. నిరక్షరాస్యులు సైతం గ్రాడ్యుయేట్ ఓటర్లే
. ఒక్కో ఇంట్లో 4 నుంచి 10 బోగస్ ఓట్లు
. కుప్పలు తెప్పలుగా నమోదు
. ఈసీకి ఫిర్యాదుల వెల్లువ
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో టీచర్లకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. శాసనసభ్యుల కోటాలో ఎన్నికయ్యే ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో గ్రామ పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్, మండల, జిల్లా పరిషత్‌లకు ఎన్నికైన ప్రజాప్రతినిధులకు మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. పట్టభద్రుల నియోజకవర్గాల్లో కేవలం డిగ్రీ చదివిన వారికి మాత్రమే ఓటు హక్కు లభిస్తుంది. కానీ మన రాష్ట్రంలో ఒకటవ తరగతి చదవకపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడైతే చాలు... అతనికి ఓటు హక్కు వచ్చినట్లే. వైసీపీ నేతలు అధికారాన్ని ప్రయోగించి తమ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం పెద్దసంఖ్యలో బోగస్ ఓట్లు చేర్చారు. ఈనెల 13వ తేదీన శ్రీకాకుళం
విజయనగరంవిశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ప్రకాశం
నెల్లూరుచిత్తూరు నియోజకవర్గం, కడప
అనంతపురంకర్నూలు పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఆయా నియోజక వర్గాల్లో అభ్యర్థులు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో అధికారపార్టీలు పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలను పట్టించుకునేవి కావు. కానీ ఈసారి వైసీపీ మాత్రం వీటినీ వదిలిపెట్టడం లేదు. పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి వైసీపీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా డబ్బు, అధికార బలంతో ఓటర్లను అనేక విధాలుగా ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగానే పట్టభద్రుల నియోజకవర్గాల్లో పెద్దఎత్తున బోగస్ ఓట్లు చేర్పించారు. పీడీఎఫ్ అభ్యర్థుల ప్రచారం సందర్భంగా ఇటువంటి బోగస్ ఓట్లు కుప్పలు తెప్పలుగా బయటపడుతున్నాయి. ఒక్కో ఇంట్లో 4 నుంచి 10 ఓట్లు ఉండటం విశేషం. ఓటరు జాబితా ప్రకారం ఆయా నివాసాలకు అభ్యర్థులు వెళ్లినప్పుడు ఆ ఇంటి యజమానులు ఆ పేర్లు ఉన్నవారు ఎవరూ లేరని చెప్పడంతో కంగుతింటున్నారు. కొన్ని ఇంటి నెంబర్లు కూడా బోగస్ కావడం గమనార్హం. నిరక్షరాస్యులైన వ్యవసాయ కార్మికులు సైతం గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదైన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ప్రకాశం
నెల్లూరుచిత్తూరు జిల్లాల పరిధిలోని తూర్పు రాయలసీమ నియోజకవర్గానికి చెందిన పోలింగ్ బూతు నెంబరు 222లో 18
166/ఎఫ్ అనే అడ్రస్‌లో 14 ఓట్లు ఉన్నాయి. అక్కడ ఆ నెంబరుతో ఇల్లే లేకపోవడం అభ్యర్థులను విస్మయానికి గురిచేసింది. తిరుపతిలోని పోలింగ్ బూతు నెంబరు 226లో ఒకే ఇంటి నెంబరు 18
6`406 సుందరయ్య నగర్ మొదటి క్రాస్‌లో 14 బోగస్ ఓట్లు నమోదయ్యాయి. ఇంటర్, ఐటీఐ,5,7,10 తరగతులకు చెందిన వారు అనేకమంది గ్రాడ్యుయేట్ ఓటర్లుగా నమోదయ్యారు. ఇంకా విచిత్రమేమిటంటే ఓటరు జాబితాలోని 1050 నెంబరుతో ఓటు హక్కు గల పి.సుబ్రమణ్యానికి అసలు చదువే లేదు. సాక్ష్యాధారాలతో సహా పట్టుకున్న ఈ బోగస్ ఓట్ల వివరాలన్నీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఎన్నికల ప్రధాన అధికారికి పంపుతూ తక్షణమే బోగస్ ఓట్ల తొలగింపునకు చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానికంగా అనేకమంది గుర్తించిన బోగస్ ఓట్లను ఈసీ దృష్టికి తీసుకెళుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఇటువంటి ఘటనలపై ఎన్నికల అధికారులు తక్షణమే స్పందించాలని, బోగస్ ఓట్ల తొలగింపునకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.