ప్రాజెక్టులకు భారీగా నీటి ప్రవాహం
నిండుకుండలా పులిచింతల
ప్రకాశం బ్యారేజీ వద్ద గంటగంటకూ పెరుగుతున్న వరద ఉధృతి
60 గేట్లు ఎత్తి లక్ష పైగా క్యూసెక్కుల నీరు విడుదల
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి :
కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాం తాల్లో కురుస్తున్న వర్షాలతో నదీ ప్రాజెక్టులకు నీటి ప్రవాహం గంటగంటకూ పెరుగుతోంది. ఆలమట్టి ప్రాజెక్టు దాదాపు 70శాతం నిండడంతో ఎగువ నుంచి పెరుగుతున్న వరద ఉధృతిని దృష్టిలో పెట్టుకుని 2లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోవడంతో ఎగువ నుంచి వచ్చే నీటిని మొత్తం దిగువకు వదులుతున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు క్రమేపీ వరద ఉధృతి పెరుగుతోంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 1,22,836 క్యూ సెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 35,315 క్యూసెక్కు లుగా ఉంది. దీని పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 847.90 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటినిల్వ 215.8070 టీఎంసీలకుగాను ప్రస్తుతం 75.4720 టీఎంసీలుగా కొనసాగుతోంది. మరోవైపు ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని యదేచ్ఛగా కొనసాగిస్తోంది. దీంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 20వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రస్తుతం సాగర్ ప్రాజెక్టులో 312 టీఎంసీల సామర్థ్యానికిగాను 179.89 టీఎంసీల నీటి నిల్వలు న్నాయి. ఇక సాగర్ దిగువున కురుస్తున్న వర్షాల కారణంగా పులిచింతల ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి 62వేల క్యూసెక్కులకు పైగా వరద వస్తుండగా, ప్రస్తుతం మూడు గేట్లు ఎత్తి 52,393 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతు న్నారు. మరోవైపు విద్యుదుత్పత్తి కోసం 10వేల క్యూసెక్కుల నీటిని మళ్లించారు. పులిచింతల జలాశయం పూర్తిసామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 44.03 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇక దీని దిగువన ఉన్న మునేరు, కట్టలేరుతోపాటు చిన్నపాటి వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో ప్రకాశం బ్యారేజీకి గంట గంటకూ వరద ఉధృతి పెరుగుతోంది. వత్సవాయి మండలం లింగాల వద్ద వంతెన నీటమునిగింది. పెనుగంచిప్రోలు వద్ద వంతెనను ఆనుకొని వరద నీరు ప్రవహిస్తోంది. పోలంపల్లి ఆనకట్ట వద్ద 12.5 అడుగుల నీటిమట్టం నమోదైంది. ప్రకాశం బ్యారేజీ వద్దకు దాదాపు లక్షా 10వేల క్యూ సెక్కుల నీరు చేరుతోంది. దీంతో బ్యారేజీకున్న మొత్తం 70 గేట్లు ఎత్తి 1,11,811 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రస్తుతం 10 గేట్లు 3 అడుగుల మేర, మరో 60 గేట్లు 2 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదలుతున్నారు. కృష్ణానది లోకి పెరుగుతున్న వరద ఉధృతిని దృష్టిలో పెట్టుకుని పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలను, ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు గ్రామాలను ఖాళీ చేయించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.