Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

కల్లాల్లో ధాన్యం… కష్టాల్లో రైతాంగం

కొనుగోలు కోసం ఎదురు చూపులు
రైతుల వద్ద ఇంకా లక్ష టన్నుల ధాన్యం

(విశాలాంధ్ర`విజయనగరం/ భోగాపురం/వేపాడ/దత్తిరాజేరు/గుర్ల) – ధాన్యం సేకరణ కోసం విజయనగరం జిల్లా రైతాంగం ఇంకా ఎదురుచూపులు చూస్తోంది. తమ కష్టానికి ప్రతిఫలం దక్కుతుందో, లేదోననే ఆందోళనలో రైతులు ఉన్నారు. కల్లాల్లో ధాన్యం నిల్వలకు కాసులు రూపం ఎప్పుడు వస్తుందోననే ఆవేదన రైతుల్లో కనిపిస్తోంది. ధాన్యం బస్తాలను ట్రాక్టర్లలో నింపుకుని అధికారుల ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. విజయనగరం జిల్లాలో ఖరీఫ్‌లో 5 లక్షల టన్నులకు పైగా దిగుబడి ఉంటుందని అంచనా వేశారు. గత ఏడాది డిసెంబరు 20 నుంచి ధాన్యం సేకరణ ప్రారంభించారు. మొత్తం మీద 3.68 లక్షల టన్నులు సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో ఇప్పటి వరకు సుమారు 2.92 లక్షల టన్నులను సేకరించడంతో పాటు ఆయా రైతుల ఖాతాల్లో సకాలంలో సొమ్ము జమయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఇంకా సుమారు లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యం రైతుల వద్దే ఉండిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణకు కొత్త విధానం తీసుకువచ్చింది. దళారుల ప్రమేయం లేకుండా రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయడమే నూతన విధాన ప్రథమ లక్ష్యం. ఈ కొత్త విధానం వల్ల జిల్లాలో ధాన్యం సేకరణకు అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. ధాన్యం సేకరణకు అవసరమైన బ్యాగ్‌ల దగ్గర నుంచి అనేక సమస్యలు ప్రాథమికంగా ఎదురయ్యాయి. ధాన్యాన్ని ఆర్బీకేలకు, అక్కడ నుంచి మిల్లులకు తరలించేటప్పుడు చెల్లించే రవాణా విషయంలోనూ సమస్యలు తలెత్తాయి. అయితే వాటిని అధిగమించేందుకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలు కొంతమేర ఫలించాయనే చెప్పాలి. ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ సంక్రాంతి నాటికి సుమారు 2.64 లక్షల టన్నులను సేకరించారు. మొత్తం లక్ష్యంలో రెండవ వంతు సేకరణ, వాటికి చెల్లింపులను పూర్తి చేశారు. అయితే ఇంకా లక్షల టన్నుల వరకు ధాన్యం సేకరించకుండా రైతుల వద్ద ఉండిపోయింది. దీంతో ఆయా రైతులంతా తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ఇటీవల భోగాపురంలో పెద్ద ఎత్తున రైతులు ఆందోళనకు దిగారు. పంటలో 50 శాతం కూడా కొనుగోలు చేయకుండా లక్ష్యం పూర్తయిందంటూ అధికారులు చెప్పడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు కల్పించుకుని సమస్యను కొలిక్కి తీసుకువచ్చారు. పండిన ప్రతి గింజ కొంటామన్న ప్రభుత్వ హామీకి, క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉండడమే రైతుల ఆగ్రహానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన చేపట్టడంతో 100 టన్నులు కొనుగోలు చేస్తామనే హామీ లభించింది. ఇంకా భోగాపురంలో 500 టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. వేపాడ మండలంలో కూడా దాదాపు ఇటువంటి పరిస్థితే ఉంది. మొత్తం 16,571 మెట్రిక్‌ టన్నుల ధాన్యంలో 8,132 టన్నులు సేకరించగా, రైతులు సొంతానికి, బయట అమ్మకాలకు 4,939 టన్నులు పోగా, ఇంకా కొనుగోలు చేయవలసింది 3,500 మెట్రిక్‌ టన్నుల వరకు ఉంది. అయితే జిల్లాలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు లక్ష్యం పూర్తయిందని చెప్పిన తర్వాత వ్యవసాయ అధికారులు రైతుల కల్లాల్లో రైతులతో ధాన్యం నిల్వ ఉన్న ఫొటోలతో పీపీసీ యాప్‌ ద్వారా అప్‌లోడ్‌ చేయడంతో మరలా 1801 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. ప్రస్తుతం రైతులు దగ్గర 1,699 మెట్రిక్‌ టన్నులు ధాన్యం నిల్వ ఉంది. దత్తిరాజేరు మండలంలోని రైతాంగం పరిస్థితి దారుణంగా ఉంది. రైతులు పండిరచిన పంటను ప్రభుత్వం కొంటుందని ప్రకటించినప్పటికీ అది పేపర్ల ప్రకటనకే తప్ప అమలు కాలేదు. ఈ`క్రాప్‌ అయిన రైతులందరి ధాన్యం సేకరిస్తున్నామన్నా, నేటికీ ఆ దిశగా ప్రయత్నం జరగలేదు. అలాగే గత 20 రోజుల నుంచి ధాన్యం కొనుగోలు లేక కల్లాల్లోనే నిల్వలు ఉండిపోవడం వలన క్వింటా రూ.1,700 అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిరది. సుమారు 5,000 మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉండిపోయింది. పొలాల్లో ఎక్కడ చూసినా ధాన్యం బస్తాలు నెట్లు వేసి ఉన్నాయి. అయితే మండలంలో అధికారులు మాత్రం 75 శాతం ధాన్యం కొనుగోలు చేశామని చెబుతున్నారు.
రైతుల పరిస్థితులను ఆసరాగా తీసుకుని దళారుల తక్కువ ధర చెల్లించినప్పటికీ గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు నష్టానికే ధాన్యం అమ్ముకుంటున్నారు. గుర్ల మండలంలో 85 శాతం ధాన్యం కొనుగోలు చేపట్టారు. 42 పంచాయతీల పరిధిలో గ్రామానికి సుమారుగా 50 మంది రైతులు ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ధాన్యాన్ని కల్లాల్లోనే ఉంచారు. ఎలుకలు బెడద ఎక్కువగా ఉండడంతో ధాన్యం బస్తాలు చిరిగి పోయి ధాన్యం నేలపాలు అవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద జిల్లాలో సుమారు లక్ష టన్నుల వరకు ధాన్యం సేకరించారు. అందులో సగం వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినట్లు తెలుస్తోంది. నడుపురు రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రారంభించారు. వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు చేసి తమ కష్టాలు తీర్చాలని రైతులు కోరుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img