. నియంత్రణలో మోదీ సర్కారు విఫలం
. దిగుమతిపైనే ఆధారం
న్యూదిల్లీ: భారతదేశంలో పప్పు ధాన్యాల వినియోగం ఎక్కువే. అధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశం కూడా మనదే. పప్పుధాన్యాలు, వంట నూనెలను భారత్ భారీగా దిగుమతి చేసుకుంటుంది. ఉత్పత్తి తక్కువగా ఉండటంతో 2021-22 పంటకాలంలో పప్పుల దిగుమతులు 9.44 శాతం పెరిగి 27 లక్షల టన్నులకు చేరాయి. 2020-21లో 24.66 లక్షల టన్నుల పప్పుధాన్యాలను భారత్ దిగుమతి చేసుకుంది. పెసలు, మినుములు, ఎర్ర కందులకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో వాటి ధరలు 30 శాతం పెరిగాయి. దేశంలో అధికంగా వినియోగించే కందిపప్పు ధర కిలో రూ.185 పలుకుతోంది. కిలో పెసరపప్పు రూ.249, మినప్పప్పు రూ.115, ఎర్ర కందిపప్పు రూ.160 ఉంది. ఇంత జరుగుతున్నా మోదీ ప్రభుత్వం చోద్యం చూస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో పప్పు ధాన్యాల వినియోగం అధికంగా ఉన్నప్పటికీ ఇతర పంటలతో పోలిస్తే పప్పు ధాన్యపు పంటల ఉత్పత్తి పెరగడం లేదు. అందువల్ల పప్పుధాన్యాలు, వంట నూనెలను అంతర్జాతీయ మార్కెట్ల నుండి పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తోంది. సరైన విధానపర చర్యలు చేపడితే వీటిని దేశీయంగానే సులభంగా ఉత్పత్తి చేడానికి వీలవుతుంది. ఈ ఏడాది మార్చి 23 నాటికి భారత్ 8.75 లక్షల టన్నుల బఠాణీలను, 5.12 లక్షల టన్నుల మినుములను దిగుమతి చేసుకుంది. 2022-23లో కందుల ఉత్పత్తి 9.8 శాతం, మినుముల ఉత్పత్తి 12 శాతం తగ్గిపోయింది. బీహార్లో కందుల ధర 89 శాతం పెరిగింది. ఈ నెలలో క్వింటాలు ధర రూ.14,500 చేరింది. గతేడాది ఇదే నెలలో దీని ధర రూ.7,681 మాత్రమే. లాభదాయక సోయాబీన్, పత్తి పంటల వైపు రైతులు మొగ్గు చూపడంతో పప్పు ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోతోతంది. పప్పు పంటల విస్తీర్ణం ఆరు శాతం తగ్గడం, సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో కోతలకు ముందు భారీ వర్షాలు కురవడం వల్ల ఉత్పత్తి తగ్గింది. అనేక రాష్ట్రాలలో బలమైన ఈదురు గాలులు వీచడం వల్ల గోదుమలు, పప్పుధాన్యాల పంటలు దెబ్బతిన్నాయి. పప్పు ధాన్యాల లభ్యత సంతృప్తికర స్థాయిలో ఉండేలా చూసేందుకు, దేశీయ మార్కెట్లో ధరలను నియంత్రించేందుకు మోదీప్రభుత్వం మినుములు, కందుల స్వేచ్ఛా దిగుమతి విధానాన్ని 2024 మార్చి 31 వరకూ పొడిగించింది. అయితే పప్పుధాన్యాలను కేంద్రం దిగుమతి చేసుకుంటున్నంత వరకూ తమకు లాభాలు రాబోవని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని పప్పుధాన్యాలకు సంబంధించి రైతుకు కనీస మద్దతు ధర కంటే తక్కువే లభిస్తోంది. వినియోగదారులకు పప్పులు తక్కువ ధరకే లభించాలంటే గోదుమలు, బియ్యం మాదిరిగా వాటిని కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని వ్యాపారులు సూచిస్తున్నారు. పప్పుల మార్కెట్ ధరల కంటే కనీస మద్దతు ధర తక్కువగానే ఉంటోంది. దీంతో రైతులు పప్పుపంటల వైపు మొగ్గ చూపడం లేదు. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థపైనా ప్రతికూల ప్రభావం పడుతోంది. దిగుమతి బిల్లులు పెరుగుతున్నాయి. వాణిజ్య సమతూకం దెబ్బతింటోంది. కనీస మద్దతు ధరల్లో తేడాల కారణంగా బియ్యం, గోదుమలకు ప్రత్యామ్నాయ పంటలు వేయడం రైతులకు సవాలుగా మారింది. అంతేకాకుండా బియ్యం, గోదుమలు రాజకీయ పార్టీలకు పెద్ద ‘ఓటు బ్యాంకు’గా మారాయి. వీటిని కాదని వేరే పంటల వైపు మరలితే రైతుల నుంచి ప్రతిఘటన తప్పదని పార్టీలు భయపడుతున్నాయి.
మరోవైపు, ఎన్నికల సంవత్సరంలో పప్పుల ధరలు పెరుగుతుండటంతో ప్రభుత్వాలు కలవర పడుతున్నాయి. కందులు, మినుముల నిల్వల వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడిరచాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం నిల్వదారులు, మిల్లర్లు, ఫుడ్ ప్రాసెసర్లు, వ్యాపారులపై ఒత్తిడి తెస్తోంది. పప్పు ధరల పర్యవేక్షణకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులను ఆదేశించింది. కానీ ధాన్యపు పంటలకు బదులుగా పప్పు ధాన్యాల పంటల వైపు రైతులను మళ్లిస్తే పరిస్థితిలో మార్పు వస్తుంది. దీనితో పాటు పప్పు పంటల రైతులకు సులభంగా రుణాలు అందించడం, బీమా సౌకర్యం కల్పించడం, ఆకర్షణీయమైన కనీస మద్దతు ధర ఇవ్వడం వంటి చర్యల ద్వారా ఉత్పత్తిని పెంచే అవకాశం ఉన్నదని రైతు సంఘాల నేతలు ప్రభుత్వాలకు సూచిస్తున్నారు. పేదధనిక, శాఖాహారం
మాంసాహారం అనే తేడా లేకుండా అందరూ పప్పుధాన్యాలు వినియోగిస్తారు. భారత్లో ఏటా రెండు కోట్ల టన్నుల పప్పు ధాన్యాలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రపంచ ఉత్పత్తిలో భారత్ వాటా ఇరవై ఐదు శాతమే. ప్రపంచంలో వినియోగిస్తున్న పప్పు ధాన్యాలలో ఒక్క భారత్లోనే 27 శాతం వినియోగమవుతోంది. సామాన్య ప్రజలకు మాంసకృత్తులు లభించాలంటే పప్పులే తప్పనిసరి. ఇంత ప్రాధాన్యత ఉన్న పప్పుధాన్యాల ఉత్పత్తికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు మాత్రం శూన్యం.