Friday, December 1, 2023
Friday, December 1, 2023

కోర్టులో కాల్పుల కలకలం – ముగ్గురి మృతి

గ్యాంగ్‌స్టర్‌ని కాల్చేసిన ప్రత్యర్థులు
అపోలీస్‌ కాల్పుల్లో ఇద్దరు దుండగులు హతం

దిల్లీ : దేశ రాజధాని దిల్లీలో పట్టపగలు కాల్పుల ఘటన కలకలం రేపింది. గ్యాంగ్‌స్టర్‌ జితేంద్ర అలియాస్‌ గోగిపై శుక్రవారం మధ్యాహ్నం రోహిణి కోర్టులో కాల్పులు జరిగాయి. న్యాయవాదుల యూనిఫాం ధరించిన ప్రత్యర్థి ముఠా దుండగులు జితేంద్రపై కాల్పులు జరపడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా దిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో గోగిపై కాల్పులు జరిపిన ఇద్దరు దుండగులు హతమయ్యారు. జితేంద్రను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినప్పుడు న్యాయవాదులు, ఇతరులు చూస్తుండగానే రోహిణి కోర్టు నంబర్‌ 206 లో ఈ సంఘటన జరిగింది. దాడి చేసిన వారు టిల్లు తాజ్‌పురియా ముఠాకు చెందిన వారుగా భావిస్తున్నారు. ఈ కాల్పుల్లో ఒక మహిళా న్యాయవాది సహా ముగ్గురు గాయపడ్డారు. దుండగులు దాదాపు 35 నుంచి 40 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ విషయమై దిల్లీ పోలీస్‌ కమిషనర్‌ రాకేశ్‌ ఆస్థానా మాట్లాడుతూ.. ‘ఎదురు కాల్పుల్లో న్యాయవాదుల యూనిఫాంలో వచ్చిన ఇద్దరు దుండగులను పోలీసులు అడ్డుకుని కాల్చివేశారు.. తీవ్ర గాయాలైన గోగిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.. చికిత్స పొందుతూ అతను కూడా మృతి చెందాడు.. మొత్తం ముగ్గురు చనిపోయారు’ అని తెలిపారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. తుపాకీ కాల్పుల శబ్దం మధ్య న్యాయవాదులు భవనం నుండి బయటకు రావడానికి ప్రయత్నించడం కనిపించింది. దిల్లీ యూనివర్సిటీలో టాపర్‌గా ఉన్న జితేంద్ర , అతని సహాయకుడు కుల్‌దీప్‌ ఫజ్జాను రెండు సంవత్సరాల క్రితం గురుగ్రామ్‌లో ప్రత్యేక విభాగం పోలీసులు అరెస్టు చేశారు. కుల్దీప్‌ ఫజ్జా మార్చి 25 న పోలీస్‌ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. జితేంద్ర గోగి నెట్‌వర్క్‌లో 50 మందికిపైగా అనుచరులు ఉన్నారని ప్రత్యేక విభాగం పోలీస్‌ అధికారులు తెలిపారు. 2020 లో గోగిని అరెస్ట్‌ చేసినప్పుడు భారీ మొత్తంలో క్యాట్రిడ్జ్‌లు, ఆయుధాలు లభించాయి. అప్పట్లో గోగి ఆచూకీ కోసం దిల్లీలో రూ .4 లక్షలు, హరియాణాలో రూ .2 లక్షలు

రివార్డు ప్రకటించారు. హరియాణాకు చెందిన ప్రముఖ గాయని-నర్తకి హర్షిత హత్య కేసులో గోగి పేరు కూడా బయటపడిరది. ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు వీరేంద్ర మన్‌ను కూడా నరేలాలో గోగి గ్యాంగ్‌ సభ్యులు కాల్చి చంపారు. 2018 లో బురారీలో గోగి, టిల్లు గ్యాంగ్‌ సభ్యుల మధ్య గ్యాంగ్‌ వార్‌ జరిగింది, ఇందులో ముగ్గురు మరణించగా ఐదుగురు గాయపడ్డారు.
భయంభయంగా..
న్యాయమూర్తులు, న్యాయవాదులు, విచారణ కోసం వచ్చిన కక్షిదారులతో రోహిణీ కోర్టు కిక్కిరిసి ఉన్న సమయంలో శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా జరిగిన కాల్పులు కలకలం రేపాయి. హఠాత్తుగా చోటు చేసుకున్న ఈ సంఘటనతో అంతా భయాందోళనకు గురయ్యారు.
ఆస్పత్రిలో జడ్జి..
ఈ ఘటనతో ఎన్‌డీపీఎస్‌ కోర్టు జడ్జి.. ఏఎస్‌జే గగన్‌దీప్‌ సింగ్‌కు రక్తపోటు పడిపోయింది. దీంతో ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపిన వెంటనే దిల్లీ రోహిణీ కోర్టులో భద్రతను పటిష్ఠం చేశారు. కోర్టులో అదనపు బలగాలను మోహరించారు. కాల్పుల ఘటనపై దిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
భద్రాతా లోపాలున్నాయి : దిల్లీ సీపీ
సిటీ కోర్టు భద్రతకు సంబంధించి లోపాలున్నాయని దిల్లీ సీపీ రాకేశ్‌ ఆస్థానా అంగీకరించారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దుండగుల దాడిపూ ఆయన స్పందిస్తూ ‘అక్కడ పోలీసులు ఉన్నారు.. వారు దానిని చాలా వేగంగా తిప్పికొట్టారు.. అయితే భద్రతా లోపం ఉంది. మేము దానిని కచ్చితంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాము’ అని చెప్పారు. ‘ప్రస్తుతం దర్యాప్తు చేయనివ్వండి. కోర్టు భద్రతాలోపానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోబడతాయని నేను మీకు హామీ ఇస్తున్నాను’ అని ఆస్థానా పేర్కొన్నారు. కోర్టు ప్రవేశద్వారాల వద్ద ఒకదానిలో మెటల్‌ డిటెక్టర్లు పనిచేయడం లేదన్న విషయం అడగ్గా, ‘కోర్టు ప్రాంగణంలో మెటల్‌ డిటెక్టర్లు పని చేయడం లేదనే ప్రశ్న విచారణకు సంబంధించినది.. ప్రస్తుతానికి నేను దానిపై వ్యాఖ్యానించలేను’ అన్నారు. ‘ఒక మహిళా న్యాయవాది కాలి బుల్లెట్‌ గాయమైన విషయం అడగ్గా.. నేను ఇంకా దాని గురించి వివరాలు పొందలేదు. దాని గురించి వివరాలు వచ్చినప్పుడు చూస్తాను’ అని ఆస్థానా చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img