Monday, June 5, 2023
Monday, June 5, 2023

కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన సీబీఐ

కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన సీబీఐ

న్యూదిల్లీ : బీజేపీ ఆదేశానుసారం దర్యాప్తు సంస్థ వ్యవహరిస్తోందని కేజ్రీవాల్‌ ఆరోపణలు, ఆమ్‌ ఆద్మీ పార్టీ నిరసనల నడుమ… మద్యం పాలసీ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను సీబీఐ ఆదివారం ప్రశ్నించింది. ఉదయం 11 గంటలకు కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రధాన కార్యాలయానికి చేరుకోవడానికి ముందు కేజ్రీవాల్‌ ట్విట్టర్‌లో ఐదు నిమిషాల వీడియో సందేశంలో, తనను అరెస్టు చేయమని బీజేపీ ఆదేశించి ఉండవచ్చు అని పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థ నోటీసులు జారీ చేసిన తర్వాత అనేక మంది ప్రతిపక్ష నాయకుల నుంచి సంఫీుభావ సందేశాలను అందుకున్న ఆప్‌ జాతీయ కన్వీనర్‌… తాను దాచడానికి ఏమీ లేనందున మద్యం పాలసీ కేసులో సీబీఐ అడిగే ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం ఇస్తానని తేల్చిచెప్పారు. ‘ఈరోజు సీబీఐకి సమన్లు అందాయి. అన్నింటికీ నిజాయితీగా సమాధానాలు ఇస్తాను. ఈ వ్యక్తులు చాలా శక్తివంతులు. ఎవరినైనా జైలుకు పంపవచ్చు, ఆ వ్యక్తి ఏదైనా నేరం చేసినా, చేయకపోయినా పర్వాలేదు’ అని కేజ్రీవాల్‌ ఆదివారం అన్నారు. ‘నిన్నటి నుంచి వారి నాయకులందరూ కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తారని గట్టిగా అరుస్తున్నారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేయాలని బీజేపీ సీబీఐకి కూడా సూచించిందని నేను భావిస్తున్నాను. జేపీ ఆదేశించినట్లయితే, సీబీఐ ఎవరు? సీబీఐ నన్ను అరెస్టు చేస్తోంది’ అని పేర్కొన్నారు. అయితే అవినీతి నుంచి దృష్టి మరల్చేందుకు కేజ్రీవాల్‌ నాటకాలాడుతున్నారని ఆరోపించిన బీజేపీ… ఆయనను లై డిటెక్టర్‌ పరీక్ష చేయించుకునే ధైర్యం ఉందా అని ప్రశ్నించింది. ఇది వాక్చాతుర్యానికి సమయం కాదని, జవాబుదారీతనమని పేర్కొంది. కేజ్రీవాల్‌ ఆదివారం ఉదయం రాజ్‌ ఘాట్‌లోని మహాత్మా గాంధీ స్మారకాన్ని సందర్శించారు. ఆయన సహచర పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌, కొంతమంది మంత్రివర్గ సహచరులతో కలిసి సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న తర్వాత, కేజ్రీవాల్‌ను కేసు దర్యాప్తు చేస్తున్న అవినీతి నిరోధక శాఖ మొదటి అంతస్తు కార్యాలయానికి తీసుకెళ్లారు. వీఐపీలు సీబీఐ కార్యాలయానికి వచ్చినప్పుడల్లా సాధారణంగానే దర్యాప్తు సంస్థ ఉన్నత అధికారులు ఆదివారం కార్యాలయంలోనే ఉండిపోయారు. పగటిపూట, కేజ్రీవాల్‌కు భోజన విరామం ఇచ్చారు. ఆయన సీబీఐ కార్యాలయం వెలుపలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. రాత్రి వరకు విచారణ కొనసాగింది. కేజ్రీవాల్‌ను ప్రశ్నించడం జరుగుతుండగా, మన్‌, సౌరభ్‌ భరద్వాజ్‌, అతిషి, కైలాష్‌ గహ్లోత్‌, సందీప్‌ పాఠక్‌, రాఘవ్‌ చద్దా, సంజయ్‌ సింగ్‌తో సహా ఆప్‌ అగ్ర నేతలు