Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

కన్నడ ఎన్నికల షాక్‌తో… మోదీ విదేశాలకు పరుగు

. కార్పొరేట్లకు కేంద్రం ఊడిగం
. వివేకా కేసులో సీబీఐ ఊగిసలాట
. సీపీిఐ కార్యదర్శి నారాయణ

విశాలాంధ్రబ్యూరో – కడప : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలతో ఉపశమనం పొందుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. మోదీ విధానాలపై ప్రజా వ్యతిరేకత తారస్థాయికి చేరిందని చెప్పారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో నారాయణ మాట్లాడుతూ దేశ సంపదను కొల్లగొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్తులను, అధికారాన్ని అడ్డుపెట్టుకొని విచ్చలవిడిగా సంపాదిస్తున్న కార్పొరేట్‌ కంపెనీలకు మోదీ ఊడిగం చేస్తున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు. విదేశీ పర్యటనకు మంత్రులను తీసుకెళ్లని మోదీ…డొల్ల కంపెనీలతో ఆర్థిక నేరాలకు పాల్పడి అపర కుబేరుడుగా మారిన అదానీని వెంటబెట్టుకు తిరగడం సిగ్గుచేటన్నారు. ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టడం, మరోవైపు మత విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొందడం మోదీ సర్కారుకు అలవాటుగా మారిందని నారాయణ విమర్శించారు. అందుకే బీజేపీికి కన్నడ ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. బీజేపీకి దక్షిణ భారతదేశంలో తలుపులు మూసుకుపోయాయన్నారు. లౌకిక, ప్రజాస్వామ్య, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మోదీ కన్నడ ఎన్నికల్లో జై బజరంగ్‌దళీ నినాదాలు చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. బీజేపీ వ్యతిరేకులపై సీబీఐ, ఈడీలను ఉసిగొల్పి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఎన్నికల కమిషనర్‌ నియామకంపై సుప్రీం కోర్టు సూచనలను సైతం పట్టించుకోకుండా మోదీ సర్కారు నియంతృత్వంగా వ్యవహరిస్తోందని, ఆర్‌ఎస్‌ఎస్‌ అనుయాయులకు ఉన్నత పదవులు కట్టబెడుతోందని ఆరోపించారు.గవర్నర్ల వ్యవస్థ ద్వారా బీజేపీ యేతర పాలిత రాష్ట్రాలలో సమాంతర ప్రభుత్వం నడుపుతోందని మోదీ సర్కారుపై నారాయణ విరుచుకుపడ్డారు. మితిమీరిన జోక్యంతో రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్ర చేస్తోందన్నారు. రూ.2 వేల నోట్ల మార్పిడి పేరుతో మరోసారి దేశ ప్రజలను వంచిస్తోందన్నారు. ప్రత్యర్థుల ఆర్థిక పునాదులపై దెబ్బకొట్టి…బీజేపీ బలపడేందుకూ రెండు వేల నోట్ల వాపసు నాటకమని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరానికి నిధులు, ఆర్థిక లోటు భర్తీ, రాష్ట్ర రాజధాని నిర్మాణ వ్యయం, కడప ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు వంటి అనేక హామీలను మోడీ సర్కారు విస్మరించిందని మండిపడ్డారు. అయినా జగన్‌ ప్రభుత్వం మాత్రం మోదీ కనుసన్నల్లో పనిచేస్తోంద న్నారు. జగన్‌ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెడుతోంద న్నారు. రాష్ట్రంలో బీజేపీతో వైసీపీ కలిసి పనిచేస్తుంటే…టీడీపీ సైతం కాషాయం వైపే చూస్తోందని నారాయణ చెప్పారు. బీజేపీ వైపు టీడీపీ చూడటమంటే దళిత, మైనారిటీల ఓట్లను చంద్రబాబు మర్చిపోవడమేనని హితవు పలికారు. అంతిమంగా వైసీపీ అధికారంలోకి రావడానికి టీడీపీ సహకరించినట్లు అవుతుందన్నారు. బీజేపీ, టీడీపీకి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాయబారం నడుపుతున్నట్లు కనిపిస్తోంద న్నారు. మాజీమంత్రి వైయస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినా శ్‌రెడ్డి అరెస్టు విషయంలో సీబీఐ దాగుడుమూతలాడుతోందని విమర్శించారు. ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, సీపీఐ కడప జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్‌.నాగ సుబ్బారెడ్డి, ఎన్‌.వెంకటశివ, సి.బషీరున్నీసా, సి.సుబ్రహ్మణ్యం, పి.చంద్రశేఖర్‌, జి.వేణుగోపాల్‌, కేసీ బాదుల్లా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img