Friday, December 8, 2023
Friday, December 8, 2023

కార్మిక అస్త్రం ఏఐటీయూసీ

. రాష్ట్రంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవాలు
. కార్మికవర్గాన్ని సంఘటితం చేయడమే ధ్యేయం: ఓబులేసు
. మోదీ విధానాలపై సమైక్యపోరు: రవీంద్రనాథ్‌

విశాలాంధ్ర బ్యూరో - అమరావతి: ఏఐటీయూసీ ఆవిర్భావ వేడుకలు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఏఐటీయూసీ, దాని అనుబంధ సంఘాల నేతృత్వంలో వాడవాడలా యూనియన్‌ పతాకాలను ఎగురవేసి కార్మిక నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో కార్మికులు భారీ ప్రదర్శనలు నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నినాదాలు చేస్తూ పాలకుల తీరు మారకుంటే కార్మిక సత్తా చాటుతామని హెచ్చరించారు. రాజమహేంద్రవరం సీపీఐ కార్యాలయంలో కామ్రేడ్‌ చిట్టూరి ప్రభాకర్‌ చౌదరి ఫౌండేషన్‌ అధ్వర్యంలో ’ఏఐటీయూసీ చరిత్రపోరాట ఘట్టాలు’ అనే అంశంపై వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఫౌండేషన్‌ అధ్యక్షులు తాటిపాక మధు అధ్యక్షతన జరిగిన కామ్రేడ్‌ చిట్టూరి ప్రభాకర్‌ చౌదరి ఫౌండేషన్‌ అధ్వర్యంలో ’ఏఐటీయూసీ చరిత్ర `పోరాట ఘట్టాలు’ అనే అంశంపై వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఫౌండేషన్‌ అధ్యక్షులు తాటిపాక మధు అధ్యక్షతన జరిగిన సదస్సులో ముఖ్యఅతిథిగా హాజరైన ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై సంఘటిత, అసంఘటిత కార్మికులను ఐక్యం చేసి పోరాటాలు చేయడమే లక్ష్యంగా ఏఐటీయూసీ పనిచేస్తోందన్నారు. ఏఐటీయూసీ ఆవిర్భావం, అనంతరం కార్మిక హక్కుల కోసం, వాటి రక్షణ కోసం శతాబ్దకాలంలో చేసిన అనేక చరిత్రాత్మక, వీరోచిత పోరాటాలను ఓబులేసు వివరించారు. భారతదేశ చరిత్రలో సంపూర్ణ స్వాతంత్య్ర నినాదం ఇచ్చిన ఘనత ఏఐటీయూసీకే దక్కుతుందన్నారు. ఏఐటీయూసీ చరిత్ర లేకుండా భారతదేశ కార్మికవర్గం లేదని స్పష్టం చేశారు. బ్రిటీష్‌ ముష్కరులు ఏఐటీయూసీని అణగతొక్కడానికి అనేక కుట్ర కేసులు పెట్టి వేలాది మంది నేతలను జైల్లో నిర్బంధించారని ఓబులేసు గుర్తు చేశారు. ఏఐటీయూసీ పోరాటాల ఫలితంగా కార్మికుల సంక్షేమానికి, పని భద్రతకు అనేక చట్టాలు వచ్చాయని వివరించారు. ఏఐటీయూసీ ఒక సమరశీల చోదక శక్తిగా పనిచేస్తున్నదని, భవిష్యత్తులోనూ కార్మికుల సమస్యలపై నిరంతర పోరు కొనసాగిస్తుందన్నారు. సీపీఐ పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, జట్ల సంఘం అధ్యక్షులు కొండ్రపు రాంబాబు, ఏఐటీయూసీ వర్కింగ్‌ కమిటీ మెంబర్‌ దుర్గారావు, సీపీఐ నగర కార్యదర్శి వి.కొండలరావు తదితరులు పాల్గొన్నారు.
మోదీ నిరంకుశ విధానాలను తిప్పికొట్టండి: రవీంద్రనాథ్‌
కార్మిక హక్కులను కాలరాస్తున్న మోదీ నిరంకుశ విధానాలను ఐక్యంగా తిప్పికొట్టాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్‌ పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ 104వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులోని ముఠా కార్మిక సంఘం కార్యాలయంలో, బేవరేజెస్‌ వద్ద, ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ పతాకాలను ఎగురవేశారు. రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూ, కార్మిక హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. పోరాడి సాధించుకున్న పని గంటల హక్కు, కనీస వేతనాల చట్టం, సమ్మె హక్కు, 44 కార్మిక చట్టాల స్థానంలో 4 కార్మిక కోడ్‌లను ప్రవేశ పెట్టారని ధ్వజమెత్తారు. వీటన్నింటిని తిరిగి సాధించుకునేందుకు ప్రతి కార్మికుడు ఉద్యమంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు, జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్‌డీ సర్దార్‌, జిల్లా ఉపాధ్యక్షులు పీవీఆర్‌ చౌదరి, శుభాన్‌ నాయుడు, ముఠా కార్మిక సంఘం నాయకులు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
విజయవాడలో
కార్మిక హక్కులను సాధించిన ఘనత ఏఐటీయూసీదేనని డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ ఎస్‌.వెంకటసుబ్బయ్య అన్నారు. ఏఐటీయూసీ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా విజయవాడ దాసరి నాగభూషణరావు భవన్‌ వద్ద యూనియన్‌ పతాకాన్ని సీనియర్‌ ముఠా నాయకుడు బి.చినశ్రీరాములు ఆవిష్కరించారు. వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ 1920 అక్టోబర్‌ 31వ తేదీన ముంబై నగరంలో ఆవిర్భవించిన ఏఐటీయూసీ 104 సంవత్సరాల కాలంలో నిర్వహించిన పోరాటాలను, సాధించిన ఫలితాలను వివరించారు. ఏఐటీయూసీ నగర అధ్యక్షులు కేఆర్‌ ఆంజనేయులు, నగర గౌరవ అధ్యక్షులు నాగేశ్వరరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం నగర సహాయ కార్యదర్శి చల్లా వెంకటరమణ, ఆర్టీసీ పోర్టర్స్‌ యూనియన్‌ నాయకులు వేముల రాంబాబు, సోమరాజు, రిక్షా సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. గొల్లపూడి ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయం వద్ద, ఏపీఎస్పీసీఎల్‌ గోడౌన్స్‌ ముందు యూనియన్‌ పతాకాలు ఆవిష్కరించారు.
గుంటూరులో
గుంటూరు సీపీఐ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడా హనుమంతరావు ఏఐటీయూసీ పతాకాన్ని ఎగురవేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌, ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వెలుగూరి రాధాకృష్ణమూర్తి, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఆకిటి అరుణ్‌కుమార్‌, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి బందెల రవికుమార్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి నాసర్‌ జీ, ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య, నగర కార్యదర్శి చల్లా మరియదాసు, ఏఐఎస్‌ఎఫ్‌ నగర కార్యదర్శి శశి, ఆటో వర్కర్‌ యూనియన్‌ నగర కార్యదర్శి మంగా శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్‌ జిల్లాలో : ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇబ్రహీంపట్నం కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ కోటేశ్వరరావు కేక్‌కట్‌ చేశారు. మైలవరం నియోజకవర్గ ఏఐటీయూసీ కార్యదర్శి ఘనపవరపు రాము యూనియన్‌ పతాకాన్ని ఎగురవేశారు. సీపీఐ ఎన్టీఆర్‌ జిల్లా సహాయ కార్యదర్శి బుడ్డి రమేశ్‌, వర్కింగ్‌ ఉమెన్స్‌ సంఘ నాయకురాలు సీహెచ్‌ దుర్గా కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img