ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలో దారుణం జరిగింది. ప్రియురాలైన ఇంజినీరింగ్ విద్యార్థిని కాళ్లు, చేతులపై వేడివేడి నూనె పోసి అత్యాచారానికి పాల్పడ్డాడో యువకుడు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, నిందితుడు పరారీలో ఉన్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏలూరుకు చెందిన యువతి కాకినాడలోని ఓ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. ఆమె తల్లి హోంగార్డు. నాలుగేళ్ల క్రితం సదర్ల అనుదీప్ అనే యువకుడితో యువతికి పరిచయమైంది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఈ నెల 9న కాలేజీ వద్దకు వచ్చిన అనుదీప్ పెళ్లి చేసుకుందామంటూ దుగ్గిరాల తీసుకొచ్చి ఓ గదిలో ఉంచాడు. అదే రోజు రాత్రి ఆమెపై అత్యాచారం చేయబోగా ఆమె ప్రతిఘటించింది. దీంతో మరుసటి రోజు మద్యం తాగొచ్చి మళ్లీ అత్యాచారానికి యత్నించాడు. ఈసారి కూడా ఆమె ప్రతిఘటించడంతో నూనె వేడిచేసి ఆమె కాళ్లు, చేతులపై పోశాడు. బాధతో ఆమె విలవిల్లాడిపోతుంటే అతడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాతి నుంచి రోజూ ఆమెను చిత్రహింసలకు గురిచేసేవాడు. ఆ తర్వాత గదికి బయటి నుంచి తాళం వేసి వెళ్లిపోయేవాడు. ఈ క్రమంలో ఈ నెల 22న మద్యం తాగొచ్చిన యువకుడు యువతి గొంతునొక్కి చంపే ప్రయత్నం చేశాడు. అతడి నుంచి తప్పించుకున్న ఆమె ఫోన్ లాక్కుని తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు వెంటనే ఆమె చెప్పిన అడ్రస్‌కు చేరుకున్నారు. అయితే, నిందితుడు అనుదీప్ అప్పటికే అక్కడి నుంచి పరారయ్యాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. బాధితురాలు ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడిని పట్టుకుని చట్టప్రకారం శిక్ష పడేలా చేస్తామని ఎస్పీ మేరీ ప్రశాంతి బాధిత కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.