వరద గుప్పెట్లో గ్రామాలు
. బాహ్యప్రపంచంతో తెగిన సంబంధాలు
. నీట మునిగిన వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
. పునరావాస కేంద్రాలకు బాధితులు
. మూగజీవాల మౌనరోదన
విశాలాంధ్ర బ్యూరో-ఏలూరు/ కుక్కునూరు/ఏలేశ్వరం:
కొల్లేరు సరస్సును వరద నీరు చుట్టుముడుతోంది. గత నాలుగో రోజులుగా బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు, వాగులు, వంకల నుంచి వరద నీరు కొల్లేరులోకి ప్రవహిస్తుం డడంతో నీటి ఉధృతి అధికంగా ఉంది. గంట గంటకు నీటిమట్టం పెరుగుతుం డడంతో… నడిబొడ్డున ఉన్న గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వరద గుప్పెట్లో చిక్కుకున్నాయి. దీంతో కొల్లేరు వాసులు ఆందోళన చెందుతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుజీవుడా అంటూ సాయంకోసం ఎదురుచూస్తున్నారు. వరద నీరు రహదారులపై మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తున ప్రవహిస్తోంది. ఐదో కాంటూర్ గ్రామాలకు వెళ్లే రోడ్లన్నీ మునిగిపోయాయి. రాకపోకలు నిలిచిపోయాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏలూరు-కైకలూరు రహదారిలో పెదఎడ్లగాడి వంతెన, ఏలూరు మండలం మాధవాపురం, భీమడోలు మండలం ఆగడాలలంక, కైకలూరు వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు వెళ్లకుండా పోలీసులు పహార కాస్తున్నారు. మండవల్లి మండలం పెనుమాక లంక, నందిగం ,ఇంగిలి పాక, రుద్రపాక, ఉనికిలి, పిల్లిపాడు, కోటకొండ, కొవ్వాడలంక, చింతపాడు, నుచ్చుమిల్లి, మణుగులూరు, పెద్ద లంక, ఉనికిలి, ఏలూరు మండలం మాధవపురం, కోటేశ్వర దుర్గాపురం, మానూరు, మొండికోడు, కోమటిలంక , కలకుర్రు, పెదయాగానిమిల్లి, గుడివాక లంక, కొక్కిరాయి లంక, పత్తి కోళ్ల లంక, పైడి చింతపాడు, భీమడోలు మండలం ఆగడాల లంక, పెదపాడు మండలంలో కొనికి, గోగుంట, వసంతవాడ, కడిమికుంట, సత్యవోలు, గుడిపాడు, వడ్డిగూడెం గ్రామాలు జలదిగ్బం ధంలో చిక్కుకున్నాయి. రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గ్రామాలను చేరుకునేందుకు మర బోట్లు, దోనెలను వినియోగిస్తున్నారు. మాధవపురం వద్ద కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పూర్తిగా నీటిలో మునిగింది. ఓపక్క వరద నీరు, మరో పక్క ఎడతెరిపి లేని వర్షాలు కొల్లేరు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇళ్లలో వరద నీరు చేరింది. చేపల పడవలు, తాటి దోనెలు, చేపల తట్టలు రోడ్లపైకి కొట్టుకువస్తున్నాయి. మూగజీవాలు రోడ్లపైకి వస్తున్నాయి. ముంపు బారిన పడిన ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నారు.
మంచమెక్కిన మన్యం
ఏలూరు జిల్లా మారుమూల ఏజెన్సీ మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు ప్రాంతాల్లో వరదలు రైతాంగాన్ని నట్టేట ముంచాయి. పారిశుధ్యం లోపించడంతో మన్యం వ్యాధులతో మంచంక్కెంది. నెలరోజులపైగా జోరుగా పడుతున్న భారీ వర్షాలకు చెరువులు,వాగులు నిండు కుండను తలపిస్తున్నాయి. పొంగి ప్రవహిస్తున్నాయి. కుక్కునూరు – దాచవరం గ్రామాల మధ్య గుండేటి వాగు అప్రోచ్ రోడ్డు గోదావరి వరదకు నెల రోజుల క్రితం కోతకు గురై కొట్టుకుపోయింది. వంతెన బీటలు బారి ధ్వంసమైంది. 10 గ్రామాలకు కుక్కునూరు తో సంబంధాలు తెగిపోయాయి. వేలేరుపాడు ఎద్దువాగుకు వరద ఉధృతి పెరిగింది. ఈ ఏడాది సాగు ప్రశ్నార్థకంగా మారింది. గతంతో పోల్చుకుంటే పత్తి, మిర్చి ఇతర పంటల సాగు తగ్గినట్టు రైతులు చెబుతున్నారు.మార్కెట్‌లో జామాయల్ కి గిరాకీ ఉండటంతో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని రైతులు అధికంగా ఆ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. పారిశుధ్యం లోపించడంతో దోమలు వ్యాప్తి చెందాయి. అపరిశుభ్రత, కలుషిత నీరు వలన వ్యాధులు ప్రబలాయి. అధికశాతం వైరల్ జ్వరాల బారిన పడ్డారు. వైద్య ఆరోగ్యశాఖ వైద్య శిబిరాలు నిర్వహించి జ్వరాలను అదుపులోకి తీసుకొచ్చారు. రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. వాహన దారులు పడరాని పాట్లు పడుతున్నారు. ద్విచక్ర తరుచూ మరమ్మత్తులకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు నానాయాతన పడుతున్నారు.