Friday, June 9, 2023
Friday, June 9, 2023

కేంద్రానిదే బాధ్యత

. పార్లమెంటు ప్రతిష్ఠంభనపై విపక్షాలు
. అదానీ కుంభకోణం పక్కదారి పట్టించడానికి కుట్ర
. జేపీసీ వేసేంత వరకు వదలం
. మోదీ సర్కారుపై ప్రతిపక్షాల మూకుమ్మడి దాడి

న్యూదిల్లీ: పార్లమెంటు ప్రతిష్ఠంభనకు మోదీ సర్కారే కారణమని విపక్షాలు సోమవారం విమర్శించారు. అదానీ వ్యవహారంపై పార్లమెంటు సంయుక్త కమిటీ(జేపీసీ) విచారణ చేయాలన్న డిమాండ్‌ నుంచి పక్కదారి పట్టించేందుకు కేంద్రం రాహుల్‌ అంశాన్ని తీసుకొస్తున్నదని మండిపడ్డాయి. పార్లమెంటు హౌస్‌ కాంప్లెక్స్‌లోని ప్రతిపక్ష నేత మల్లికార్జునఖడ్గే నివాసంలో ప్రతిపక్ష పార్టీల నాయ కులు సమావేశమయ్యారు.
అదానీ కుంభకోణంపై జేపీసీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌పై అనురించాల్సిన వ్యూహంపై చర్చించారు. సమావేశంలో కాంగ్రెస్‌, డీఎంకే, ఆర్‌జేడీ, సీపీఐ, సీపీఎం, ఎన్‌సీపీ, జేడీయూ, ఆప్‌, శివసేన నాయకులు హాజర య్యారు. ఉభయసభలు మొదటిసారి వాయిదా పడిన తర్వాత విపక్ష నేతలు పార్లమెంటు బయట మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాలు లేకుండా బీజేపీలో ఏమి జరిగే పరిస్థితి లేదని రాజ్యసభలో కాంగ్రెస్‌ ఉపనాయకుడు ప్రమోద్‌ తివారీ విమర్శించారు. పార్లమెంటు ప్రతిష్ఠంభనకు మోదీయే కారణమని ఆరోపించారు. జేపీసీ కోసం తాము ఎన్నిసార్లు డిమాండ్‌ చేసినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ‘జేపీసీ అంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది. బీజేపీ ఎందుకు పారిపోతోంది. జేపీసీ నుంచి దృష్టి మళ్లించడానికి అనేక మార్గాలను అన్వేషిస్తోంది. పార్లమెంటు సజావుగా జరగకుండా అడ్డుకుంటోంది’ అని తివారీ విమర్శించారు. ‘జేపీసీ ఏర్పాటు చేసేంత వరకూ వెనక్కి తగ్గరాదని మేము కూడా ప్రతినబూనాం. మా ఆందోళన కొనసాగిస్తాం. ఇది నాయకుల కోసం కాదు…ప్రజల కోసం’ అని తివారీ స్పష్టంచేశారు. ‘మీరు పోలీసు రాజ్యం నడపాలని భావిస్తే అది నియంతృత్వానికి నిజమైన సంకేతంగా నిలుస్తుంది. ఇప్పటికే మోదీ హయాంలో నియంతృత్వం రాజ్యమేలుతోంది. వాస్తవంగా మోదీ ఇంకా పూర్తిస్థాయిలో బయటపడలేదు’ అని తివారీ విమర్శించారు. రాహుల్‌గాంధీ ఇంటిని ఆదివారం పోలీసులు అక్రమంగా చుట్టుముట్టారని తివారీ ఆరోపించారు. ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం ద్వారా అనేకమంది ప్రతిపక్ష నేతలను వేధిస్తున్నారని మండిపడ్డారు.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ ప్రధానితో లింకైన అదానీ మహా మెగా కుంభకోణంపై జేపీసీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపక్షాల చట్టబద్ధ డిమాండ్‌ను మోదీ సర్కారు నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తోంది. అంతటితో ఆగకుండా పార్లమెంటు ఉభయసభలను వాయిదా వేస్తోంది’ అని ఆరోపించారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రామ్‌గోపాల్‌ యాదవ్‌ మాట్లాడుతూ జేపీసీతో దర్యాప్తు చేస్తే నిజమైన నిందితులు బయటపడతారని చెప్పారు. బీజేపీ వైఖరి బహిర్గతమవుతుందని తెలిపారు. ప్రజలకు సంబంధించిన ఇంతటి తీవ్రమైన సమస్యపై ప్రభుత్వం నుంచి కనీసం ఒక్క ప్రకటన కూడా రాకపోవడం మొదటిసారి చూస్తున్నామని వ్యాఖ్యానించారు. బ్యాంకుల్లో ఉన్న ప్రజల సొమ్మును మోదీ సర్కారు తన అనుయాయులకు దోచిపెడుతోందని ఆరోపించారు. ఇప్పటికీ ప్రభుత్వం మౌనంగా ఉండటంలో అర్థమేమిటని ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్‌ నాయకుడు కె.కేశవరావు మాట్లాడుతూ అదానీ కుంభకోణంపై విచారణ చేయాలని బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన మొదటిసారోజు నుంచి తాము డిమాండ్‌ చేస్తున్నామని చెప్పారు. సుప్రీంకోర్టు విచారణతో తాము సంతృప్తిగా లేమని, చాలా కంపెనీలు అదానీ చేతిలో ఉన్నాయని తెలిపారు. జేపీసీ విచారణ కావాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ఇది రాజకీయ కుంభకోణమని, ఇది సాధారణ కుంభకోణం కాదని వ్యాఖ్యానించారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపైనా, ప్రజల సొమ్ముపైనా బలంగా ప్రభావం చూపుతుందని కేశవరావు అన్నారు. డీఎంకే నేత ఎ.రాజా మాట్లాడుతూ ప్రధాని మోదీ సభకు వచ్చి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీపీఎం నేత ఎలమరం కరీం మాట్లాడుతూ అదానీ కుంభకోణంపై పార్లమెంటులో చర్చించడానికి మోదీ, హోంమంత్రి అమిత్‌షా భయపడుతున్నారని చెప్పారు. అందుకే తమ డిమాండ్‌ను అంగీకరించడం లేదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img