Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

కొత్త ముఖాలు

. నేడో, రేపో కేంద్రంలో మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు అవకాశం
. ఇప్పటికే పూర్తయిన సుదీర్ఘ కసరత్తు
. తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి చోటు?

న్యూదిల్లీ : కేంద్రంలోని మోదీ సర్కార్‌ మంత్రివర్గంలో కొత్త ముఖాలకు చోటు కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. జులై 12న మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేయాలని గత వారం, పది రోజులుగా బీజేపీ అగ్ర నాయకత్వం సుదీర్ఘ కసరత్తు పూర్తి చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌.సంతోష్‌తో పాటు అనేక మంది అగ్ర నేతలు సమావేశమై అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ఈనెల 13-14 తేదీల్లో ప్రధాని మోదీ ఫ్రాన్స్‌ పర్యటనకు వెళుతున్నందున, ఆలోపే మంత్రివర్గంలో మార్పులు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీలో, ప్రభుత్వంలో ఎవరెవరికి ఏయే బాధ్యతలు అప్పగించాలన్న విషయంపై కసరత్తు పూర్తయిందని, అందుకు అనుగుణంగానే అనేక మంది మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పజెప్పారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కేంద్ర మంత్రివర్గంలోకి తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరిని తీసుకోవాలని అగ్ర నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బుధవారం మంత్రివర్గం పునర్వ్యస్థీకరణ ఉండటంతో మంగళవారం సాయంత్రం కల్లా మంత్రులంతా దిల్లీ రావాలని అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్లుగా తెలుస్తోంది. దీంతో మంత్రులంతా దిల్లీ బాటపట్టారు. ఇప్పటికే మంత్రులుగా ఉన్న ప్రహ్లాద్‌ జోషి, భూపేంద్ర యాదవ్‌, అశ్వనీ వైష్ణవ్‌, మన్‌సుఖ్‌ మాండవియాను ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లుగా అధిష్టానం నియమించింది. అయితే కేబినెట్‌ నుంచి వీరందరికీ ఉద్వాసన పలికే అవకాశాలు మెండుగా ఉన్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్‌ రెడ్డిని నియమించడంతో మంత్రివర్గం నుంచి ఆయనను తొలగించే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమించే అవకాశం ఉన్నందున, స్థాన చలనం ఉంటుందని తెలుస్తోంది. దీంతో పాటు మహారాష్ట్ర నుంచి ఏక్‌నాథ్‌ షిండే, అజిత్‌ పవార్‌ వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని అగ్ర నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇక ఎల్‌జేపీ నుంచి చిరాగ్‌ పాశ్వాన్‌కు అవకాశం ఉండగా, ఆర్‌ఎల్‌డీ నుంచి జయంత్‌ చౌదరికి కూడా బీజేపీ గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, 2021 జులై 7 తర్వాత మోదీ తన మంత్రివర్గాన్ని విస్తరించలేదు. అప్పుడు ప్రకాశ్‌ జవదేకర్‌, రవిశంకర్‌ప్రసాద్‌ సహా 12 మంది మంత్రులకు ఉద్వాసన పలికి 36 మంది కొత్తవారికి స్థానం కల్పించారు. ఈసారి మార్పులు భారీగా లేకపోయినా చెప్పుకోదగిన స్థాయిలో ఉంటాయని బీజేపీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
రాష్ట్రపతితో నిర్మలా సీతారామన్‌ భేటీ
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ ఊహాగానాల నడుమ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపతి భవన్‌లో కలిశారు. ఇటీవల నడ్డాతో నిర్మల కూడా సమావేశమయ్యారు. ఆమెను మంత్రి పదవి నుంచి తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ కూడా సమాయత్తమవుతోంది. పాత మిత్రులను దగ్గరకు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఎన్‌డీఏ నుంచి విడిపోయిన పార్టీలను కూడా ఆకర్షించాలని ప్రయత్నిస్తోంది. ఈనెల 18న ఎన్‌డీఏ సమావేశానికి హాజరుకావాలని వివిధ పార్టీలను ఆహ్వానించింది. ఎస్‌ఏడీ, టీడీపీ, జేడీఎస్‌ కూడా ఈ సమావేశానికి హాజరవుతాయని జాతీయ మీడియా అంచనా వేస్తోంది. మరోవైపు, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ కూడా ఎన్‌డీఏతో కలిసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ప్రతిపక్షాల ఐక్యత కోసం, బీజేపీని గద్దె దించేందుకు నితీశ్‌ అనేక పార్టీలతో చర్చలు జరుపుతున్నారు. ఇదిలావుండగా నిర్మలా సీతారామన్‌ వద్ద ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీగా పని చేస్తున్న వివేక్‌ సింగ్‌ పదవీ కాలాన్ని కుదించారు. జులై 17తో ఆయన పదవీ కాలం ముగిసే విధంగా ఆదేశాలు జారీ చేశారు. ఆయన వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ కార్యాలయం పేర్కొంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నిర్మల సీతారామన్‌ భేటీ అయినట్లు రాష్ట్రపతి భవన్‌ సోమవారం ఒక ట్వీట్‌ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img