Saturday, November 26, 2022
Saturday, November 26, 2022

కార్పొరేట్‌ కోత

. మాంద్యం అంటూ సిబ్బంది తగ్గింపు
. గతంలో ఇబ్బడిముబ్బడిగా నియామకాలు
. ట్విట్టర్‌, అమెజాన్‌లదీ ఇదే బాట
. అదే దారిలో మరిన్ని కంపెనీలు?

విశాలాంధ్ర – విజయవాడ: కార్పొరేట్‌ రంగం… ప్రతి ఒక్క ఐటీ నిపుణుడికి అందులో ఉద్యోగం కలలాంటిది. ఊహించని జీతం, అద్భుతమైన సౌకర్యాలు, ఒకటి, రెండేళ్లు కష్టపడితే మేనేజర్‌ స్థాయి చేరుకోవడం వంటివి అందరినీ ఆకర్షిస్తున్నాయి. కరోనా దెబ్బకు అన్ని రంగాలూ కుదేలైన మాట వాస్తవమే. ఇందుకు ఐటీ రంగం మినహాయింపు కాదు. అప్పుడు తెరపైకి వచ్చిందే ‘వర్క్‌ ఫ్రం హోం’. కరోనా అనంతర పరిణామాలతో అన్ని రంగాలు క్రమేణా కోలుకున్నాయి. ఉద్యోగులంతా ఆఫీసులకు వెళ్లి పనులు చేయడం మొదలు పెట్టారు. కానీ ఐటీ రంగంలో ‘వర్క్‌ ఫ్రం హోం’ కొనసాగుతూనే ఉంది. ఇక్కడే మరో అంశం కూడా తెరపైకి వచ్చింది. అదే మూన్‌లైటింగ్‌. దీంతో దాదాపు అన్ని ఐటీ కంపెనీలపై ఈ మూన్‌లైటింగ్‌ ప్రభావం పడిరది. దీంతో కొన్ని కంపెనీలు మూన్‌లైటింగ్‌ చేస్తే చర్యలు తప్పవని బహిరంగంగానే హెచ్చరించాయి.
అయితే అమెరికాను మాంద్యం భయం వెంటాడటంతో ఆయా కంపెనీలు ఉద్యోగులను తగ్గించే ఆలోచనలో పడ్డాయని ఐటీ ప్రముఖులు చెబుతున్నారు. తమ కంపెనీల్లో అనవసరమైన విభాగాల్లో కొన్ని వేలమంది పనిచేస్తున్నట్లు గుర్తించాయనీ, దీంతో ప్రస్తుతం చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నాయని పేర్కొంటున్నారు. ఆయా జాబితాల్లో చిన్న, చిన్న కంపెనీలుంటే అసలు మాట్లాడుకోవాల్సిన పనిలేదు. కానీ అమెజాన్‌, ట్విట్టర్‌, వంటి బడా కంపెనీలు ఉండటమే ప్రస్తుతం అందరినీ కలవరానికి గురిచేస్తోంది. ఇదిలా ఉంటే… మాంద్యం పరిస్థితులు ఏమీ లేవనీ, మూన్‌లైటింగ్‌ వద్దన్నా చేస్తున్న ఉద్యోగులపై వేటు వేయడానికి ఇదొక సాకు అని కొంతమంది ఉద్యోగులు వాదిస్తున్నారు.
అమెజాన్‌లో 10వేలమంది తొలగింపు?
అమెరికా ఇ-కామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌ సైతం ఉద్యోగులను తగ్గించుకునేందుకు సిద్ధమైంది. సంస్థలో ఇకపై కొన్నిరకాల ఉద్యోగాలు అవసరం లేదని నిర్ణయించినట్లు హార్డ్‌వేర్‌ చీఫ్‌ డేవ్‌ లింప్‌ సిబ్బందికి రాసిన లేఖలో పేర్కొన్నట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇది కఠినమైన నిర్ణయమైనప్పటికీ తప్పడం లేదని లింప్‌ పేర్కొన్నారు. దీనివల్ల ప్రభావితమయ్యే ఉద్యోగులకు కొత్త పని వెతుక్కోవడానికి కావాల్సిన సహకారం కూడా అందిస్తామని తెలిపారు. అయితే, ఎంతమందిని తొలగించనున్నది మాత్రం ఇంకా అధికారికంగా తెలియరాలేదు. దాదాపు 10,000 మంది ఉద్వాసనకు గురయ్యే అవకాశం ఉందంటూ ఇటీవల మీడియాలో కథనాలు వెలువడ్డ విషయం తెలిసిందే. ‘‘చాలా లోతైన సమీక్షల తర్వాత కొన్ని విభాగాలు, ప్రాజెక్టులను స్థిరీకరించాలని నిర్ణయించాం. దీని పర్యవసానంగా కొన్ని రకాల ఉద్యోగాలు సంస్థకు ఎప్పటికీ అవసరం లేదని తేల్చాం. ఈ వార్త చెప్పడానికి చాలా బాధగా ఉంది. ఈ నిర్ణయం వల్ల ప్రతిభ కలిగిన కొంతమంది ఉద్యోగుల్ని కోల్పోవాల్సి వస్తోంది’’ అని లింప్‌ తన లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగం కోల్పోయిన వారికి కావాల్సిన సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఉద్యోగుల తొలగింపు