Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

కమ్యూనిస్టుల ఏకీకరణ జరగాలి

. సోషలిజమే ప్రత్యామ్నాయం
. కాంగ్రెస్‌ పార్టీ తీరు మారాలి
. సీపీఐ తెలంగాణ రాష్ట్ర మహాసభలో రాజా

విశాలాంధ్ర`శంషాబాద్‌: సైద్ధాంతిక ప్రాతిపదికన కమ్యూనిస్టు పార్టీల ఏకీకరణ జరగాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. సీపీఐ ప్రధాన కార్యదర్శిగా చండ్ర రాజేశ్వరరావు ఉన్న సమయంలో 1989లో కమ్యూనిస్టు ఉద్యమ పునరేకీకరణ జరగాలన్నారని గుర్తు చేశారు. తాజాగా కమ్యూనిస్టు పార్టీల ఏకీకరణ కావాలని సీపీఐ ప్రతిపాదిస్తున్నదని, ఈ మేరకు విజయవాడలో జరిగే జాతీయ మహాసభలకు సంబంధించిన ముసాయిదా రాజకీయ తీర్మానంలో పేర్కొన్నట్లు రాజా వెల్లడిరచారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని కామ్రేడ్‌ గుండా మల్లేశ్‌ ప్రాంగణం (మల్లికా కన్వెన్షన్‌ సెంటర్‌)లో జరుగుతున్న సీపీిఐ తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభలో భాగంగా సోమవారం ప్రతినిధుల సభ ప్రారంభమైంది. డి.రాజా ప్రారంభోపన్యాసం చేస్తూ గతంలో చెప్పిన పునరేకీకరణకు, నేడు ప్రతిపాదిస్తున్న ఏకీకరణకు తేడా ఏమిటంటే, సీపీఎం జనతా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతోందనీ, సీపీిఐ జాతీయ ప్రజాస్వామ్యం గురించి చెబుతోందని, వీటి విషయంలో సైద్ధాంతిక ప్రాతిపదికన కమ్యూనిస్టు పార్టీ ఏకీకరణ జరగాలనేది తమ అభిప్రాయమని చెప్పారు. ఇప్పటికే ఈ అంశాన్ని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుల సమక్షంలో చెప్పామన్నారు. ప్రజలకు సామాజిక న్యాయం, సమానత్వం అందాలంటే కమ్యూనిస్టు, వామపక్ష శక్తుల బలోపేతమే మార్గమని రాజా అన్నారు. దేశంలో నూతన పరిస్థితులు, సవాళ్లు నెలకొన్నాయనీ,వాటిని ఎదుర్కొనేందుకు బలమైన సీపీిఐ నిర్మాణం జరగాలని, రాష్ట్ర , జాతీయ రాజకీయాలను కుదిపేసే విధంగా ఎదగాలని సూచించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాను అమలు చేస్తోందని, ఈ ప్రభుత్వం మతతత్వ, ఫాసిస్టు, పెట్టుబడిదారుల ఆశ్రిత పక్షపాత ప్రభుత్వమని విమర్శించారు. ప్రభుత్వ రంగాన్ని, లౌకికవాదాన్ని ధ్వంసం చేస్తోందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాద, ఫాసిస్టు సంస్థ అని, అది పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అణచివేస్తోందన్నారు. దేశాన్ని హిందూ మత రాజ్యంగా మార్చాలని చూస్తోందని, అసలు ఆర్‌ఎస్‌ఎస్‌కు మొత్తం హిందువుల తరపున ప్రాతినిధ్యం వహించాలని ఎవరూ బాధ్యతలు అప్పగించలేదన్నారు. మోదీ ప్రభుత్వం శరవేగంగా నయా ఉదారవాద విధానాలను అమలు చేస్తూ, కార్పొరేట్‌, బడా సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ ప్రభుత్వాన్ని కూలదోయడమే కాదని, దానికి ప్రత్యామ్నాయం చూపించాల్సిన బాధ్యత మనపై ఉన్నదని,అందరికీ విద్య ఆరోగ్యం ఉపాధి, గృహాలు, ఆహార హక్కు వంటి ప్రాథమిక అంశాలను కల్పించడమే ప్రత్యామ్నాయ విధానమని రాజా స్పష్టం చేశారు. కార్మిక, కర్షక వర్గాన్ని కేవలం ఆర్థిక డిమాండ్ల కోసమే కాకుండా రాజకీయ అధికారం కోసం, విప్లవాత్మక సామాజిక మార్పు కోసం కూడగట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో అన్ని లౌకిక, ప్రజాతంత్ర పార్టీలు కలిసి పోరాడాలని కోరారు. నయా ఉదారవాద విధానాల అమలుతో ప్రపంచవ్యాప్తంగా మునుపెన్నడూ లేని రీతిలో ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయని రాజా ఆందోళన వ్యక్తంచేశారు. ఇది పెట్టుబడిదారి వ్యవస్థ వైఫల్యమని, దీనికి ప్రత్యామ్నాయం సోషలిజం మాత్రమేనని చెప్పారు. ఇప్పటికే లాటిన్‌ అమెరికా, ఫ్రాన్స్‌, జర్మనీ వంటి దేశాలలో, ఆసియా దేశాలలో వామపక్ష, వామపక్ష భావాలు కలిగిన ప్రభుత్వాలను ప్రజలు ఎన్నుకుంటు న్నారని తెలిపారు. శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంతో ప్రజలు తిరగబడ్డారని, అయితే దానికి సరైన నాయకత్వం అందించే వారు లేకపోవడం, బలమైన వామపక్షం లేకపోవడంతో విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయారన్నారు. శ్రీలంక లాంటి పరిస్థితులే భారతదేశంలో ఉన్నాయని, ఇక్కడ కూడా సంక్షోభానికి ప్రత్యామ్నాయం సోషలిజమేనని తెలిపారు. అందుకే కమ్యూనిస్టు పార్టీ, వామపక్షాలు బలమైన రాజకీయశక్తిగా ఎదగాలని, ప్రజలను రాజ్యాధికారం దిశగా తీసుకెళ్లాలని రాజా సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ భారతదేశమంతటా విస్తరించిన లౌకిక పార్టీ అని, అయితే అది అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయిందని అన్నారు. ఆ పార్టీ దాని నుండి బైటపడి, బీజేపీ వ్యతిరేక పోరాటంలో ఆ పార్టీ కూడా ముందుకు రావాలని చెప్పారు. అదే సమయంలో కాంగ్రెస్‌ నాయకులు తమ విధానాలను కూడా మార్చుకోవాలన్నారు. గతంలో ఆ పార్టీకి చెందిన పీవీనరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఉదారవాద ఆర్థిక సంస్కరణలను తీసుకువచ్చారని, ఇప్పుడు కూడా ఆ విధానాలను, ప్రైవేటీకరణను సమర్థిస్తామంటే కుదరదని రాజా స్పష్టంచేశారు. కాంగ్రెస్‌ హయాంలోనే ప్రభుత్వ రంగ సంస్థలు, పంచవర్ష ప్రణాళికలు వచ్చిన విషయాన్నీ మరవకూడదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img