Thursday, December 8, 2022
Thursday, December 8, 2022

కల్లోల కమలం

తారస్థాయికి గ్రూపు రాజకీయాలు
పార్టీ నిర్మాణం కంటే ఆధిపత్యంపైనే నేతల దృష్టి

. కేంద్ర అన్యాయంపై నోరు మెదపని కమలనాథులు
. 2024 ఎన్నికల పొత్తులపై అయోమయం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ (బీజేపీ) పరిస్థితి కొంగర మల్లయ్య సామెతను తలపిస్తోంది. రాష్ట్రంలో సొంతంగా వార్డు మెంబరుగా కూడా గెలవలేని బీజేపీ నేతలు… వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారం మాదే అని సవాళ్లు విసరడం ఆ పార్టీని ప్రజల్లో నవ్వుల పాలు చేస్తోంది. కేంద్రంలో బీజేపీ ఎనిమిదిన్నర సంవత్సరాలుగా అధికారంలో కొనసాగుతున్నా రాష్ట్రంలో ఆ పార్టీ ఏమాత్రం పుంజుకోవడం లేదు. పైగా రోజురోజుకూ బలహీనపడుతోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏపీకి తీరని అన్యాయం చేస్తున్నా రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు ఏమాత్రం పట్టించుకోకపోవడం, మరోపక్క ఆధిపత్యం కోసం అంతర్గత కుమ్ములాటలతో పార్టీ పటిష్ఠత, నిర్మాణంపై దృష్టి పెట్టకపోవడం దీనికి ముఖ్య కారణాలుగా పేర్కొనవచ్చు. దీనివల్లే కేంద్రంలో బీజేపీ రెండు సార్లు అధికారంలోకి వచ్చినా, రాష్ట్రంలో ఒకసారి టీడీపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కమలం ఏమాత్రం వికసించకపోగా పూర్తిగా వాడిపోయే పరిస్థితి దాపురించింది. ఆ పార్టీ నాయకులు ఏపీకి కేంద్రం ఎంతో చేసినట్లు ఉపన్యాసాలు ఊదరగొట్టడం, ఒక పక్క అమరావతి రాజధానికి జై అంటూనే మరోపక్క కేంద్రం పట్టించుకోకపోవడం, పచ్చి అబద్ధాలతో ప్రజలను మభ్యపుచ్చే ప్రకటనలు చేయడం వల్ల క్షేత్రస్థాయిలో ఆ పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతోంది. కమలనాథులంతా టీడీపీ, వైసీపీ గ్రూపులుగా కొందరు విడిపోగా, బీజేపీ అధిష్ఠానం ఆశీస్సులు, ఆర్‌ఎస్‌ఎస్‌ ఆశయాలే లక్ష్యంగా మరొక గ్రూపు కొనసాగుతోంది. వై.సుజనా చౌదరి, సీఎం రమేశ్‌, ఆదినారాయణ రెడ్డి, డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌, విష్ణుకుమార్‌ రాజు, కన్నా లక్ష్మీనారాయణ, సత్యకుమార్‌, లంకా దినకర్‌ తదితరులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు బీజేపీ అధినేతలకు ఫిర్యాదులు వెళుతున్నాయి. ఇక అత్యంత సీనియర్‌ నాయకులు ఎం. వెంకయ్యనాయుడు, హరిబాబు కూడా చంద్రబాబుకి అనుకూలమన్న సంకేతాలు ఆ పార్టీ నేతల్లో ఉన్నాయి. అలాగే ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు, విష్ణువర్థన్‌ రెడ్డితో పాటు మరికొంత మంది నేతలు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. బీజేపీ అధినేతలు కూడా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుండటంతో పార్టీలో వీరి హవా కొనసాగుతోంది. ఇక దగ్గుబాటి పురంధేశ్వరి, టీజీ వెంకటేశ్‌, మాధవ్‌ తదితర నేతలు కొంతమంది నేరుగా బీజేపీ అధిష్ఠానం ఆదేశాలపై ఆధారపడుతున్నారు. మొత్తానికి వీరంతా ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటూ ఆధిపత్యం కోసం తాపత్రయ పడుతున్నారే తప్ప పార్టీ ఎదుగుదల గురించి పట్టించుకోవడం లేదు. విచిత్రమేమిటంటే బీజేపీ అగ్రనేతలే ఏపీలో పార్టీ బలోపేతం గురించి పట్టించుకోవడం లేదు. వాస్తవంగా దక్షిణాదిలో కర్ణాటక మినహా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పూర్తి బలహీనంగా ఉన్నప్పటికీ, ఇటీవల తెలంగాణపై దృష్టి సారిస్తోంది తప్ప, ఏపీ గురించి మాత్రం ఆలోచించడం లేదు.