సీబీఐ ప్రధాన కార్యాలయం దగ్గర గుమిగూడి ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీబీఐ ఆయనకు నోటీసులు జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆర్చ్‌బిషప్‌ రోడ్‌లో ధర్నా చేపట్టిన అనేక మంది ఆప్‌ సీనియర్‌ నేతలను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వారిలో రాజ్యసభ ఎంపీలు సంజయ్‌ సింగ్‌, రాఘవ్‌ చద్దా, దిల్లీ మంత్రులు సౌరభ్‌ భరద్వాజ్‌, అతిషి, కైలాష్‌ గహ్లోత్‌, ఆప్‌ అధికార ప్రతినిధి ఆదిల్‌ అహ్మద్‌ ఖాన్‌, ఆప్‌ ప్రధాన కార్యదర్శి పంకజ్‌ గుప్తా, పంజాబ్‌ ప్రభుత్వంలోని కొందరు మంత్రులు ఉన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్నందుకు పోలీసులు మమ్మల్ని అరెస్టు చేసి, ఎక్కడో తెలియని ప్రాంతానికి తీసుకెళ్తున్నారు… ఇది ఎలాంటి నియంతృత్వం? అని చద్దా ట్వీట్‌ చేశారు. ‘బీజేపీ దీర్ఘకాలిక కేజ్రీవాల్‌-ఫోబియాతో బాధపడుతోంది’ అని ఆయన ఆరోపించారు. ధర్నాలో పాల్గొన్న భగవంత్‌ మాన్‌ కూడా ఆప్‌ నేతల అరెస్టుకు ముందే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదిలాఉండగా, ‘దిల్లీ అంతటా నిరసనలు తెలిపినందుకు దాదాపు 1,500 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు లేదా అరెస్టు చేశారు. నగరంలో 32 మంది దిల్లీ ఎమ్మెల్యేలు, 70 మంది కౌన్సిలర్లను అరెస్టు చేశారు. 20 మంది పంజాబ్‌ ఆప్‌ ఎమ్మెల్యేలను దిల్లీ సరిహద్దులో అరెస్టు చేశారు’ అని ఆప్‌ దిల్లీ కన్వీనర్‌ గోపాల్‌ రాయ్‌ విలేకరుల సమావేశంలో తెలిపారు. పంజాబ్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు సహా అనేక మంది ఆప్‌ నేతలు తమను దిల్లీలోకి రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. పంజాబ్‌లోని అధికార పార్టీ మంత్రులు బ్రామ్‌ శంకర్‌ జింపా, బల్బీర్‌ సింగ్‌, హర్జోత్‌ సింగ్‌ బెయిన్స్‌, ఎమ్మెల్యేలు దినేష్‌ చద్దా, కుల్జిత్‌ రంధావాను సింఘూ సరిహద్దులో నిలిపివేసి, దిల్లీలోకి ప్రవేశించడానికి అనుమతించలేదని పేర్కొన్నారు. ‘మేము మా రాజధానిలోకి కూడా ప్రవేశించలేమా? దిల్లీ పోలీసులు నా కారును దిల్లీలోకి అనుమతించడం లేదు’ అని పంజాబ్‌ విద్యాశాఖ మంత్రి హర్జోత్‌ బెయిన్స్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా ఈ కేసులో ఆప్‌ నాయకుడు మనీశ్‌ సిసోడియాను ఫిబ్రవరి 26న అరెస్టు చేశారు. ఈ కేసులో దాదాపు ఎనిమిది గంటలపాటు విచారించిన అధికారులు ఆయన సమాధానాలు సంతృప్తికరంగా లేవని చెప్పారు. సిసోడియాను కూడా అరెస్టు చేసినపుడు విచారణలో వెల్లడయిన విషయాలపై వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి దర్యాప్తు బృందం ముందు సాక్షిగా హాజరు కావాలని కోరుతూ సీబీఐ శుక్రవారం కేజ్రీవాల్‌కు సమన్లు పంపిందని ఆ వర్గాలు తెలిపాయి. సీబీఐ మద్యం పాలసీ విధాన రూపకల్పన ప్రక్రియ గురించి ముఖ్యమంత్రిని అడగవచ్చని, ముఖ్యంగా మంత్రి మండలి ముందు ఉంచాలని భావించిన ‘జాడ లేని’ ఫైల్‌ గురించి వారు చెప్పారు. నిపుణుల కమిటీ అభిప్రాయాలు, దానిపై