Sunday, February 5, 2023
Sunday, February 5, 2023

కదం తొక్కిన రైతులు

తుళ్లూరు నుంచి మహాపాదయాత్ర ప్రారంభం

ప్రజలనుంచి అనూహ్య స్పందన
పార్టీలకతీతంగా భారీగా తరలివచ్చిన జనం
వైసీపీ మినహా అన్ని రాజకీయపార్టీ నేతలు హాజరు
ట్రాక్టర్‌ నడుపుతూ రైతుల్లోఉత్సాహం నింపిన రేణుకాచౌదరి
తాడికొండలో ముగిసిన తొలిరోజు యాత్ర

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న డిమాండ్‌తో అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రైతులు తలపెట్టిన ‘మహా పాదయాత్ర’కు అనూహ్య స్పందన లభించింది. ఈ యాత్రకు మద్దతుగా రాజకీయపార్టీల కతీతంగా ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. జై అమరావతి.. జైజై అమరావతి అనే నినాదాలతో రాజధాని ప్రాంతం మార్మోగిపోయింది. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరుతో సోమవారం తుళ్లూరులో ప్రారంభమైన ఈ యాత్ర తిరుపతి వరకు కొనసాగనుంది. పాదయాత్ర ప్రారంభానికి ముందు వేంకటేశ్వరస్వామి, న్యాయదేవత ప్రతిమలకు పూజలు నిర్వహించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు చేశారు. ఏకైక రాజధానిగా అమరావతి పరిరక్షణ, ఇతర ప్రాంతాలకు ఉద్యమాన్ని విస్తరించడమే లక్ష్యంగా ప్రారంభించిన ఈ పాదయాత్ర మొత్తం 45 రోజులపాటు కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా జరిగే ఈ యాత్ర డిసెంబరు 17న తిరుపతిలో ముగియనుంది. పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌. కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, కృష్ణా, గుంటూరు జిల్లా కార్యదర్శులు అక్కినేని వనజ, జంగాల అజయ్‌కుమార్‌, ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి పి.దుర్గాభవాని, నాయకులు పి.రాణి, పంచదార్ల దుర్గాంబ, మంగళగిరి నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, మాల్యాద్రి, సుభానీ తదితరులు హాజరు కాగా, తెలుగుదేశం పార్టీ తరపున దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, తెనాలి శ్రవణ్‌కుమార్‌, మర్రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, గోనుగుంట్ల కోటేశ్వరరావులు హాజరయ్యారు.సీపీఎం నుంచి రాజధాని ప్రాంత కన్వీనర్‌ చిగురుపాటి బాబురావు, కాంగ్రెస్‌ పార్టీ నుంచి మస్తాన్‌ వలి, సుంకర పద్మశ్రీ, నరహరశెట్టి నర్సింహారావు తదితరులు పాల్గొనగా, తెలంగాణా నుంచి కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ప్రత్యేకంగా విచ్చేసి రాజధాని రైతుల పాదయాత్రకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె స్వయంగా ట్రాక్టర్‌ నడుపుతూ పాదయాత్రలో పాల్గొన్నవారిని ఉత్సాహపరిచారు. రైతు సమస్య ఎక్కడ ఉంటే అక్కడ కాంగ్రెస్‌ పార్టీ ఉంటుందని చెప్పారు. అమరావతి అనే పిలుపు 683 రోజుల నుంచి నడుస్తోంది. ఈ పిలుపునకు మేమంతా స్పందించి వస్తున్నాం.. రైతాంగానికి ఎక్కడ ఏ సమస్య ఉన్నా ముందుకు రావడం కాంగ్రెస్‌ లక్ష్యం. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కోసం పోరాడుతూ రైతుల వాణిని కేంద్రానికి వినిపిస్తామన్నారు. మహిళలు నాకు బొట్టుపెట్టి స్వాగతం పలుకుతామన్నా పోలీసులు వారిని కనీసం నిలబడనీయడం లేదని, అయినా ఏం ఫర్వాలేదని, అంతిమ విజయం రైతులదేనని స్పష్టం చేశారు.
