Friday, September 22, 2023
Friday, September 22, 2023

కిసాన్‌ సన్సద్‌.. ప్రజాస్వామిక పోరుకు ప్రతిబింబం

భద్రతా వలయాలు.. బారికేడ్లు రైతుల్ని ఆపలేవు

న్యూదిల్లీ : తమ జీవనోపాధికి విఘాతం కలిగించే కొత్త సాగు చట్టాల వ్యతిరేకోద్యమాన్ని రైతులు మరింత తీవ్రతరం చేశారు. ఇందుకోసం వాస్తవ పార్లమెంటును అనుకరించాలని నిర్ణయించారు. దేశ రాజధాని నడిబొడ్డున జంతర్‌మంతర్‌ వద్ద 200 మందితో కిసాన్‌ సన్సద్‌ను నిర్వహించి కొత్త సాగు చట్టాలపై అటు ప్రభుత్వం తరపున తమ తరపున చర్చలు జరిపి వినూత్న రీతిలో ప్రజాస్వామిక అనుకరణకు తెరతీశారు. ఓ వైపు కార్ల హోరు.. మరోవైపు నీలం, ఖాకీ, పచ్చ యూనిఫారాల్లో చుట్టుముట్టిన భద్రతా సిబ్బంది. మధ్యమధ్యలో వచ్చే బస్సులు ఏవీ కూడా అన్నదాతలను ఆపలేవు. వారు తమ హక్కుల సాధన కోసం పట్టుదలతో ఉన్నారు. కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్నారు. పార్లమెంటును రైతులు కూడా నిర్వహించగలరని చెప్పడమే కాదు చేసిచూపారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలతో పాటు జంతర్‌ మంతర్‌ వద్ద కిసాన్‌ సన్సద్‌ కార్యకలాపాలు మొదలయ్యాయి. రైతుల చట్టాలపై రెండు సభలు దద్దరిల్లాయి. వాస్తవ పార్లమెంటులో వాయిదాల పర్వం కొనసాగగా కిసాన్‌ సన్సద్‌లో సభికుల ప్రశ్నలకు సంతృప్తికర సమాధానాలు ఇవ్వలేక నియమిత వ్యవసాయ మంత్రి రాజీనామా చేశారు. సింఘు, టిక్రీ సరిహద్దుల నుంచి నిత్యం 200 మంది రైతులు సన్సద్‌లో పాల్గొంటున్నారు. కిసాన్‌ సన్సద్‌ ఆగస్ట్టు 9 వరకు జరగనుంది. రైతుల పోరాటం, కిసాన్‌ సన్సద్‌ నిర్వహణ చరిత్రాత్మకమంటే అతిశయోక్తి కాదు.14.5కోట్ల మంది బాణిని వినిపించడమే కాకుండా తమ భావితరాల కోసం ఎనిమిది నెలలుగా సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌ సరిహద్దుల్లో ఆందోళనలను రైతులు నిర్వహిస్తున్నారు. తమ న్యాయమైన పోరాటానికిగాను అన్ని వర్గాల నుంచి సంఫీుభావం, మద్దతు పొందగలిగారు. కిసాన్‌ సన్సద్‌ ప్రారంభమైన రోజున పలువురు ప్రతిపక్ష పార్టీల ఎంపీలు సందర్శించి సంఫీుభావాన్ని ప్రకటించారు. ఆ సమయంలో జంతర్‌మంతర్‌ యుద్ధక్షేత్రాన్ని తలపించింది. ఆహారం, మెడికల్‌ వ్యాన్లు, దిల్లీ పోలీసు బస్సులు, సీఆర్పీఎఫ్‌ వాహనాలు, ఇతర పోలీసు సిబ్బంది మోహరించి ఉన్నారు. ప్రజా సమస్యలపై చర్చించే పార్లమెంటు ఎలా ఉంటుందో చూపే ప్రయత్నమే తమదని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ప్రకటించింది. ఎనిమిది నెలలుగా సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్నాగానీ రైతాంగ వెతలను పాలకులు పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తంచేసింది. ఇది రైతుల ఉద్యమం అని దీనికి రాజకీయ రంగు పులుముకోనివ్వమని తేల్చిచెప్పింది. రాజకీయ నేతలు వచ్చి సంఫీుభావం తెలిపి వెళ్లారేగానీ ఎవ్వరూ మా వేదికపై నుంచి సందేశాలు, ప్రసంగాలు ఇవ్వలేదని 40 రైతు సంఘాల ఛత్రసంస్థ వెల్లడిరచింది. కిసాన్‌ సన్సద్‌ ఆరంభం రోజున మూడు కొత్త సాగు చట్టాలతో పాటు, ఎంఎస్‌పీకి చట్టంపై చర్చ జరిగింది. నల్ల చట్టాలను రద్దు చేయాలని, ఎంఎస్‌పీ చట్టం చేయాలని సభ తీర్మానించింది. రెండవ రోజు మండీ వ్యవస్థపై చర్చించింది. ఈ క్రమంలో రైతులు నియమించిన వ్యవసాయ మంత్రి సంతృప్తికర సమాధానాలు ఇవ్వలేక రాజీనామా సమర్పించారు. రెండవ రోజు సభ వాడీవేడిగా సాగింది. అటు ప్రభుత్వ వర్గం ఇటు రైతుల వర్గం మధ్య చర్చలు జరిగాయి. అచ్చం పార్లమెంటు తరహాలోనే కిసాన్‌ సన్సద్‌ కార్యకలాపాలు సాగాయి. కిసాన్‌ సన్సద్‌ ద్వారా తమ గళాన్ని మరింత బిగ్గరగా వినిపించే ప్రయత్నం చేసినట్లు రైతులు వెల్లడిరచారు. హక్కుల సాధన కోసం దీర్ఘకాల పోరుకు సిద్ధమని, కేంద్రం దిగివచ్చే వరకు వెనక్కుతగ్గమని, ఎవరికీ భయపడమని తేల్చిచెప్పారు. సన్సద్‌ ద్వారా ప్రజాస్వామిక అతిపెద్ద ప్రదర్శనకు రైతులు తెరతీశారు. అసలు తమ పోరాటం ఎందుకో కూడా తెలియకుండా ఆందోళన చేస్తున్నారన్న విమర్శలకు కిసాన్‌ సన్సద్‌ ద్వారా దీటైన బదులిచ్చారు. దేశద్రోహులుగా ముద్రవేస్తుంటే.. అసలు దేశభక్తి అంటే ఏమిటో దిల్లీ సాక్షిగా చాటారు. రైతుల ఉనికిని వారి విజ్ఞతను తెలియజెప్పారు. తమ హక్కుల సాధన కోసం, భావితరాల భవిష్యత్‌ కోసం, సేద్యాన్ని కార్పొరేట్ల కబంధహస్తాల నుంచి కాపాడుకోవడం కోసం ఎన్ని బారికేడ్లనైనా.. భద్రతా వలయాలనైనా ఛేదిస్తామని తమ ఈ పోరాటం ద్వారా రైతులు స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img