30 లక్షల నగదు బహుమతి అందజేసిన సీఎం జగన్
అమరావతి : వరుసగా రెండుసార్లు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి దేశ ప్రతిష్ఠను ఇనుమడిర పజేసిన పీవీ సింధును క్రీడాకారులు స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో రాష్ట్రం నుంచి మరింతమంది సింధులు తయారు కావాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. సచివాలయంలోని సీఎం చాంబర్‌లో శుక్రవారం టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ సింధు మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిసి తనకు వచ్చిన టోక్యో కాంస్య పతకాన్ని చూపించారు. ముఖ్యమంత్రి ఆమెను అభినందిస్తూ శాలువతో సత్కరించారు. ప్రభుత్వం తరపున ఆమెకు రూ.30లక్షల నగదు బహుమతిని అందజేశారు. మీ ఆశీర్వాదంతోనే పతకాన్ని సాధించానని సింధు చెప్పగా, దేవుడి దయతో మంచి ప్రతిభ చూపారని సీఎం ఆమెను అభినందించారు. విశాఖలో వెంటనే అకాడమీని ప్రారంభించాలని సీఎం సూచించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పలు పథకాలను అమలు చేయడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. టోక్యో ఒలంపిక్స్‌కి వెళ్లే ముందు ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశానని, ఒలంపిక్స్‌లో పతకాన్ని సాధించి రావాలని ప్రోత్సహించారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 2 శాతం రిజర్వేషన్‌ను అమలు పరుస్తున్నారని, ఇటువంటి విధానం క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. అలాగే క్రీడాకారులను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ పురస్కారాలను అందజేయడం కూడా అభినందనీయమన్నారు. సాంస్కృతిక, యువజన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.రజత్ భార్గవ్ ఆమెతో పాటు పాల్గొన్నారు.