తొలిరోజు తాడికొండలో ముగిసిన యాత్ర
అమరావతి ఆకాంక్షను రాష్ట్రవ్యాప్తంగా చాటేందుకు రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్ర తొలి రోజు ఉత్సాహంగా సాగింది. తుళ్లూరు నుంచి పాద యాత్రగా బయల్దేరిన మహిళలు, రైతులకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. తొలి రోజు తుళ్లూరు దీక్షా శిబిరం నుంచి ప్రారంభమైన పాదయాత్ర తాడికొండ వరకు సాగింది. తాడికొండ సాయిబాబా గుడివద్ద పాదయాత్రకు విరామం పలికారు. తొలిరోజు 14.5 కి.మీల మేర ఈ యాత్ర సాగింది. మంగళవారం ఉదయం 8గంటలకు రెండో రోజు పాదయాత్ర ప్రారంభం కానున్నట్లు జేఏసీ నేతలు పువ్వాడ సుధాకర్‌, శివారెడ్డి, గద్దె తిరుపతిరావు, పోతుల బాలకోటయ్య తెలిపారు.
అమరావతిని కాపాడుకోకపోతే రాష్ట్ర భవిష్యత్‌ అంధకారమే : చంద్రబాబు
అమరావతి 5 కోట్ల ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక, అమరావతి పరిరక్షణ కోసం రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు సంఫీుభావం తెలియజేస్తున్నా. ఇది పాదయాత్ర కాదు, రాష్ట్ర పరిరక్షణ కోసం చేస్తున్న యాత్ర. రాష్ట్ర భవిష్యత్‌ కోసం కన్నతల్లి లాంటి భూముల్ని త్యాగం చేసిన పుడమి తల్లి వారసులు చేస్తున్న ఉద్యమమని టీడీపీ అధినేత చంద్రబాబు ఒక ప్రకటన విడుదల చేశారు. అమరావతి ఉద్యమంపై పాలక పక్షం ఎన్ని అసత్య ప్రచారాలు, అవహేళనలు, అవమానాలకు గురి చేసినా అదరక, బెదరక అనుకున్న ఆశయ సాధన కోసం, రాష్ట్ర ప్రజానీకం కోసం చేస్తున్న ఉద్యమం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ మహాపాదయాత్ర ద్వారానైనా పాలకులకు కనువిప్పు కలగాలి. అహంకారంతో మూసుకుపోయిన ముఖ్యమంత్రి కళ్లు తెరుచుకోవాలి.
పగలు, ప్రతీకారాలు, కూల్చివేతలు, రద్దులుపై చూపుతున్న శ్రద్ద రాష్ట్రాభివృద్దిపై చూపడం లేదు. విభజన జరిగినప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిన ఆంధ్రప్రదేశ్‌..అమరావతి నిర్మాణంతో స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారుతున్న తరుణంలో 3 రాజధానుల పేరుతో రివర్స్‌ పాలనకు తెరలేపారు. ఎప్పుడూ ప్రజల భవిష్యత్‌ కోసం ఆలోచించి ముందు చూపుతో నిర్ణయాలు తీసుకునే వారే నాయకుడు. అమరావతి, పోలవరం లేని రాష్ట్రాన్ని ఊహించలేం. అమరావతిని కాపాడుకోలేకపోతే రాష్ట్రం అంధకారమవుతుతుంది. ఈ పాదయాత్రకు ప్రజలు, ప్రజాసంఘాలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర అభివృద్దిని కాంక్షించే ప్రతిఒక్కరూ మద్దతు తెలపాలి. 5 కోట్ల ప్రజల గుండె చప్పుడు, తెలుగు జాతి అఖండ జ్యోతి అమరావతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని చంద్రబాబు అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img