Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

ఓటమి భయంతోనే అక్రమాలు

. వైసీపీ తీరుపై రామకృష్ణ విమర్శ
. కత్తి, పోతులను గెలిపించాలని పిలుపు

విశాలాంధ్ర`ఉరవకొండ: రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా వ్యతిరేకపాలన సాగిస్తున్న సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడిపోతామని తెలిసి పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పీడీఎఫ్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ప్రచారాన్ని నిర్వహిస్తూ శనివారం ఉరవకొండకు వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక సీపీిఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ అధికార మదంతో వ్యవహరిస్తున్నారనీ, ప్రతి ఎన్నికల్లోను తామే గెలవాలని ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదని నియంతలా పనిచేస్తున్నారని విమర్శించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో జోక్యం చేసుకునే వారు కాదని ప్రస్తుత ముఖ్యమంత్రి అన్ని స్థానాలు తామే గెలవాలని విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం, దొంగ ఓట్లు నమోదుతో పాటు ఓట్లు కొనుగోలుకు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారని చెప్పారు. మద్యంలో సంపాదించిన డబ్బును ఓట్లు కొనుగోలుకు ఖర్చు పెడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేశారనీ, 31 మంది ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధించడంలో పూర్తిగా విఫలం చెందారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కను సన్నల్లో సీఎం పనిచేస్తున్నారని పేర్కొన్నారు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ఈ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎన్నికలలో మేధావులు ఉద్యోగులు, ఉపాధ్యాయులు పట్టుభద్రులు తగిన గుణపాఠం చెప్పాలన్నారు ప్రజాస్వామ్యానికి పాతరేసే విధానాలను అవలంబిస్తున్న ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలు కూడా ఒకే వేదిక పైకి రానున్నట్లు ఆయన తెలిపారు ఎమ్మెల్సీ ఎన్నికల రోజు దొంగ ఓట్లు వేసేందుకు వచ్చే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలనీ, ఎన్నికలను నిష్పక్షపాతంగా జరపాలని ఆయన ఎన్నికల కమిషన్‌ను కోరారు, పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డికీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ బలపరుస్తున్న భూమి రెడ్డి రాంగోపాల్‌ రెడ్డికి రెండవ ప్రాధాన్యత ఓటు వేయాలన్నారు ఎన్నికల ప్రచారంలో రామకృష్ణతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.జగదీశ్‌, జిల్లా కార్యదర్శి సి.జాఫర్‌, సహాయ కార్యదర్శులు నారాయణస్వామి, మల్లికార్జున, కార్యవర్గ సభ్యులు కేశవరెడ్డి, ఉరవకొండ తాలూకా కార్యదర్శి జే మల్లికార్జున, సహాయ కార్యదర్శి మనోహర్‌, ఏఐటీయూసీ నాయకులు చెన్నారాయుడు, పార్టీ సీనియర్‌ నాయకులు శివన్న, శ్రీధర్‌, వజ్రకరూరు కార్యదర్శి సుల్తాన్‌, విడపనకల్లు కార్యదర్శి రమేష్‌, పార్టీ నాయకులు సంగప్ప, ఉరవకొండ కార్యదర్శి తలారి మల్లికార్జున, కూడేరు మండల కార్యదర్శి నారాయణమ్మ, మహిళా,విద్యార్థి ప్రజానాట్యమండలి సంఘం సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img