ఘోర విపత్తుకీ కానరాని స్పందన
. రెండు వారాలవుతున్నా పాలకులు మీనమేషాలు
. ఆపన్నహస్తం కోసం బాధితుల ఎదురుచూపు
. ప్రాథమిక నష్టం అంచనా రూ.6,880 కోట్లు
. బుడమేరు, కృష్ణా వరదల తర్వాత ఉత్తరాంధ్ర, ఏలేరు విలయం
. వరుస నష్టాలు, కష్టాలతో ప్రజలు అతలాకుతలం
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: వందేళ్ల చరిత్రలో ఎన్నడూలేని ఘోర విపత్తు సంభవించినా కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి ఆర్థిక సహాయం ప్రకటించకపోగా… కనీస స్పందన కనబర్చకపోవడంపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి విపత్తు సమయాల్లో తక్షణ సహాయం ప్రకటించే అవకాశం ఉన్నప్పటికీ… ప్రాథమిక నష్టం అంచనా నివేదిక పంపిన తర్వాత కూడా కేంద్ర పాలకులు మీనమేషాలు లెక్కిస్తుండడం పట్ల తీవ్ర విమర్శలు వెల్తువెత్తుతున్నాయి. విపత్తు సంభవించి రెండు వారాలవుతున్నా ఇంతవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం అందకపోవడంతో బాధితులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. శతాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా ఈనెల 1,2 తేదీల్లో కృష్ణా నదికి, బుడమేరుకు వచ్చిన భారీ వరద రాష్ట్ర రాజధాని విజయవాడ ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. గత నెల 31వ తేదీ ఆకాశానికి చిల్లుపడిరదన్నట్లుగా కేవలం 24 గంటల వ్యవధిలో దాదాపు 40 సెంటీమీటర్ల కుంభవర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు ఏకమయ్యాయి. బుడమేరు ఊహించనిస్థాయిలో పొంగి ప్రవహించింది. సుమారు 40 వేల క్యూసెక్కుల వరద విజయవాడ నగరంపై అకస్మాత్తుగా వచ్చి పడిరది. మరోపక్క ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు, తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో కృష్ణానదికి భారీ వరద వచ్చి చేరింది. వందేళ్ల రికార్డును తిరగరాస్తూ 11 లక్షల 43 వేల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీ నుంచి విడుదలయ్యే పరిస్థితి నెలకొంది. ఈ బ్యారేజీ సామర్థ్యం 11 లక్షల 85 వేల క్యూసెక్కులు కావడం గమనార్హం. బుడమేరు ఉగ్రరూపానికి విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో దాదాపు 32 డివిజన్లు పూర్తిగా నీట మునిగాయి. 46 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క ఎన్టీఆర్ జిల్లా పరిధిలోనే 2.82 లక్షల కుటుంబాలకు చెందిన ఏడు లక్షల మంది ప్రజలు వరద ప్రభావానికి గురయ్యారు. ఆరు అడుగుల నుంచి 10 అడుగుల మేర ఇళ్లు నీటమునగడంతో కట్టుబట్టలతో బాధితులు నిరాశ్రయులయ్యారు. దాదాపు వారం రోజులు పూర్తిస్థాయిలో ప్రజలు వరదల్లోనే దుర్భర జీవితం గడిపారు. రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్లు, బోట్లు, డ్రోన్ల ద్వారా ఆహారం అందించాల్సిన పరిస్థితి ఏర్పడిరది. మరోపక్క 5 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు పూర్తిగా నీటమునిగి నాశనమయ్యాయి. 111 చోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. భారీ వర్షాల కారణంగా 3,869 కిలోమీటర్ల ఆర్‌అండ్‌బీ రోడ్లు ధ్వంసమయ్యాయి. 