ప్రజా, న్యాయపరమైన అభిప్రాయాలతో కూడిన ఫైల్‌ కౌన్సిల్‌ ముందు ఉంచలేదని, జాడ తెలియకుండానే ఉందని తెలిపారు. ఇతర నిందితుల వాంగ్మూలాలపై కూడా దర్యాప్తు సంస్థ కేజ్రీవాల్‌ను ప్రశ్నించవచ్చని, అదనంగా, ఎక్సైజ్‌ పాలసీని రూపొందించడంలో ఏజెన్సీ కేజ్రీవాల్‌ పాత్రను, వ్యాపారులు, దక్షిణాది లాబీ సభ్యులచే చూపబడుతున్న ఆరోపణ ప్రభావం గురించి, పాలసీ ఆమోదానికి ముందు దాని రూపకల్పనలో మీ ప్రమేయం ఉందా అని కూడా కేజ్రీవాల్‌ను అడగవచ్చని సీబీఐ వర్గాలు తెలిపాయి. మద్యం వ్యాపారులకు లైసెన్సులు మంజూరు చేసేందుకు దిల్లీ ప్రభుత్వం 2021-22కి ఎక్సైజ్‌ పాలసీని రూపొందించిందని, దాని కోసం లంచాలు ఇచ్చినట్లు ఆరోపించిన కొంతమంది డీలర్‌లకు అనుకూలంగా ఉందని ఆరోపణలు వచ్చాయి. అయితే దీనిని ఆప్‌ గట్టిగా ఖండిరచింది. ఆ తర్వాత ఈ విధానాన్ని రద్దు చేశారు. కాగా, అవినీతి పేరుతో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యకర్త అన్నా హజారేను ఉపయోగించుకుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్‌ రిజిజు ఆరోపించారు.
కట్టుదిట్ట భద్రత మధ్య విచారణ
కేజ్రీవాల్‌ను ప్రశ్నించనున్న నేపథ్యంలో దిల్లీ పోలీసులు నాలుగు రింగుల బారికేడిరగ్‌లతో సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. కార్యాలయం వెలుపల సాయుధ బలగాలతో సహా వెయ్యికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. నలుగురి కంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడకుండా ఉండేలా సీఆర్‌పీసీ సెక్షన్‌ 144 కూడా విధించినట్లు వారు తెలిపారు. రోస్‌ అవెన్యూలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కార్యాలయం వెలుపల కూడా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు.
పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు ఆప్‌ కార్యాలయం, సీబీఐ ప్రధాన కార్యాలయానికి దారితీసే వీధుల్లో బారికేడ్లు ఉంచినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రాంతంలోని కార్యాలయాలు మూసి ఉన్నందున ఆదివారం హాజరు కావాలని కేజ్రీవాల్‌ను కోరినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. సిసోడియాను ఏజెన్సీ ప్రధాన కార్యాలయంలో పిలిచినప్పుడు కూడా అదే వ్యూహాన్ని అనుసరించింది.
ఆప్‌ అత్యవసర సమావేశం
మద్యం పాలసీ కేసులో సీబీఐ… ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను పిలిపించినందుకు నిరసనగా అనేక మంది అగ్ర నేతల అరెస్టు తరువాత పార్టీ తదుపరి కార్యాచరణను నిర్ణయించడానికి ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఆదివారం తన ఆఫీస్‌ బేరర్ల ‘అత్యవసర సమావేశం’ నిర్వహించింది. ఆప్‌ దిల్లీ యూనిట్‌ కన్వీనర్‌ గోపాల్‌ రాయ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మేయర్‌ షెల్లీ ఒబెరాయ్‌, డిప్యూటీ మేయర్‌ ఆలే మొహమ్మద్‌ ఇక్బాల్‌, పార్టీ జాతీయ కార్యదర్శి పంకజ్‌ గుప్తా, నేత జాస్మిన్‌ షా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img