Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

కరెంట్‌ కష్టాలు

ముంచుకొస్తున్న విద్యుత్‌ సంక్షోభం
నిండుకున్న బొగ్గు నిల్వలు
గణనీయంగా పెరుగుతున్న వినియోగం
అప్రమత్తమైన అధికార యంత్రాంగం
ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖ
దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : గతంలో ఎన్నడూ లేనివిధంగా దేశవ్యాప్తంగా నెలకొన్న బొగ్గు కొరతతో రాష్ట్రాన్ని విద్యుత్‌ సంక్షోభం చుట్టుముడుతోంది. ఇప్పటికే కొన్ని ప్లాంట్లలో విద్యుత్‌ ఉత్పిత్తి నిలిచిపోగా, ప్రస్తుతం ఉన్న బొగ్గు నిల్వలు మరో నాలుగు రోజుల్లో పూర్తిగా నిండుకోనున్నాయి. మరోపక్క విద్యుత్‌ వినియోగం రోజురోజుకు భారీగా పెరుగుతోంది. ఇప్పటికే దాదాపు 20 శాతం అదనంగా విద్యుత్‌ వినియోగం పెరగ్గా, రాష్ట్ర ప్రభుత్వానికి కొనుగోలు భారం తీవ్రమవుతోంది. ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలనే దానిపై రాష్ట్ర అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. పొంచిఉన్న విద్యుత్‌ సమస్యను ఆ శాఖాధికారులు ముఖ్యమంత్రి జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన జగన్‌ సమస్య తీవ్రతను వివరిస్తూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. బొగ్గు కొరత సమస్యను తీర్చడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని విన్నవించారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో రాష్ట్రంలో ప్రత్యామ్నాయమార్గాల కోసం అన్వేషిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో విద్యుత్‌కోత విధించకుండా అదనపు ధరకైనా విద్యుత్‌ కొనుగోలు చేసి సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ప్రయత్నాలు చేస్తోంది. పారిశ్రామిక, గృహ అవసరాల కోసం దేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో సింహభాగం థర్మల్‌ కేంద్రాల నుంచే వస్తోంది. ఎన్టీపీసీ, టాటా పవర్‌, టొరెంట్‌ పవర్‌ ఇలా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని చిన్నా పెద్దా అన్నీ కలిపి 135 థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లు ఉండగా అవన్నీ ఇప్పుడు బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. దేశవ్యాప్తంగా విద్యుదుత్పత్తి చేసే కేంద్రాల్లో బొగ్గు ఆధారిత ప్లాంట్ల వాటా 70 శాతంగా ఉంది. వీటిలో ఇప్పటికే 16 ప్లాంట్లలో బొగ్గు నిల్వలు అయిపోయి మూతపడ్డాయి. అంటే దాదాపు 16,880 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. 30 ప్లాంట్లలో నిల్వలు కేవలం 24 గంటల వ్యవధిలో కరిగిపోనున్నాయి. దీంతో 37,345 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి ఆగిపోతుంది. మరో 65 ప్లాంట్లకు సకాలంలో బొగ్గు సరఫరా జరగకపోతే వారం రోజుల్లో మూసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాయని, ఇవన్నీ మూతపడితే దేశవ్యాప్తంగా 1,36,159 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితి చూస్తే ఒకసారి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో విద్యుత్‌ ఉత్పత్తి మొదలుపెడితే కనీసం వారం రోజులైనా ఆపకుండా నడపాల్సి ఉంటుంది. అటువంటిది ఏపీలోని థర్మల్‌ కేంద్రాల్లో అందుకు తగినట్టు నిల్వల్లేవని సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ బోర్డు వెల్లడిరచింది. రాష్ట్రంలో ప్రధాన థర్మల్‌ కేంద్రాలైన డాక్టర్‌ నార్ల తాతారావు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (ఎన్‌టీటీపీఎస్‌), రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (ఆర్‌టీపీపీ), శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (ఎస్‌డీఎస్‌టిపీఎస్‌-కృష్ణపట్నం) మొత్తం 5,010 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో నడుస్తున్నాయి. వీటిలో విజయవాడ ఎన్‌టీటీపీఎస్‌కు రోజుకి 24,600 టన్నుల బొగ్గు కావాలి. ప్రస్తుతం ఇక్కడ 13,600 టన్నులే నిల్వ ఉంది. ఆర్‌టీపీపీకి 4 రోజులకు సరిపడా బొగ్గు మాత్రమే ఉంది. దామోదరం సంజీవయ్య పవర్‌ స్టేషన్‌కి వారం రోజులకు సరిపోడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. మరోవైపు బొగ్గు కొరత కారణంగా మార్కెట్‌లో విద్యుత్‌ కొనుగోలు ధరలు అమాంతం పెరిగాయి. కేవలం రూ.4లకు వచ్చే యూనిట్‌ విద్యుత్‌కు ఇప్పుడు దాదాపు రూ.6 నుంచి పీక్‌ అవర్స్‌లో రూ.20 వరకూ వెచ్చించాల్సి వస్తోందని ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ నాగులాపల్లి శ్రీకాంత్‌ చెపుతున్నారు. రాష్ట్రంలో రోజువారీ విద్యుత్‌ వినియోగం 195 మిలియన్‌ యూనిట్లు కాగా, వీటిలో ఏపీ జెన్‌కో ద్వారా 40 మిలియన్‌ యూనిట్లు, కేంద్ర ప్లాంట్ల నుంచి 35 మిలియన్‌ యూనిట్లు, జల విద్యుత్‌ కేంద్రాల నుంచి 25 మిలియన్‌ యూనిట్లు, సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల నుంచి 15 మిలియన్‌ యూనిట్లు సరఫరా అవుతోందని, మిగిలిన కరెంటు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్‌ పాలసీ ప్రకారం గత రెండేళ్లుగా సౌర, పవన విద్యుత్‌ను ప్రోత్సహిస్తున్నామని, దీంతో బొగ్గు ఆధారిత ప్లాంట్లతో ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదన్నారు. ఫలితంగా రాష్ట్ర అవసరాలకు సరిపడా బొగ్గు సరఫరా లేక, మార్కెట్లలో అధిక రేట్లకు విద్యుత్‌ కొని అంతరాయం లేకుండా సరఫరా చేస్తున్నామని తెలిపారు. గృహ వినియోగదారులు పీక్‌ సమయంలో ఏసీ వాడకాన్ని తగ్గిస్తే 10 మిలియన్‌ యూనిట్లు ఆదా అవుతుందని, ప్రస్తుతం ఇంతకంటే మరోమార్గం లేదని తెలిపారు. విద్యుత్‌ సంస్థలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో దాదాపు రూ.34,340 కోట్లు ఆర్థిక సహాయం చేసినట్లు ఆయన వెల్లడిరచారు. విద్యుత్‌ సంస్థలు మనందరివని, వాటిని కాపాడుకోవల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img