అంశాన్ని అమెజాన్‌ అధికార ప్రతినిధి కెల్లీ నాన్‌టెల్‌ సైతం ధ్రువీకరించారు. ప్రధానంగా డివైజెస్‌, రిటైల్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌ విభాగాల్లో ఉద్యోగాల కోతలు అధికంగా ఉండే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ సీఎన్‌బీఎసీ తెలిపింది. ఇప్పటికే మేనేజర్లు ఆయా ఉద్యోగులకు ఈ విషయాన్ని తెలియజేసినట్లు సమాచారం. రెండు నెలల్లోగా ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. కొత్త నియామకాలు చేపట్టడాన్ని కూడా నిలిపేసినట్లు ఇటీవలే అమెజాన్‌లో ఓ ఉన్నతాధికారి వెల్లడిరచిన విషయం తెలిసిందే.
ట్విట్టర్‌లో కూడా….
వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగులను తొలగించిన ట్విటర్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీని లాభదాయకంగా మార్చేందుకు ఉద్యోగులు కష్టపడి పనిచేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వారి నుంచి లిఖితపూర్వక హామీ కోరినట్లు బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొంది. ట్విటర్‌లో మార్పులు చేసేందుకు మస్క్‌ సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఖర్చుల్ని తగ్గించుకోవడానికి ఇప్పటికే చాలా మంది ఉద్యోగుల్ని తొలగించారు. మరోవైపు సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెప్పిన ఆయన.. కష్టపడి పనిచేస్తేనే కంపెనీ మనుగడ కొనసాగుతుందని స్పష్టం చేశారు. లేదంటే దివాలా కూడా తప్పకపోవచ్చునని ఇటీవల హెచ్చరించారు. ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి ఉద్యోగులు కష్టపడి పనిచేయాలని.. రోజుకు 12 గంటలు సంస్థ కోసం వెచ్చించాలని కోరారు. దీనికి సంబంధించి వారి నుంచి హామీని కోరుతూ తాజాగా ఉద్యోగులకు ఇ-మెయిల్‌ ద్వారా ఓ ఫారం పంపినట్లు తెలుస్తోంది. అందులో కష్టపడి పనిచేస్తారా లేదా కంపెనీని వీడతారా అని అల్టిమేటం జారీ చేసినట్లు బ్లూమ్‌బెర్గ్‌ వెల్లడిరచింది. అందులో ‘యెస్‌’ అనే బటన్‌పై నొక్కడం తప్ప ఉద్యోగులకు మరో ఆప్షన్‌ ఇవ్వలేదని సమాచారం. దీనికి సమ్మతించనివారు మూడు నెలల నోటీసు పీరియడ్‌తో సంస్థను వీడాలని మస్క్‌ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఫారాన్ని పూర్తి చేసి సమర్పించడానికి అమెరికా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చారట! ఈ విషయంపై ఇప్పటి వరకు ట్విటర్‌ అధికారిక వర్గాలు స్పందించలేదు. ఇలా మస్క్‌ హామీ కోరడంపై చాలా మంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఒప్పందాన్ని అంగీకరించడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయోనని వాపోతున్నారు. చాలా మంది సాయం కోసం న్యాయనిపుణులను ఆశ్రయిస్తున్నారు. అయితే, మస్క్‌ ఇలా హామీ కోరడాన్ని కొన్ని స్వచ్ఛంద సంస్థలు తప్పుబడుతున్నాయి. దీనివల్ల ఉద్యోగులు భవిష్యత్తులో మరిన్ని ప్రయోజనాలను కోల్పోవాల్సి రావొచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. దివ్యాంగులకు వసతి, అనారోగ్యంపై సెలవు వంటి కనీస సదుపాయాల ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని వాపోతున్నాయి. భవిష్యత్‌లో మరిన్ని కంపెనీలు ఈ బాటలోనే పయనించే అవకాశం ఉందని ఐటీ ప్రముఖులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img