Friday, March 31, 2023
Friday, March 31, 2023

గన్నవరం రణరంగం

పోలీసుల సాక్షిగా వైసీపీ శ్రేణుల వీరంగం

. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి
. ఫర్నీచర్‌ ధ్వంసం. కారు దగ్ధం
. ధర్నాకు దిగిన టీడీపీ కార్యకర్తలు
. రెండువర్గాల బాహాబాహీ, రాళ్ల దాడులతో బీభత్సం
. గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని చంద్రబాబు డిమాండ్‌

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: వైసీపీ శ్రేణుల అరాచకాలు పరాకాష్ఠకు చేరాయి. గతంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయడంతోపాటు చంద్రబాబు నివాసంపై దండెత్తిన అధికారపార్టీ శ్రేణులు సోమవారం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. కార్యాలయం లోని కంప్యూటర్లు, ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా ఆఫీస్‌ ఆవరణలో ఉన్న వాహనాలపై పెట్రోల్‌తో నిప్పంటించారు. టీడీపీ ఫ్లెక్సీలు చించివేశారు. కారు అద్దాలను ఇటుకలతో బద్దలు కొట్టారు. పార్టీ కార్యాలయం మొత్తాన్ని కొద్దిసేపట్లోనే ధ్వంసం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌పై గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని వంశీ తీవ్ర పరుష పదజాలంతో విమర్శలు చేశారు. దానిపై స్థానిక టీడీపీ నేతలు స్పందిస్తూ మరింత ఘాటుగా ప్రతి విమర్శలు చేశారు. దీనిపై ఆగ్రహం చెందిన వంశీ అనుచరులు తమ నేతనే విమర్శిస్తారా ? అంటూ టీడీపీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో టీడీపీ నేతలు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. అదే అదనుగా భావించిన వైసీపీ శ్రేణులు విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహోదగ్రు లైన తెలుగు తమ్ముళ్లు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సహా టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడిన వైసీపీ దౌర్జన్యకారులం దర్నీ తక్షణమే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ ధర్నాతో చెన్నై`కోల్‌కతా జాతీయరహదారి ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈలోగా వైసీపీ శ్రేణులు కూడా జాతీయ రహదారిపైకి చేరుకుని పోటాపోటీగా నినాదాలకు దిగారు. ఒకరిపై మరొకరు సవాళ్లు విసురుకోవడంతో వివాదం ముదిరి రెండువర్గాలు బాహాబాహీకి దిగాయి. రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. పరిస్థితి కొద్దిసేపు అదుపు తప్పింది. గన్నవరం రణరంగంగా మారింది. ఈ పరిస్థితుల్లో పోలీసులు లాఠీ చార్జి జరిపి రెండువర్గాలను చెదరగొట్టారు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదని, దీనంతటికీ పోలీసుల అలసత్వమే కారణమని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పోలీసుల సాక్షిగా వంశీ అనుచరులు విధ్వంసకాండకు దిగారని టీడీపీ నేతలు చెబుతున్నారు. మొదట టీడీపీ ఆఫీస్‌ దగ్గర ఎమ్మెల్యే వంశీ రెక్కీ నిర్వహించారని చెబుతున్నారు. వంశీపై ఫిర్యాదు చేయడానికి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన సమయంలో కార్యాలయంపై వంశీ అనుచరులు దాడికి దిగారని చెబుతున్నారు.
గవర్నర్‌ జోక్యం చేసుకోవాలి: అచ్చెన్నాయుడు
గవర్నర్‌ వెంటనే జోక్యం చేసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు. దౌర్జన్య కారకులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాల న్నారు. ఎమ్మెల్యే వంశీ కనుసన్నల్లోనే టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందని, వైసీపీ రౌడీమూకలు దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయంపై దాడి రౌడీ పాలనకు పరాకాష్ఠ అని అచ్చెన్నాయుడు విమర్శించారు.
పట్టాభిరామ్‌ అదృశ్యం
ఈ వార్త తెలియగానే విజయవాడ నుంచి గన్నవరం హుటాహుటిన చేరుకున్న తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం అదృశ్యమయ్యారు. ఆయనను పోలీసులు అరెస్ట్‌ చేశారన్న సమాచారంతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా, అక్కడ ఆయన పీఏ, డ్రైవర్‌ మాత్రమే ఉన్నారు. పట్టాభిరామ్‌ లేరు. అక్కడున్న పోలీసులు తమకు సమాచారం తెలియదని చెప్పడం, పట్టాభిరామ్‌ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ వస్తుండడంతో ఆయన సతీమణి తన భర్తకు ఏదైనా జరిగితే సీఎం జగన్‌, డీజీపీదే బాధ్యత అని హెచ్చరించారు. తక్షణం తన భర్తను అప్పగించాలని డిమాండ్‌ చేశారు. పట్టాభి కారును కూడా వైసీపీ దౌర్జన్యకారులు ధ్వంసం చేశారు.
టీడీపీ నేతలంతా అరెస్ట్‌
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన సమాచారం తెల్సుకుని కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలతోపాటు విజయవాడ నగర టీడీపీ నేతలంతా గన్నవరం బయలుదేరారు. మాజీ మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఏపీలో పోలీస్‌శాఖను మూసేశారా: చంద్రబాబు
గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ గూండాల దాడిని, వాహనాలను తగలబెట్టిన ఘటనపై చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ ఉన్మాదులు బరితెగించి అరాచకాలు చేస్తుంటే పోలీసులు గాడిదలు కాస్తున్నారా? రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవే లేకుండా చేశారు. పోలీసు శాఖను మూసేశారా? లేక వైసీపీలో విలీనం చేశారా? అంటూ నిప్పులు చెరిగారు. సీఎం ఫ్యాక్షనిస్ట్‌ మనస్తత్వానికి ఈ ఘటనలే ఉదాహరణ అని, రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మారుస్తున్న జగన్‌ ఆ మంటల్లో కాలిపోవడం ఖాయమని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని, గవర్నర్‌ తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img