Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

గవర్నరుపై స్టాలిన్‌ యుద్ధం

. బిల్లుల ఆమోదానికి నిర్దిష్ట కాలపరిమితి అవసరం
. కేంద్రం, రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి
. తమిళనాడు అసెంబ్లీ తీర్మానం

చెన్నై: దేశంలో చాలా రాష్ట్రాల్లో గవర్నర్లు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలకు గవర్నర్లు ఏమాత్రం సహకరించడం లేదు. ప్రజా ప్రయోజ నాల కోసం, పాలననుశులభతరం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న బిల్లులకు గవర్నర్లు అడ్డుకట్ట వేస్తున్నారు. రోజులు, నెలల తరబడి బిల్లులలను తమ వద్దే అంటిపెట్టుకుంటున్నారు. తమిళనాడు, తెలంగాణ, పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాలు ఇందుకు ఉదాహరణగా నిలిచాయి. గవర్నర్ల నియంతృత్వం, ఏకపక్ష ధోరణితో రాష్ట్ర ప్రభుత్వాలు సజావుగా పాలన చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఆశ్చర్యంగా గవర్నర్లు బహిరం గంగానే రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చట్టసభలు ఆమోదిం చిన బిల్లులకు పచ్చ జెండా ఊపేందుకు రాష్ట్ర గవర్నర్లకు నిర్థిష్ట కాలపరిమితి విధించాలని కేంద్రం, రాష్ట్రపతులకు విజ్ఞప్తి చేస్తూ తమిళనాడు అసెంబ్లీ సోమవారం ఓ తీర్మానం ఆమోదించింది. దీంతో డీఎంకే ప్రభుత్వం, గవర్నరు ఆర్‌ఎన్‌ రవి మధ్య ఘర్షణ మరింత పెరిగే సంకేతాలు వెలువడ్డాయి. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తీర్మానం ప్రవేశపెడుతూ గవర్నరు రవి భారత రాజ్యాంగం కన్నా బీజేపీ నాయకత్వం పట్ల మరింత విశ్వాసం ప్రదర్శిస్తున్నా రని తీవ్రస్థాయిలో విమర్శించారు. ‘గవర్నరుకు రాజ్యాంగం తెలియదని నేను చెప్పడం లేదు. కానీ ఆయన రాజకీయ ఉద్దేశాలు రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయనివ్వడం లేదు’ అని స్టాలిన్‌ నిందించారు. గవర్నరు రాజకీయ కారణాలతో తన ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటే…దానిని సాగనివ్వ బోమని స్పష్టంచేశారు. గవర్నరుకు వ్యతిరేకంగా తీర్మానాన్ని తాను బలవంతంగానే పెట్టాల్సి వస్తోం దని ముఖ్యమంత్రి చెప్పారు. రవికి వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టడం ఈ ఏడాది ఇది రెండోసారి. గవర్నరు తట స్థంగా ఉండాలని సర్కారియా కమిషన్‌ స్పష్టంచేసిం దని స్టాలిన్‌ గుర్తుచేశారు. అయితే, మిత్రుడిగా ఉండటానికి ఈ గవర్నరు సిద్ధంగా లేరని ఆరోపిం చారు. ప్రధాని నరేంద్రమోదీ తమిళనాడు పర్యట నకు వచ్చినప్పుడు…తాను మోదీని కలవడానికి దిల్లీ వెళ్లినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గవర్నరు ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వంతో గవర్నర్లు ఆరోగ్యకరమైన చర్చలు జరపాలని, బహిరంగ వేదికలపై పాలనాపరమైన అంశాలు ప్రస్తావించరాదని స్టాలిన్‌ సూచించారు. ప్రభుత్వ పథకాలను చాలా తక్కువ చేసి చూపిం చడం, తమిళుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం, శాసనసభ సార్వభౌమాధి కారాన్ని కించపరచడం, ప్రజల ప్రయోజనాలు, సంక్షేమం కోసం అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను నిలిపివేయడం వంటి చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టంచేశారు. గవర్నరు తన హోదాకు మించి ప్రవర్తిస్తున్నారని, అసలు సిసలు రాజకీయ నేతగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటమే కాకుండా తన ఆమోదం కోసం పంపిన బిల్లులను నిలిపివేయడం గవర్నరుకు అలవాటుగా మారిందని నిందించారు. రాజ్‌భవన్‌ను ఆయన రాజకీయ భవన్‌గా మార్చారని ఆగ్రహం వెలిబుచ్చారు. అసెంబ్లీని రాజకీయరంగంగా మార్చాలని తాను కోరుకోవడం లేదని చెప్పారు. అదేసమయంలో ప్రభుత్వంపై గవర్నరు ఆరోపణలు కొనసాగిస్తే మాత్రం మౌనంగా ఉండేది లేదని హెచ్చరిక స్వరంతో చెప్పారు. ‘గొర్రెకు గడ్డం…రాష్ట్రానికి గవర్నరు అవసరం లేదు’ అని మాజీ సీఎం సీఎన్‌ అన్నాదురై చెప్పారని, దీనిని మరో మాజీ సీఎం ఎం.కరుణానిధి బలపరిచారని, అయినప్పటికీ గవర్నరు పదవిని గౌరవించడంలో వారిద్దరూ విఫలం కాలేదని స్టాలిన్‌ చెప్పారు. తాను సైతం గవర్నరును అగౌరవ పరచాలని కోరుకోవడం లేదన్నారు.
‘అసెంబ్లీ ఆమోదించిన అనేక బిల్లులను సుదీర్ఘకాలం తన వద్దే ఉంచుకుంటున్న తమిళనాడు గవర్నరు చర్య పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. తమిళనాడు ప్రజల ప్రయోజనాలు, సంక్షేమానికి విఘాతం కలిగించడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఆమోదం కోసం పంపిన బిల్లులకు పచ్చ జెండా ఊపడానికి గవర్నర్లకు నిర్ధిష్టకాలపరిమితి నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ తీర్మానాన్ని సభ ఆమోదించాలి’ అని స్టాలిన్‌ తీర్మానం చేశారు. దీనికి డీఎంకే, దాని మిత్రపక్షాలు సంపూర్ణ ఆమోదం తెలిపాయి. ప్రతిపక్ష ఏఐఏడీఎంకే సభకు గౌర్హాజరైంది.
తీర్మానంతో దిగొచ్చిన గవర్నరు
ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ను నిషేధించడం, ఇంటర్నెట్‌ గేమ్‌లను నియంత్రించడం కోసం రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి సోమవారం ఆమోదించారు. ఆరు నెలల పాటు పెండిరగ్‌లో ఉంచిన బిల్లును…గవర్నర్‌కి వ్యతిరేకంగా స్టాలిన్‌ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన గంటల వ్యవధిలోనే ఆమోదించడం గమనార్హం. గత నెలలో గవర్నర్‌ కొన్ని ప్రశ్నలతో బిల్లుని వెనక్కిపంపారు. దీంతో ప్రభుత్వం రెండోసారి బిల్లును ఆమోదించింది. రాష్ట్ర యూనివర్సిటీ చాన్సలర్‌గా తనను తొలగించాలని కోరుతూ ప్రవేశపెట్టిన బిల్లుతో పాటు తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన అనేక బిల్లులకు గవర్నర్‌ ఇప్పటివరకు ఆమోదం తెలపలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img