Friday, March 31, 2023
Friday, March 31, 2023

కమలం కకావికలం

. కేంద్రంలో తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్నా ఏపీలో బలహీనపడుతున్న విచిత్ర పరిస్థితి
. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ‘కన్నా’ నిష్క్రమణ
. అదేబాటలో మరికొందరు నేతలు
. అసంతృప్తితో రగులుతున్న కమలనాథులు
. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయమే కారణం

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: ఏపీలో బీజేపీ పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. కేంద్రంలో 9ఏళ్లుగా ఆ పార్టీ అధికారంలో కొనసాగుతున్నా...రాష్ట్రంలో ఏమాత్రం ఆ పార్టీ పుంజుకోకపోగా బలహీనపడుతోంది. సహజంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి కిందిస్థాయిలో బలపడటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తొలుత ఆ ఉద్దేశంతోనే కాంగ్రెస్‌, టీడీపీ నుంచి కేంద్ర మాజీమంత్రులు, ఎంపీలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ కేంద్ర, రాష్ట్ర బీజేపీ అధినేతల తీరుతో వారిని కూడా పార్టీలో ఇముడ్చుకోలేని విచిత్ర పరిస్థితి ఏర్పడిరది. ఫలితంగా ఏపీలో బీజేపీ పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్‌తో భాగస్వామి అయిన బీజేపీ... ఆ తర్వాత విభజన అంశాలు అమలు చేయడంలో పూర్తి నిర్లక్ష్యం కనబర్చింది. విభజన చట్టం ప్రకారం పార్లమెంటు హామీలు, విభజన అంశాల అమలుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవల్సి ఉండగా, 9 ఏళ్లు పూర్తయినా ఇప్పటివరకు ఏ ఒక్క అంశం కూడా పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. ఇప్పటికీ వాటిని పూర్తి చేయాలన్న సంకల్పం కేంద్ర ప్రభుత్వంలో కానరావడం లేదు. పైగా అమరావతి రాజధానికి స్వయంగా శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, దాని విధ్వంసానికి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సహకారం అందిస్తున్నారు. 2015లో విజయదశమి పండుగ సందర్భంగా అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన మోదీ... ఇప్పటివరకు దాని గురించి పట్టించుకోకపోవడం గమనార్హం. రాజధాని ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సుమారు 22 సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించింది. వాటిల్లోనూ ఇప్పటివరకు ఏ ఒక్క నిర్మాణాన్నీ చేపట్టలేదు. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పాట పాడుతూ అమరావతి విధ్వంసానికి శతవిధాలా ప్రయత్నిస్తుండగా, కేంద్ర ప్రభుత్వం అది మన దేశంలో భాగం కాదన్నట్లుగా చోద్యం చూస్తోంది. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు తమకు న్యాయం చేయాలని మూడేళ్లుగా ఉద్యమిస్తున్నారు. దానిని అణచివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వేల సంఖ్యలో రైతులపై అక్రమకేసులు బనాయించింది. కనీసం మహిళలనే కనికరం లేకుండా వారిపై పోలీసులు జులుం ప్రదర్శించి భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించారు. ఉద్యమంలో పాల్గొనే మహిళలందరిపై దాదాపు కేసులు నమోదు చేశారు. అయినా ఒక్కరోజు కూడా మోదీ స్పందించలేదు. పైగా హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయాల్సిన సందర్భంలో రాజధానిపై నిర్ణయం రాష్ట్రానిదే అంటూ కేంద్రం తన అభిప్రాయాన్ని వెల్లడి చేస్తూ రాజధాని సమస్యకు ఆజ్యం పోసింది. అమరావతి రాజధానికే కట్టుబడి ఉన్నామని రాష్ట్ర బీజేపీ శాఖ బొంకుతుండగా, కేంద్ర పెద్దలు మాత్రం ప్రభుత్వ అభిప్రాయం వేరు, పార్టీ అభిప్రాయం వేరు అంటూ విచిత్ర వాదనలు వినిపిస్తున్నారు. అలాగే ఏపీకి అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టుకి పెరిగిన అంచనా ప్రకారం నిధులు విడుదల చేయకుండా నానా తిప్పలు పెడుతోంది. పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధాని ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని తుంగలో తొక్కింది. ఇక కడప ఉక్కు పరిశ్రమ, విశాఖ రైల్వే జోన్‌, లోటు బడ్జెట్‌ భర్తీ, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక నిధులు, దుగరాజపట్నం పోర్టు, విజయవాడ, విశాఖ మెట్రో రైలు, అమరావతిఅనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవే, అమరావతి ఓఆర్‌ఆర్‌, రాజధాని నిర్మాణానికి నిధులు వంటి అనేక విభజన అంశాలకు కేంద్రం తిలోదకాలిచ్చింది. కేంద్ర విద్యా, వైద్య సంస్థలకు సంబంధించి ఇప్పటివరకు ఏ ఒక్క సంస్థకూ పూర్తిస్థాయి నిధులు మంజూరు చేయలేదు. దీనిపై పార్లమెంటులో ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే, ఏపీకి ఎంతో చేశామని తప్పుడు లెక్కలు చెపుతూ రాష్ట్ర ప్రజలను కేంద్ర మంత్రులు మోసగిస్తున్నారు. దానికి రాష్ట్ర బీజేపీ నేతలు తందానా పలుకుతున్నారు. కేంద్ర బీజేపీ నేతల తరహాలోనే రాష్ట్ర కమలనాథులు కూడా కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు తప్ప, రాష్ట్రానికి చెప్పుకోవడానికి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా అమలు చేయని పరిస్థితి నెలకొంది. దీంతో రాష్ట్ర కమలనాథులు పైకి బింకంగా వాదనలకు దిగుతున్నా, అంతర్గతంగా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీనిలో భాగంగానే ఇటీవల బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీ నుంచి నిష్క్రమించారు. ఆయన ఈనెల 23వ తేదీన టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఆయన బాటలోనే మరికొందరు కమలనాథులు పార్టీని వీడే పరిస్థితి కనపడుతోంది. ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ఆయనతోపాటు ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు, మరో ఇద్దరు నేతలు పార్టీలో పెత్తందారీతనాన్ని చూపిస్తున్నారని, వాటిని భరించలేకున్నామంటూ అసమ్మతివాదులు గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ తప్పిదాలను ఎండగడుతూ పార్టీని బలోపేతం చేయాల్సిన తరుణంలో ఈ నాయకులు వైసీపీతో కలిసి సొంత పార్టీని దెబ్బతీసే ప్రయత్నంలో ఉన్నారని వారు ఆరోపిస్తున్నారు. తొలుత కేంద్ర మాజీమంత్రులు కావూరి సాంబశివరావు, జేడీ శీలం, దగ్గుబాటి పురందేశ్వరి, తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌, గరికపాటి రామ్మోహనరావు, టీజీ వెంకటేశ్‌ లాంటి పెద్దనేతలే బీజేపీలో చేరారు. ఆ తర్వాత రాష్ట్రంలో కాపు సామాజికవర్గంలో కీలక నేతగా ఉన్న రాష్ట్ర మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చేరారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఇవేమీ పార్టీ పుంజుకోవడానికి ఏమాత్రం దోహదపడలేదంటే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా కన్నా రాజీనామా తర్వాత, ఆయన బాటలో మరికొందరు బీజేపీ నేతలు పార్టీని వీడేందుకు సిద్ధపడుతున్న విషయాన్ని ఆపార్టీ అధిష్ఠానం గుర్తించినట్లు తెలుస్తోంది. ఈనెల 26వ తేదీ ఒకసారి దిల్లీ రావాల్సిందిగా అసమ్మతివాదులను జాతీయ నేత ఒకరు ఆహ్వానించినట్లు సమాచారం. ఏపీలో ఉన్న ఇబ్బందులు, పార్టీ పటిష్టతకు తీసుకోవల్సిన చర్యల గురించి అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో మాట్లాడుకుందామని, తొందరపడొద్దని వారికి సూచించినట్లు తెల్సింది. ఈ అసమ్మతివాదులంతా సోము వీర్రాజుకు వ్యతిరేకంగా నివేదికను సిద్ధం చేస్తున్నట్లు చెపుతున్నారు. కన్నా వెళ్లిపోవడానికి కారణాలతో పాటు, ఆయన హయాంలో నియమితులైన ఆరుగురు జిల్లా అధ్యక్షులను తొలగించిన తీరును ఈ నివేదికలో ప్రస్తావించబోతున్నారు. అలాగే వైసీపీతో అంటకాగుతూ వీర్రాజుపై వస్తున్న అవినీతి ఆరోపణలను అసమ్మతివాదులు అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లబోతున్నట్లు తెల్సింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img