Tuesday, August 16, 2022
Tuesday, August 16, 2022

కాషాయ నేతల విద్వేష వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా మిన్నంటిన నిరసనలు

నుపుర్‌శర్మ, నవీన్‌కుమార్‌ జిందాల్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌
పోలీసుల భారీ భద్రత

న్యూదిల్లీ: మహ్మద్‌ ప్రవక్తపై బహిష్కృత బీజేపీ నేతలు నుపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం దేశవ్యాప్తంగా అనేక చోట్ల భారీ ప్రదర్శనలు నిర్వహించారు. శుక్రవారం మసీదుల్లో ప్రార్ధనల అనంతరం కాషాయ నేతల విద్వేష వ్యాఖ్యలపై ఆందోళన చేపట్టారు. దిల్లీ, ఉత్తరప్రదేశ్‌, కోల్‌కతా, హైదరాబాద్‌, జమ్ముకశ్మీరు, కర్ణాటకల్లో నిరసనలు మిన్నంటాయి. రెచ్చగొట్టే ప్రకటనలు చేసిన నుపుర్‌ శర్మను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ దిల్లీ జామా మసీదు వెలుపల నిరసనకు దిగారు. విద్వేష వ్యాఖ్యలు చేసిన నుపుర్‌ శర్మపై బీజేపీ వేటు వేసిన అనంతరం ఆమె తన వ్యాఖ్యలపై క్షమాపణ కోరినా నిరసనకారులు ఆమె అరెస్ట్‌కు డిమాండ్‌ చేశారు. నుపుర్‌ శర్మ దిష్టిబొమ్మలను దహనం చేశారు. నమాజ్‌ సందర్భంగా కోల్‌కతాలో 300 మందికి పైగా నిరసనకారులు నుపుర్‌ శర్మను అరెస్ట్‌ చేయాలని నినదించారు. జామా మసీదు వద్ద నిరసనలకు తాము పిలుపు ఇవ్వలేదని జామా మసీద్‌ షాహీ ఇమాం తెలిపారు. మరోవైపు యూపీలోని అనేక నగరాల్లో కాషాయ నేతల విద్వేష వ్యాఖ్యలకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. జామా మసీదు బయట జరిగిన నిరసనలో వందలాదిమంది ముస్లింలు పాల్గొన్నారు. శర్మకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆందోళన చేసిన కొద్ది సేపటి తర్వాత నిరసనకారులు వెళ్లిపోయారని, ఇతరులు ఆందోళన కొనసాగించారని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. దాదాపు అర్ధగంటపాటు ఆందోళన ప్రశాంతంగా కొనసాగిందన్నారు. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ, వివాదాస్పద పూజారి యతి నర్సింగానంద్‌ సహా 31 మందిపై దిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ముస్లింల మనోభావాలు దెబ్బతీసినందుకుగాను నుపుర్‌శర్మపైనా కేసు నమోదైంది.
ఉత్తరప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో ముస్లింలు నిరసన ప్రదర్శనలు చేశారు. సహరాన్‌పూర్‌, మొరదాబాద్‌, రాంపూర్‌, లక్నోలలో ఆందోళనకారులు పెద్దఎత్తున నినాదాలు చేశారని లక్నోలో సీనియర్‌ పోలీసు అధికారు చెప్పారు. నమాజ్‌ అనంతరం ప్రయాగ్‌రాజ్‌లోని అటల ప్రాంతంలో ఆందోళనకారులు నినాదాలు చేయడమే కాకుండా రాళ్లదాడి చేసినట్లు వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణలోభాగంగా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. సీనియర్‌ పోలీసు, పౌర అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో రాళ్లదాడికి సంబంధించిన అంశాన్ని పరిశీలిస్తున్నామని ఏడీజీ పరశంత్‌ కుమార్‌ చెప్పారు. శుక్రవారం ప్రార్థనలు ప్రశాంతంగా జరిగాయని చెప్పారు. శ్రీనగర్‌లోనూ నిరసనలు వెల్లువెత్తాయి. ముస్లిం వ్యతిరేక చర్యలు ఈ ప్రభుత్వానికి నిత్యకృత్యమైందని హురియత్‌ కాన్ఫరెన్స్‌ నిందించింది. నగరంలోని లాల్‌చౌక్‌, బటమలూ, తెంగ్‌పొరా, ఇతర ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. మహిళలు సైతం ప్లకార్డులు ప్రదర్శించారు. నిరసనల సమయంలో అవాంఛనీయ ఘటనలు ఏమీ జరగలేదని పోలీసులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా శ్రీనగర్‌లో మొబైల్‌ ఫోన్లు, ఇంటర్‌నెట్‌ సదుపాయాన్ని నిలిపివేశారు. కర్ణాటకలోని బెలగావి ఫోర్టురోడ్డులో నుపుర్‌శర్మ దిష్టిబొమ్మను కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు విద్యుత్‌ వైర్లకు వేలాడదీశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిని పోలీసులు, మున్సిపల్‌ అధికారులు వెంటనే తొలగించారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మహ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌ను అరెస్టు చేయాలని హైదరాబాద్‌లోని ముస్లింలు డిమాండ్‌ చేశారు. మక్కామసీదులో ప్రార్థనలు ముగిసిన అనంతరం ముస్లింలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. మక్కామసీదు నుంచి మొఘల్‌ పురా ఫైర్‌ స్టేషన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. నుపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌ను అరెస్టు చేయాలని నినదించారు. చార్మినార్‌, మక్కామసీదు, కాలపత్తార్‌, మెహిదీపట్నం, చాంద్రాయణగుట్ట, షాహీన్‌నగర్‌, సైదాబాద్‌తో పాటు అనేక ప్రాంతాల్లో ముస్లింలు నిరసనలు వ్యక్తం చేశారు. ముస్లింల నిరసనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పాతబస్తీలో పోలీసులు భారీగా మోహరించారు. చార్మినార్‌ వద్ద పోలీసు ఉన్నతాధికారులు బందోబస్తును పర్యవేక్షించారు. మహారాష్ట్రలోనూ అనేక ప్రాంతాల్లో నిరసనలు మిన్నుముట్టాయి. మహ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలను అరెస్టు చేయాలని నినదించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img