Friday, August 19, 2022
Friday, August 19, 2022

కార్చిచ్చుకు కారణమెవరు?

అధికారపార్టీ కుట్రేనంటున్న విపక్షాలు
జనసేన, టీడీపీ వల్లే విధ్వంసం జరిగిందన్న అధికారపక్షం
ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలవల్లేనన్న బాధితులు

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ప్రకృతి అందాలకు, ఆతిథ్యానికి దేశంలోనే పేరెన్నికగన్న కోనసీమ రాజకీయ కుట్రకు వేదికగా మార డం రాష్ట్ర ప్రజలను ఆవేదనకు గురి చేస్తోంది. సున్నిత అం శాలపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంత ప్రమాదం వాటిల్లుతుందో అమలాపురం అల్లర్లే నిదర్శనం. ప్రభుత్వం ఏమాత్రం జాగ్రత్త చర్యలు తీసుకున్నా ఈ సమస్య సునాయాసంగా పరిష్కారమయ్యేది. ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత, భరత జాతి మొత్తం గౌరవించే మహానేత అంబేద్కర్‌ పేరును ఎవరూ వ్యతిరేకించరు. కేవలం ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలు, తామేం చేసినా చెల్లుబాటు అవుతుందనే అధికార అహంభావం, ప్రతిపక్షాలంటే చులకనభావమే కోనసీమ కార్చిచ్చుకు ప్రధాన కారణాలని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆన్‌లైన్‌ మంత్రివర్గ సమావేశంలో అర్థాంతరంగా తీసుకున్న కొత్త జిల్లాల విభజన నిర్ణయంపై ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు అమలాపురం ఘటనే ఉదాహరణ. ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల పాలన ప్రారంభించింది. ఆలోపే జిల్లాల పేర్లు మార్పు, సరిహద్దు సమస్యలు, ఇతర అంశాలపై ప్రభుత్వం ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఆ సందర్భంగా కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ జిల్లాగా నామకరణం చేయాలని ఆ ప్రాంత వాసులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే కోనసీమ జిల్లాగానే ఉంచాలని మరికొందరు విజ్ఞాపనలు అందజేశారు. అలాగే దాదాపు ప్రతి జిల్లాలోనూ భిన్నమైన వాదనలు, వినతులు వచ్చాయి. ఉదాహరణకు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్వగ్రామం నిమ్మకూరు కృష్ణాజిల్లాలో ఉండగా, దానికి ఎన్టీఆర్‌ జిల్లాగా పేరు పెట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేయగా, విజయవాడ పార్లమెంటుకి ఎన్టీఆర్‌ జిల్లాగా నామకరణం చేశారు. అలాగే సీఎం సొంత జిల్లా అయిన కడప పేరును ఏకపక్షంగా తొలగించారు. ఏపీకి తొలి దళిత సీఎం దామోదరం సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలన్న విజ్ఞప్తులూ బుట్టదాఖలు చేశారు. అదేవిధంగా ప్రతి జిల్లాలోనూ ప్రజలకు ప్రత్యక్షంగా ఇబ్బందులు కలగజేసే అంశాలను సైతం ప్రభుత్వం పట్టించుకోకుండా కొత్త జిల్లాల గెజిట్‌ను విడుదల చేశారు. అయినా ప్రజలు బహిరంగంగా ఎక్కడా ఆందోళనలు చేయలేదు. అదే రోజు అమలాపురం కేంద్రంగా అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కూడా ప్రకటించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. ఒకవేళ అక్కడ సమస్య తీవ్రంగా ఉందని భావిస్తే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, స్థానిక ప్రజలతో చర్చలు జరిపి అందర్నీ ఒప్పించే ప్రయత్నం చేసి ఉండాల్సింది. అలాగాకుండా స్థానిక ప్రజలతో గాని, ఇతర రాజకీయపక్ష నేతలతో గాని కనీస సంప్రదింపులు జరపకుండా కొత్త జిల్లాలు ఏర్పాటైన నెలన్నర తర్వాత అకస్మాత్తుగా ఈనెల 18వ తేదీ కోనసీమ జిల్లా పేరు మారుస్తున్నట్లు ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. అంతటితో వదిలేయకుండా నెలరోజుల పాటు దానిపై ప్రజాభిప్రా యాన్ని కోరింది. దీనిలోనే రాజకీయ కుట్ర దాగి ఉందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. జిల్లా పేరు మార్చిన తర్వాత అభిప్రాయాల స్వీకరణ కోరడమంటేనే ఆ అంశాన్ని వివాదం చేయాలని ప్రోత్సహించేందుకేనని వారు ఆరోపిస్తున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ వివాదానికి అధికారపార్టీ ఆజ్యం పోసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈనెల 20వ తేదీ ముఖ్యమంత్రి దావోస్‌ పర్యటనకు బయలుదేరడం, దానికి ముందుగా జిల్లా పేరు మార్పు చేయడం, ఆయన విదేశాల్లో ఉండగానే అల్లర్లు జరగడం, అదే సమయంలో మంత్రి కుటుంబ సభ్యులను అక్కడనుంచి ముందే తరలించడం, చలో కలెక్టరేట్‌కు పిలుపు ఇచ్చినా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయకపోవడం వంటి పరిణామాలే నిదర్శనం గా పేర్కొంటున్నాయి. అల్లర్లలో పాల్గొన్న కీలక వ్యక్తులు అధికారపార్టీకి చెందిన వ్యక్తులున్నట్లు ప్రతిపక్షపార్టీjైున టీడీపీ సోషల్‌ మీడియా వేదికగా దౌర్జన్యకారుల విధ్వం సానికి ఫొటో ఆధారాలను విడుదల చేసింది. మరోపక్క అధికారపార్టీ నేతలు, మంత్రులు కూడా అమలాపురం అల్లర్లకు జనసేన, టీడీపీయే కారణమంటూ విమర్శలు గుప్పించారు. మా మంత్రి, ఎమ్మెల్యేల ఇంటిపై మేమే దాడి చేయించుకుంటామా ? అర్థంలేని ఆరోపణలతో ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని,దానిని బట్టే ఇది రాజకీయ కుట్ర అని అర్థమవుతోందని మంత్రులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలపై బురద చల్లే యత్నాలు మాని, సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img