Thursday, August 11, 2022
Thursday, August 11, 2022

క్విట్‌ జగన్‌…సేవ్‌ ఏపీ

రాప్తాడులో టీడీపీ అధినేత చంద్రబాబు

విశాలాంధ్ర-రాప్తాడు: జగన్‌ పాలనతో రాష్ట్రానికి కోలుకోలేని దెబ్బ తగిలిందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. క్విట్‌ జగన్‌… సేవ్‌ ఆంద్రప్రదేశ్‌ నినాదంతో మనమంతా సమైక్యంగా ప్రజా ఉద్యమం సాగించి అధికారంలోకి రావాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే రాష్ట్రానికి రూ.8లక్షల కోట్లు అప్పుల భారం ఉందని, ఇంకో రూ.3లక్షల కోట్లు అప్పులు చేస్తారు… అప్పుడు మరో శ్రీలంక మాదిరిగా ఏపీ తయారవుతుందని, మనమంతా ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడతామనే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. శుక్రవారం మధ్యాహ్నం బాదుడే బాదుడు కార్యక్రమానికి శ్రీ సత్యసాయి జిల్లాకు వెళ్తూ… అనంతపురం నుంచి 44వ జాతీయ రహదారి మీదుగా భారీ కాన్వాయ్‌తో ఆయన ఇక్కడకు వచ్చారు. రాప్తాడు టీడీపీ శ్రేణులు క్రేన్‌ ద్వారా భారీ గజమాలతో చంద్రబాబును సత్కరించారు. అనంతరం ప్రసంగిస్తూ… ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి వచ్చాను… మీ ఉత్సాహం చూస్తుంటే మీరు నాకు శక్తినిస్తున్నారపిస్తోందన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు ఏపీలోనే ఎక్కువగా ఉన్నాయన్నారు. నాసిరకం మద్యం, జె-ట్యాక్స్‌ ధరలు ఎక్కడంటే ఏపీలోనేనని…విద్యుత్తు చార్జీలు సైతం పెంచుకుంటూ పోతున్నారన్నారని తీవ్రంగా విమర్శించారు. అనంతపురం నుంచి బెంగళూరు వరకు ఇండస్ట్రియల్‌ కారిడారుగా చేయాలని అనుకున్నాను..మన పిల్లలు వేరే ప్రాంతాలకు పోకుండా ఇక్కడే ఉద్యోగాలు చేయాలని కలలుగన్నాను చేశానని బాబు అన్నారు. మన నాయకుడు ఎన్టీరామారావు తీసుకొచ్చిన హంద్రీనీవా ప్రాజెక్టుకు నీళ్లొస్తే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వవచ్చు. కియా పరిశ్రమ కోసం హంద్రీనీవాను పూర్తి చేసి గొల్లపల్లి రిజర్వాయర్‌ ను పూర్తి చేసిన ఘనత టీడీపీదని గుర్తించుకోవాలన్నారు. అనంతపురం జిల్లా కోసమే డ్రిప్‌ ఇరిగేషన్‌ సిస్టం పెట్టాను. ఒక ఎకరాకు అయ్యే నీరు రెండకరాలకు ఉపయోగపడడంతోపాటు లాభసాటిగా ఉండేదన్నారు. అందుకే అనంతపురం జిల్లా రైతులకు 90శాతం సబ్సిడీ ఇచ్చాం… ఎస్సీలకు వంద శాతం ఇచ్చామని, ఇప్పుడు ఇవ్వకుండా ఎగనామం పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఒక ఉన్మాది ఎమ్మెల్యే ఉన్నాడు…ఎస్సీ ఎస్టీ యాక్ట్‌ కేసులు పెడుతున్నాడని, పోలీసులకు కూడా వార్నింగ్‌ ఇస్తున్నాడన్నారు. ప్రతి ఒక్క దానికి ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుంది తమ్ముళ్లు… ఇక్కడి ఎమ్మెల్యేకు కూడా ఎక్స్‌పైరీ డేట్‌ వచ్చింది…తొందరలో ఇంటికి పోతాడు… మళ్లీ జీవితంలో తిరిగి ఎమ్మెల్యే కాలేడు అని అన్నారు. ఈ రాష్ట్రాన్ని వైసీపీ వారు అన్నిరకాలుగా భ్రష్టు పట్టించారని చంద్రబాబు విమర్శించారు. ప్రజా ఉద్యమాల ద్వారా వైసీపీని బంగాళాఖాతంలో కలిపే దాకా ఈ రాష్ట్రానికి మోక్షం లేదన్నారు. కార్యక్రమంలో అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌, మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ అధికార ప్రతినిధి పరిటాల శ్రీరాం, పెద్ద ఎత్తున ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img