Saturday, August 20, 2022
Saturday, August 20, 2022

అర్హులైన చిన్నారులందరికీ కోవిడ్‌ టీకా తొలి ప్రాధాన్యం

కరోనా ముప్పు పూర్తిగా పోలేదు.. అప్రమత్తంగా ఉండాల్సిందే
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

న్యూదిల్లీ : అర్హులయిన పిల్లలందరికీ త్వరగా కోవిడ్‌ టీకాలు వేయడమే ప్రభుత్వం తొలి ప్రాధాన్యత అని, దాని కోసం పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అన్నారు. దేశంలో ఉద్భవిస్తున్న కోవిడ్‌-19 పరిస్థితిపై ముఖ్యమంత్రులతో ఆయన భేటీ నిర్వహించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, వాక్సినేషన్‌ అంశాలపై చర్చించారు. కరోనా నాల్గవ తరంగం వస్తే తీసుకోవాల్సిన చర్యలు, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, మందులు తరతర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ కరోనా వైరస్‌ ముప్పు ఇంకా పూర్తిగా పోలేదని స్పష్టం చేశారు. గత రెండు వారాల్లో కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్‌-19 కేసులు పెరగడాన్ని ఉటంకిస్తూ, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ‘మన శాస్త్రవేత్తలు, నిపుణులు జాతీయ, ప్రపంచ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వారి సూచనల మేరకు మనం ముందస్తుగా, అనుకూల క్రియాశీలత, సమష్టి విధానంతో పని చేయాలి. సంక్రమణను ప్రారంభంలోనే ఆపడం మన ప్రాధాన్యత, అది నేటికీ అలాగే ఉండాలి’ అని ఆయన అన్నారు. ‘మనం టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌ వ్యూహాన్ని సమానంగా సమర్థవంతంగా అమలు చేయాలి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో, తీవ్రమైన ఇన్‌ఫ్లుఎంజా కేసులు ఉన్న ఆస్పత్రుల్లో చేరిన రోగులకు 100 శాతం ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షను నిర్వహించడం చాలా అవసరం. వైరస్‌కు వ్యతిరేకంగా టీకా అతిపెద్ద రక్షణ కవచమని నొక్కిచెప్పిన మోదీ, అర్హులయిన పిల్లలందరికీ కోవిడ్‌ టీకాలు వేయడం ప్రభుత్వానికి ప్రాధాన్యతనిస్తుందని, పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ విషయంలో తల్లిదండ్రులు, పిల్లలకు అవగాహన ఎంతో అవసరమని అన్నారు. వైద్య కళాశాలలు, జిల్లా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, మానవ వనరులను పెంచాలని మోదీ పిలుపునిచ్చారు. దేశంలోని వయోజనుల్లో 96 శాతం మంది కనీసం ఒకటి లేదా రెండు డోసులు తీసుకోవడం ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని అన్నారు. 15 ఏళ్లు పైబడిన అర్హులైన వారిలో 85 శాతం మంది రెండవ డోసు తీసుకున్నారని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో కోవిడ్‌ నిబంధనలపై అవగాహన కల్పించాలని సీఎంలకు సూచించారు. ఐదు నుంచి 12 సంవత్సరాల వయస్సు వారికి బయోలాజికల్‌కోవిడ్‌-19 టీకా కార్బెవాక్స్‌, ఆరు నుంచి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు భారత్‌ బయోటెక్‌ కోవాక్సిన్‌ కోసం దేశ ఔషధ నియంత్రణ మండలి అత్యవసర వినియోగ అధికారాన్ని మంజూరు చేసిందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్‌ మాండవియా తెలిపిన ఒక రోజు తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ కట్టర్‌, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బాఘెల్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ సహా అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img