Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

కడపలో పోలీసు అరాచకం

. రామకృష్ణ, సీపీఐ నేతల అరెస్టు
. అఖిలపక్షం ధర్నా భగ్నానికి విఫలయత్నం
. టీడీపీ నేతల గృహనిర్బంధం
. డాక్టర్‌ అచ్చెన్న మృతిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌

విశాలాంధ్రబ్యూరో`కడప: రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, దళితులపై దాడులే కాకుండా హత్యల పరంపర ఆగడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. దళితుల ఆక్రందనలే సీఎం జగన్‌ అంతానికి నాంది పలుకుతాయని హెచ్చరించారు. పోలీసుల దౌర్జన్యకాండ మితిమీరిందని, రాజ్యాంగేతర శక్తులుగా మారి అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నిస్తే ఉక్కుపాదం మోపుతున్నారని విరుచుకుపడ్డారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డాక్టర్‌ అచ్చెన్న మృతిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ఏప్రిల్‌ 11న పూలే జయంతి సందర్బంగా అమరావతిలో సీఎం ఇంటిని ముట్టడిస్తామని రామకృష్ణ హెచ్చరించారు. కడపలో పశుసంవర్ధకశాఖ డీడీ డాక్టర్‌ అచ్చెన్న హత్యపై సిట్టింగ్‌ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ కడప కోటిరెడ్డి సర్కిల్‌ నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు ప్రదర్శన, అక్కడ ధర్నా కోసం రామకృష్ణ శనివారం ఇక్కడికి వచ్చారు. ధర్నాను విఫలం చేసేందుకు పోలీసులు ఎక్కడికక్కడ అఖిలపక్ష నేతలను గృహ నిర్బంధం చేశారు. రామకృష్ణ బసచేసిన మానస ఇన్‌ హోటల్‌ను పోలీసులు చుట్టుముట్టారు. రామకృష్ణ బయటకు రాగానే సీపీఐ, ఇతర పార్టీల నేతలను అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు నోటీసులు అందించారు. రామకృష్ణ సహా ఇతరులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా సీపీఐ శ్రేణులు పోలీసులపై తిరగబడ్డాయి. పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ నినదించాయి. దీంతో రామకృష్ణతో పాటు సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర, కార్యవర్గసభ్యులు నాగసుబ్బారెడ్డి, నగర కార్యదర్శి ఎన్‌.వెంకటశివ, సుబ్రమణ్యం, బాదుల్లా, వీరశేఖర్‌, ఇతర నేతలను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లి వ్యాన్‌లో పడేశారు. ఆ వాహనాన్ని సీపీఐ నాయకులు, కార్యకర్తలు చుట్టుముట్టి అడ్డంగా పడుకున్నారు. సీపీఐ నేతలను పోలీసులు ఈడ్చి పడేశారు. దీంతో పోలీసులు, సీపీఐ శ్రేణులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. రామకృష్ణ వాహనాన్ని కదలనీయకపోవడంతో పోలీసులు అదనపు బలగాలను రప్పించారు. బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా గాలి చంద్ర సొమ్మసిల్లి పడిపోయారు. అనంతరం నాయకులను నగరంలోని పోలీసుస్టేషన్‌లతో పాటు చుట్టుపక్కల స్టేషన్లకు తరలించారు. ఆందోళనలో భాగంగా టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి, ఆర్‌సీపీ నాయకుడు రవిశంకర్‌రెడ్డి సహా మరికొందరిని గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్బంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ డాక్టర్‌ అచ్చెన్న హత్యపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ కోసం ఆందోళన చేయడానికి వచ్చిన తమను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని విమర్శించారు. తెల్లవారుజాము నుంచే పోలీసులు తనను చుట్టుముట్టారన్నారు. శాంతియుత ర్యాలీకి అనుమతివ్వకపోవడం విడ్డూరమన్నారు. మూడేళ్లుగా కడప జిల్లాలోనే విధులు నిర్వహిస్తున్న ఎస్పీ అన్బురాజన్‌ డాక్టర్‌ అచ్చెన్న కేసులో తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. డాక్టర్‌ అచ్చెన్న అవినీతి రహితుడిగా పేరుపొందారన్నారు. సహ ఉద్యోగులు ఆయనపై అసహనం పెంచుకొని హత్య చేయడం దారుణమని రామకృష్ణ చెప్పారు. డా.అచ్చెన్న హత్యపై ఫిర్యాదు చేసినా పోలీసులు సకాలంలో స్పందించలేదన్నారు. కనీసం పోస్టుమార్టం విషయం కూడా కుటుంబసభ్యులకు తెలియకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారన్నారు. సమాజంలో గౌరవం తెచ్చుకున్న డాక్టర్‌ అచ్చెన్న కుటుంబానికే సీఎం జగన్‌ న్యాయం చేయకపోతే…సామాన్యులను ఎలా పట్టించుకుంటారని రామకృష్ణ ప్రశ్నించారు. ప్రభుత్వ వేధింపుల కారణంగానే డాక్టర్‌ సుధాకర్‌ ఆత్మహత్య చేసుకున్నారని, కాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీ తన డ్రైవర్‌ను చంపి…మృతదేహాన్ని తల్లిదండ్రులకు డోర్‌డెలివరీ చేశాడని విమర్శించారు. డాక్టర్‌ అచ్చెన్న మృతిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్‌ చేశారు. టీడీపీ నాయకులు లక్ష్మీరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, సీపీఎం నాయకులు చంద్రశేఖర్‌, రామమోహన్‌, సీపీఐ, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img