కేంద్రానికి పూర్తి సహకారమందిస్తున్న వైసీపీ
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తోంది. పార్లమెంటులో ఏ బిల్లు పెట్టినా, అదెంత వివాదస్పద అంశమైనా వైసీపీ ఎంపీలు జై అంటున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఏపీలో జగన్‌ ప్రభుత్వం తు.చ తప్పక అమలు చేస్తోంది. పైగా రాష్ట్ర ప్రయోజనాలను ఆశించకుండా, కేంద్రాన్ని ఏమాత్రం ఇబ్బందిపెట్టకుండా జగన్‌ సహకరిస్తున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించినా, విభజన అంశాలు,హామీలు అమలు చేయకపోయినా కేవలం విజ్ఞాపన పత్రంతోనే సరిపెడుతున్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించాలని కేంద్రం ఆదేశిస్తే బీజేపీ రాష్ట్రాల కంటే ముందుగానే ఇక్కడ అమలు చేశారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ కోరినట్లుగా ఒక్క ఓటు కూడా మిస్‌ కాకుండా వైసీపీ ప్రజాప్రతినిధులతో దగ్గరుండి ఓట్లు వేయించారు. దీంతో సహజంగానే వైసీపీ ప్రభుత్వం ఇంతలా సహకరిస్తుంటే ఏపీలో పార్టీని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఏముందనే ధోరణిలో బీజేపీ అధిష్ఠానం యోచిస్తున్నట్లు కనపడుతోంది. రాష్ట్ర బీజేపీ నేతలు కూడా ఈ విషయాన్ని గమనించి వారి ఉనికి కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. మరోపక్క పార్లమెంటు సాక్షిగా వెంకయ్యనాయుడు డిమాండ్‌ చేసిన ప్రత్యేక హోదాకు మోదీ మంగళం పాడడం, విశాఖ రైల్వే జోన్‌ ఇవ్వకపోగా, లాభాల బాటలో నడుస్తున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడం, పోలవరం ప్రాజెక్టుకు సక్రమంగా నిధులు మంజూరు చేయకపోవడం, పదేళ్లలో అమలు చేయాల్సిన రాష్ట్ర విభజన అంశాలను గడువు దగ్గర పడుతున్నా ఏ ఒక్కటీ పూర్తి చేయకపోవడం వంటి కీలక అంశాలపై కమలనాథులు ప్రజలకు సమాధానం చెప్పలేక మొహం చాటేసే పరిస్థితి ఏర్పడిరది.
2024 ఎన్నికల పొత్తులపై అయోమయం
ఇక రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉంటుందనే అంశంపై కమలనాథుల్లో అయోమయం నెలకొంది. జనసేన పార్టీతోనే వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చెపుతున్నప్పటికీ, ఏపీకి ఘోర అన్యాయం చేసి, రాష్ట్రంలో ఒక్క శాతం కూడా ఓటింగ్‌ లేని కమలంతో పొత్తు పెట్టుకునేందుకు జనసేన నేతలు ఆసక్తి కనబర్చడం లేదు. అలాగే పవన్‌ కల్యాణ్‌కు స్వయంగా రూటు మ్యాపు ఇస్తామని చెప్పిన బీజేపీ అధినేతలు… రెండేళ్లు గడుస్తున్నా దానిగురించి పట్టించుకోలేదు. పవన్‌ కల్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని జన సైనికులు డిమాండ్‌ చేసినా బీజేపీ నేతలు స్పందించలేదు. పైగా ఇతర పార్టీలకు చెందిన వారిని సీఎం అభ్యర్థిగా ప్రకటించే అలవాటు బీజేపీకి లేదని తేల్చి చెప్పారు. ఇక టీడీపీతో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం బీజేపీ అధిష్ఠానానికి ఇష్టం లేదు. అధికారంలో ఉన్న వైసీపీ మళ్లీ ఒంటరిగానే పోటీకి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కమలనాథుల పరిస్థితి, ముఖ్యంగా శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి ఆసక్తిగా ఉన్న నేతల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img