353 కిలోమీటర్ల పంచాయతీ రోడ్లు డెబ్బతిన్నాయి. దాదాపు 80 ప్రాంతాల్లో రోడ్లకు గండ్లు పడ్డాయి. ఒక్క విజయవాడ నగరంలో 560 కిలోమీటర్ల రోడ్లు నాశనమయ్యాయి. రెండు వందల కిలోమీటర్ల తాగునీటి పైపులైన్లు దెబ్బతిన్నాయి. ఇక ఇళ్లల్లో అయితే అంచనాలకందనంత నష్టం వాటిల్లింది. అకస్మాత్తు వరదతో కట్టుబట్టలతో జనం బయటపడ్డారు. దీంతో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నీట మునిగాయి. టీవీలు, ఫ్రిజ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ వరదపాలయ్యాయి. కార్లు, ద్విచక్ర వాహనాలు పది రోజులపాటు బురదనీటిలో ఉండడంతో పూర్తిగా దెబ్బతిన్నాయి. చివరకు మంచాలు, కుర్చీలు, పరుపులు, పుస్తకాలు, బీరువాలు, గ్యాస్ స్టౌవ్‌లు, ఇతర వంట సామగ్రి అన్నీ వరదకు కొట్టుకుపోయాయి. వందల సంఖ్యలో పశువులు, కోళ్లు, మేకలు, గొర్రెలు చనిపోయాయి. రాష్ట్ర్ర ప్రభుత్వం రూ.6,880 కోట్లు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేసి కేంద్ర ఫ్రభుత్వానికి నివేదిక పంపింది. వరదల వల్ల అత్యధికంగా ఆర్‌అండ్‌బీ శాఖకు రూ.2,164 కోట్లు నష్టం వాటిల్లగా, జలవనరుల శాఖకు రూ.1,568 కోట్లు, పురపాలకశాఖకు రూ.1,160 కోట్లు, రెవెన్యూశాఖకు రూ.750 కోట్లు, విద్యుత్‌శాఖకు రూ.480 కోట్లు, వ్యవసాయ, ఉద్యానవన శాఖలకు రూ.340 కోట్లు… ఇలా శాఖల వారీగా జరిగిన నష్టాలపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపింది. కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, కేంద్ర బృందాలు కూడా ఇప్పటికే వరద ప్రాంతాలను పరిశీలించి వెళ్లాయి. కానీ ఇంతవరకు కేంద్రం నష్టపరిహారం కింద పైసా కూడా విదల్చలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం క్షేత్రస్థాయిలో అధికారులను ఇంటింటికీ పంపి వారికి జరిగిన నష్టాలను అంచనా వేస్తుంది. మరోపక్క ముంపునకు గురై పాడైన ఎలక్ట్రానిక్ వస్తువులకు, మోటారు వాహనాలకు ప్రభుత్వమే మరమ్మతులు చేయించడమా, లేక నష్టపరిహారం అందించాలా ? ఇస్తే ఎంత ఇవ్వగలమనే దానిపై కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని బట్టి బాధితులకు నష్టపరిహారం ప్రకటించాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది.
ఉత్తరాంధ్ర, ఏలేరు విలయం మరో దెబ్బ
కృష్ణా వరద, బుడమేరు ముంపు నుంచి కోలుకోకముందే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురిచిన భారీ వర్షాలు ఉత్తరాంధ్రను అతలాకుతలం చేశాయి. అనేక గ్రామాలు నీట మునిగాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో రహదారులకు గండ్లు పడి దెబ్బతిన్నాయి.
ఏలేరు ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఒక్క కాకినాడ జిల్లాలోనే 62 వేల ఎకరాల పంటలు నీట మునిగాయి. పెట్టిన పెట్టుబడి అంతా వరదార్పణం కావడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎకరా మాగాణికి రూ.10 వేలు నష్టపరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మిగిలిన పంటలకు కూడా ఎంత ఇవ్వాలనే దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే జాతీయ విపత్తుగా ప్రకటించి… ఉదారంగా ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.