర్తిస్తాయేగానీ పేదలకు కాదని వ్యాఖ్యానించారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించకుండా… సామాన్యుల వినిమయ శక్తి పెరగకుండా ఏడు శాతం వృద్ధిరేటు ఎలా సాధిస్తారో సమాధానం చెప్పాలని రామకృష్ణ ప్రశ్నించారు. విద్యారంగం మెరుగుదలకు, పారిశ్రామిక అభివృద్ధికి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన ప్రస్తావన లేదని పేర్కొన్నారు. ప్రభుత్వరంగ సంస్థల స్థితిగతుల గురించి చెప్పలేదని, రైల్వేకు రూ.2.40 లక్షల కోట్లు కేటాయించామని చెబుతున్నప్పటికీ రైళ్ల ప్రయాణ చార్జీలు అధికంగానే ఉన్నాయని తెలిపారు. సీనియర్‌ సిటిజన్లకు రాయితీ ఇవ్వడం లేదని, నూతనంగా తీసుకొచ్చిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ వంటి రైళ్లు పేద, సామాన్యులకు అందుబాటులో లేవని ఆరోపించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటున్న మోదీ సర్కారు…ఎలా చేస్తుందో చెప్పాలని నిలదీశారు. రైతులకు బ్యాంకు రుణాలు, ఎరువులు, పురుగు మందులు, పంటల బీమా, నీటి పారుదల వ్యవస్థ మెరుగుదల, గిట్టుబాటు ధరల గురించి ప్రస్తావించకపోవడం ఆక్షేపణీయమని, ఇది కేవలం ఉన్నతవర్గాలను ఉత్సాహపరిచే బడ్జెట్‌ అని రామకృష్ణ విమర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img