Friday, March 24, 2023
Friday, March 24, 2023

కాల్పుల్లో ఒడిశా ఆరోగ్య మంత్రి మృతి

భువనేశ్వర్‌: ఒడిశా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నబా కిషోర్‌ దాస్‌ బుల్లెట్‌ గాయాలతో ఆదివారం మరణించారు. అంతకుముందు రోజు, దాస్‌ తన కారు నుంచి దిగినప్పుడు ఆయనపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనకు సంబంధించి ఒక పోలీసు అధికారి పట్టుబడ్డాడు. జనవరి 29న ఆయన ఛాతీకి ఎడమ వైపున తుపాకీతో కాల్చిన గాయాలతో అపోలోలో చేరారు. డాక్టర్‌ దేబాశిష్‌ నాయక్‌ నేతృత్వంలోని వైద్యుల బృందం వెంటనే ఆయనకు శస్త్రచికిత్స చేసినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. ఆపరేషన్‌లో, ఒకే బుల్లెట్‌ శరీరంలోకి ప్రవేశించి, బయటకు వెళ్లిందని, గుండె, ఎడమ ఊపిరితిత్తులకు గాయమై అంతర్గత రక్తస్రావం ఎక్కువగా ఉందని వారు కనుగొన్నారు. ఆయన గుండె పంపింగ్‌ను మెరుగుపరచడానికి చర్యలు తీసుకున్నట్లు వారు తెలిపారు. అయితే, అత్యవసర ఐసీయూ సంరక్షణ, ఉత్తమ ప్రయత్నాలు చేసినప్పటికీ, దాస్‌ను బతికించలేకపోయామని, ఆయన గాయాలతో మరణించాడని ఆసుపత్రి విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బ్రజరాజ్‌నగర్‌ పట్టణంలో మంత్రి ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ‘అసిస్టెంట్‌ సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏఎస్సై) గోపాల్‌ దాస్‌ మంత్రిపై కాల్పులు జరిపాడు. మంత్రికి బుల్లెట్‌ గాయాలు తగిలాయి. మంత్రిని వెంటనే ఆసుపత్రికి తరలించారు’ అని బ్రజ్‌రాజ్‌నగర్‌ ఎస్‌డీపీవో గుప్తేశ్వర్‌ భోయ్‌ విలేకరులతో అన్నారు. నిందితుడు ఏఎస్సైని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారని తెలిపారు. ఏఎస్సై కాల్పులు జరప డానికి ప్రేరేపించిన కారణాలను తెలుసుకోవడానికి విచారణను ప్రారంభించినట్లు భోయ్‌ చెప్పారు. పీటీఐ ఆధీనంలో ఉన్న ఒక వీడియో ఫుటేజీలో, గాయపడిన మంత్రిని పైకి లేపి కారు ముందు సీటుపై ఉంచడానికి వ్యక్తులు ప్రయత్నిస్తుండగా, దాస్‌ ఛాతీ నుంచి రక్తస్రావం కనిపించింది. తొలుత ఆయనను జార్సుగూడ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌డీపీవో తెలిపారు. అనంతరం ‘మెరుగైన చికిత్స’ కోసం భువనేశ్వర్‌ ఆసుపత్రికి విమానంలో తరలించడానికి ఏర్పాట్లు చేసిన వివరిం చారు. ఈ సంఘటన నేపథ్యంలో పట్టణంలో ఉద్రిక్తత నెల కొంది. దాస్‌ మద్దతుదారులు ‘భద్రతా లోపాలను’ ప్రశ్నిస్తున్నారు. తమను లక్ష్యంగా చేసేందుకు కొందరు కుట్ర పన్నారని కొంత మంది తెలిపారు. కాగా ప్రస్తుతం ఏఎస్సైని విచారిస్తున్నామని, సమగ్ర విచారణ తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని భోయ్‌ చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంత్రిపై కాల్పుల ఘటన ఒడిశాలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img