Friday, March 31, 2023
Friday, March 31, 2023

కుట్రపూరిత అరెస్టులు

. అడ్డుకోవడంలో రాజకీయాలు విఫలం
. విచారణ పేరుతో చట్ట ఉల్లంఘనలు
. మోదీ సర్కార్‌కి పావుగా దర్యాప్తు సంస్థలు

న్యూదిల్లీ : దేశంలో అరెస్టులు, బెదిరింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. వీటిని అడ్డుకోవడంలో రాజకీయ పార్టీలు విఫలమవుతూనే ఉన్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ పేరుతో చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి. పోలీసులు ఒక వ్యక్తిని కస్టడీకి కోరడం చాలా హాస్యాస్పదంగా మారింది. దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ పోలీసులు అడ్డగోలుగా అరెస్టులు చేసి, తరచుగా ఛార్జిషీట్‌ సమర్పణకు గడువును పొడిగిస్తూ తీవ్ర ఆలస్యం చేసే వ్యూహాన్ని కొనసాగిస్తారు. కేంద్రంలోని మోదీ సర్కారు రెండవసారి అధికారం చేపట్టిన తర్వాత నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థలను పూర్తిగా తన పావులుగా వాడుకుంటూ విపక్ష నేతలను, హక్కుల కార్యకర్తలను అరెస్టులు చేయిస్తూ ప్రజాస్వామ్య హననానికి ఒడిగడుతోంది. దిల్లీ మద్యం విధానం కేసులో దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా అరెస్టు తప్పు. అయితే దీన్ని అర్థం చేసుకోవడానికి, ఆ విషయం చెప్పడానికి ఒకరు న్యాయవాది లేదా న్యాయ నిపుణుడు కానవసరం లేదు. సిసోడియా అడ్డంకులు సృష్టించకుండా విచారణకు సహకరిస్తున్నాడు. ఆయనను వీలైనన్ని సార్లు విచారించవచ్చన్నది సాధారణం కారణం. కేంద్ర దర్యాప్తు సంస్థ చేస్తున్నటువంటి దర్యాప్తు కోసం ఒక వ్యక్తిని అరెస్టు చేయనవసరం లేదు. ఇది అతనిపై మోపబడిన అభియోగాల మెరిట్‌లపై ఎటువంటి అభిప్రాయాన్ని ఇవ్వడానికి కాదు. ప్రశ్నించడం కోసం లేదా వారి నుంచి వాంగ్మూలం పొందడం కోసం ఒక వ్యక్తిని అరెస్టు చేయకూడదనే ఈ సూత్రం భారతదేశంలో పోలీసులచే సాధారణంగా ఉల్లంఘించబడుతోంది. సీనియర్‌ న్యాయవాది షారుఖ్‌ ఆలం మాట్లాడుతూ ఈ విలక్షణమైన అరెస్టుల ప్రక్రియను ఇతర దేశాల్లోని ప్రక్రియలతో పోల్చారు. మరింత నాగరిక పోలీసింగ్‌ అవసరమని అన్నారు. అరెస్టు వెనుక ఉన్న ఆలోచన అవమానపరచడం, భయపెట్టడం లేదా శిక్షించడమేనా? విచారణే లక్ష్యంగా చేసుకున్న వ్యక్తికి శిక్ష కాకూడదని గుర్తుంచుకోవాలి. కానీ ఇది తరచుగా ఉంటుందని అన్నారు. ఈ కేసులో సిసోడియాపై నేరారోపణలు చేసే సాక్ష్యాలను సేకరించామని, ఆయన నుంచి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని సీబీఐ పేర్కొంది. కానీ ఇతర సందర్భాల్లో సాక్ష్యాలను సేకరించే ప్రక్రియ కూడా అరెస్టుతో ప్రారంభమవుతుంది. దీనిపై తగినంత చర్చ జరగలేదు. రాజకీయ పార్టీలు ఎప్పుడూ దాని గురించి మాట్లాడలేదు. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరాన్ని విచారణ నిమిత్తం అరెస్టు చేసినపుడు కూడా వారు ఆ పని చేయలేదు. హైకోర్టు కూడా ఆయనకు బెయిల్‌ నిరాకరిస్తూనే ఉంది. అంతిమంగా సుప్రీం కోర్టు ఆయనను కాపాడిరది. షర్జీల్‌ ఇమామ్‌ లాంటి వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు లేదా సిద్ధిక్‌ కప్పన్‌ను కటకటాల వెనక్కి నెట్టినప్పుడు రాజకీయ వర్గం నుంచి ఒక మాట ఆశించడం కూడా వ్యర్థం. పోలీసులు ఒక వ్యక్తిని కస్టడీకి కోరడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే దాని దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఛార్జిషీట్‌ను సమర్పించడానికి సమయం అడిగే, కాలపరిమితిని పొడిగించే స్వేచ్ఛను పోలీసులు తరచుగా తీసుకుంటారు. ఆ తర్వాత సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లను సమర్పిస్తామని విజ్ఞప్తి చేస్తారు. అందువలన ఈ ఆలస్యం వ్యూహం ఎప్పటికీ కొనసాగుతుంది. విచారణ ప్రారంభమయ్యే వరకు జైలు జీవితం గడిపే వ్యక్తులు ఉన్నారు. ఎల్గార్‌ పరిషత్‌ పేరుతో జైలుకెళ్లిన వారి ఇటీవలి కేసులు, దిల్లీ అల్లర్ల ‘కుట్ర కేసులు’ అదే కోవకు చెందినవి. సిసోడియా అరెస్టుపై కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొందరు నేతలు సంబరాలు చేసుకోవడం, అరవింద్‌ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేసింది. ఇలా చేయడం ద్వారా ఆ పార్టీ తప్పుడు పద్ధతిని సమర్థిస్తోంది. బీజేపీ ఈ అరెస్టుల సంస్కృతిని, దీర్ఘకాల నిర్బంధాన్ని ఉపయోగిస్తోందన్నది సుస్పష్టం. చిదంబరం అరెస్టు, రాహుల్‌ గాంధీ లేదా సోనియా గాంధీని సుదీర్ఘంగా విచారణ చేయడం, షార్జీల్‌ ఇమామ్‌ను సుదీర్ఘంగా నిర్బంధించడం వంటివి ఒక వర్గానికి సంతోషం కలిగించాయి. కానీ అదే కేంద్రంలోని అధికార పార్టీకి అలవాటుగా మారడానికి మనీశ్‌ సిసోడియా, ఆయన ఆప్‌ సహచరులు తమను తాము నిందించుకోవలసి ఉంటుంది. ‘ఇండియా ఎగైనెస్ట్‌ కరప్షన్‌’ ఉద్యమం జరుగుతున్న నాటి వారి పాత ట్వీట్లు బయటపడ్డాయి. వాటిలో లాలూ యాదవ్‌, ములాయం సింగ్‌ యాదవ్‌ను అరెస్ట్‌ చేయాలని కోరారు. సిసోడియా స్వయంగా వారిని ఎగతాళి చేస్తూ, తాము ఏ తప్పూ చేయకుంటే అరెస్టులకు ఎందుకు భయపడతారని ప్రశ్నించారు. దాని సందేశాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మరింత క్రమపద్ధతిలో ఉపయోగించుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం మనీశ్‌ సిసోడియాకు ఏది జరుగుతున్నప్పటికీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) పునరాలోచన చేయదన్నది కూడా స్పష్టం. ఎందుకంటే అదే ఆలోచన, పాలక విధానాలు దాని స్వంత రాజకీయాలను ఏర్పరుస్తాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img