నిర్మలా సీతారామన్
కొన్ని వస్తువులపై విధించిన జీఎస్టీ పెంపుపై చర్చించాలన్న ఏకైక ఎజెండాతో జీఎస్టీ మండలి ఇవాళ భేటీ అయ్యిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. శుక్రవారంనాడిక్కడ జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశానంతరం మీడియాతో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, టెక్స్‌టైల్స్‌పై ప్రస్తుతం ఉన్న జీఎస్టీ రేటు యథాతథంగానే ఉంచాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించినట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 5 శాతం జీఎస్టీ యథాప్రకారం కొనసాగుతుందని, 12 శాతానికి పెరగడం లేదని చెప్పారు. టెక్స్‌టైల్స్‌పై జీఎస్టీ రేటు అంశాన్ని టాక్స్ రేట్ రేషనలైజేషన్ కమిటీకి పంపనున్నామని, ఫిబ్రవరిలో కమిటీ నివేదిక సమర్పిస్తుందని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పీయూష్ జైన్‌పై ఆదాయపు పన్ను శాఖ పొరపాటున దాడి చేసిందంటూ సమాజ్‌వాదీ పార్టీ చేస్తున్న ఆరోపణలపై మంత్రి స్పందించారు. ఐటీ దాడులు సరైన ప్రదేశంలో, సరైన సమయంలోనే జరిగాయన్నారు. పక్కా సమాచారంతో సరైన వ్యక్తి పైనే ఐటీ తనిఖీలు నిర్వహించారని తెలిపారు. అలాగే శుక్రవారం ఎస్పీకి చెందిన ఎమ్మెల్సీ, అత్తరు వ్యాపారి పుష్పరాజ్ జైన్ పై ఐటీ దాడులు ముందస్తు సమాచారం మేరకే జరుగుతున్నాయని చెప్పారు. పీయూష్ జైన్ ఇంట్లో దొరికిన సొమ్మంతా బీజేపీదేనంటూ వస్తున్న ఆరోపణల్ని ఆమె ఖండిరచారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఐటీ దాడులతో వణికిపోతున్నారంటూ ఎద్దేవా చేశారు.