Friday, October 7, 2022
Friday, October 7, 2022

కృష్ణ్ణకు మళ్లీ వరద

శ్రీశైలం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు గేట్లన్నీ ఎత్తివేత
తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: కృష్ణమ్మ మరోమారు ఉగ్రరూపం దాల్చింది. నారాయణపూర్‌ డ్యామ్‌ దిగువన కృష్ణా ప్రధాన పాయ, తుంగభద్ర పరీవాహక ప్రాంతాలో విస్తారంగా కురిసిన వర్షాలతో శ్రీశైలం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు అన్ని ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో తీర ప్రాంత ప్రజలతో పాటు లోతట్టు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి దాదాపు 4లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా, ఆ నీటి మొత్తాన్ని10 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. నెల రోజుల వ్యవధిలోనే ఈ స్థాయి భారీ వరద రావడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 15,833, హంద్రీ-నీవా ద్వారా 914, కల్వకుర్తి ద్వారా 1,167 క్యూసెక్కులు తరలిస్తున్నారు. పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,75,680 క్యూసెక్కులను, కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 62,112 క్యూసెక్కులు, మిగిలిన వరద నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.2 అడుగుల్లో 210.99 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అయితే మంగళవారం సాయంత్రానికి కొంత వరద తగ్గుముఖం పట్టినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో సాగర్‌ ప్రాజెక్టు నుంచి 3,66,414 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ కాలువలు, ఏఎమ్మార్పీ, వరద కాలువలకు 20,589 క్యూసెక్కులు వదులుతున్నారు. సాగర్‌ స్పిల్‌ వే 26 గేట్లు, ప్రధాన విద్యుత్‌కేంద్రం ద్వారా ఎగువ నుంచి వచ్చే నీటిని మొత్తం దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 588.6 అడుగుల్లో 307.87 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్‌ నుంచి భారీగా నీరు విడుదల చేయడంతో దిగువున లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సాగర్‌ నుంచి విడుదల చేస్తున్న ప్రవాహం పులిచింతల ప్రాజెక్టులోకి చేరుతుండగా, ఈ మొత్తం నీటిని పులిచింతల గేట్లు అన్నీ ఎత్తి దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం పులిచింతలలో 169.19 అడుగుల్లో 37.23 టీఎంసీలు నిల్వ ఉండగా, ఎగువ నీటి ప్రవాహనికనుగుణంగా నీటి విడుదలకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రకాశం బ్యారేజీకి 2,31,063 క్యూసెక్కుల వరద వస్తుండగా, కృష్ణా డెల్టాకు 14,962 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగిలిన వరద నీటిని ప్రాజెక్టు 70 గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. కృష్ణా బేసిన్‌లో మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రాబోయే రెండు రోజులు వరద పెరిగే ప్రమాదముందని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img