Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

ఖజానాకు కిక్కు

. జోరుగా మద్యం విక్రయాలు`కలిసొచ్చిన జనవరి
. సంక్రాంతికి రూ.300 కోట్లకుపైనే ఆదాయం

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : రాష్ట్ర ప్రభుత్వానికి జనవరి మాసం కలిసొచ్చింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వేళ మద్యం అమ్మకాల రూపంలో కాస్తంత ఉపశమనానిచ్చింది. కొత్త సంవత్సరం సందర్భంగా రికార్డు స్థాయిలో రూ.142 కోట్ల విలువైన మద్యాన్ని మందుబాబులు తాగేశారు. రాష్ట్ర ఖజానా దివాళా తీసిన పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా నూతన సంవత్సరం వేడుకలను పురస్కరించుకుని డిసెంబరు 31వ తేదీ వైన్‌ షాపులలో అర్థరాత్రి 12 గంటల వరకు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు అనుమతిచ్చింది. దీంతో మందుబాబులు ఆ రోజంతా మద్యంలో మునిగి తేలారు. ఒక్కరోజే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో రూ.127 కోట్లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో రూ.15కోట్ల విలువైన మద్యం తాగారు. సాధారణంగా మద్యం అమ్మకాలు రాష్ట్రవ్యాప్తంగా రూ.70 కోట్ల వరకు సాగుతుంటాయి. అటువంటిది కొత్త సంవత్సరం వేడుకలప్పుడు రెట్టింపు అమ్మకాలు జరిగాయి. అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజుల్లో రూ.300 కోట్లపైనే మద్యం అమ్మకాలు సాగినట్లు ఎక్సైజ్‌ అధికారులు చెప్పారు. సంక్రాంతికి అనేకమంది స్వగ్రామాలకు చేరుకుంటారు. అలాగే ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పెద్దఎత్తున నిర్వహించే కోడి పందాలను తిలకించేందుకు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తారు. ఈఏడాది అధికార పార్టీ నేతలు స్వయంగా శిబిరాలు ఏర్పాటు చేసి యధేచ్చగా కోడి పందాలు నిర్వహించారు. శిబిరాల వద్ద మద్యం అమ్మకాలు అనధికారికంగా జోరుగా సాగాయి. దీంతో ఉభయగోదావరి జిల్లాల్లో రూ.30కోట్లకుపైగా అమ్మకాలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా రూ.300కోట్ల విలువైన మద్యాన్ని మందుబాబులు తాగేశారు. వీటిలో ఒక వంతు బీర్లు అమ్మకాలున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img