Friday, December 2, 2022
Friday, December 2, 2022

గవర్నర్లపై రణభేరి

. రాజ్యాంగ విరుద్ధ చర్యలను ప్రశ్నిస్తున్న రాష్ట్రాలు
. వర్సిటీల ఛాన్సలర్‌గా గవర్నర్‌ను తొలగిస్తూ ఆర్డినెన్స్‌ : కేరళ నిర్ణయం
. గవర్నర్‌ రవిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన తమిళనాడు
. తమిళి సైతో తెలంగాణ అమీతుమీ

తిరువనంతపురం/చెన్నై/హైదరాబాద్‌ : దేశంలో గవర్నర్ల వ్యవస్థ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేంద్రంలోని కాషాయ ప్రభుత్వం నియమించిన గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరుపై కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వారి రాజ్యాంగ విరుద్ధ చర్యలను ప్రశ్నిస్తున్నాయి. మూడు రాష్ట్రాల్లోని గవర్నర్లు కీలకమైన చట్టాల విషయంలో ‘కేంద్రం కీలుబొమ్మలా’ వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. ఆయా గవర్నర్లతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. కేరళలో ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. గవర్నర్‌కు అధికారాలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక చర్యకు ఉపక్రమించింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల కులపతిగా గవర్నర్‌ను తొలగించి, ప్రముఖ విద్యావేత్తలను ఆ పదవిలో నియమించాలని కేరళ ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలో ఉప కులపతుల నియామకంతో సహా విశ్వవిద్యాలయాల పనితీరుపై గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌తో కొనసాగుతున్న ఘర్షణ మధ్య ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. రాష్ట్రంలోని 14 విశ్వవిద్యాలయాలకు గవర్నర్‌ కూడా సారథ్యం వహించాలనే అధికారాన్ని తొలగించి, ఛాన్సలర్‌ నియామకానికి సంబంధించి విశ్వవిద్యాలయ చట్టాలను సవరించే ఆర్డినెన్స్‌ను ప్రకటించాలని మంత్రివర్గ సమావేశంలో ఖాన్‌కు సిఫార్సు చేయాలని నిర్ణయించినట్లు సీఎంవో ప్రకటన తెలిపింది. ఈ సమావేశంలో భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి మదన్‌ మోహన్‌ పుంఛీ నేతృత్వంలోని పుంఛీ కమిషన్‌ సిఫార్సులను కూడా కేబినెట్‌ పరిగణనలోకి తీసుకుందని, గవర్నర్‌కు రాజ్యాంగం ప్రకారం ఇతర విధులు కూడా ఉన్నందున విశ్వవిద్యాలయాల కులపతిగా నియమించడం సరికాదని ఆయన పేర్కొన్నారని ప్రకటన వివరించింది. ప్యానెల్‌ సిఫార్సులు, రాష్ట్రంలో ఉన్నత విద్యకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, ప్రముఖ విద్యావేత్తలను విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్లుగా నియమించాలని నిర్ణయించినట్లు ప్రకటన తెలిపింది. కేరళలోని ఉన్నత విద్యా కేంద్రాలను అంతర్జాతీయ ప్రమాణాలకు పెంచేందుకు దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించేందుకు ఉన్నత విద్యారంగంలో నైపుణ్యం కలిగిన వ్యక్తులు విశ్వవిద్యాలయాల సారథ్యంలో ఉండటం ప్రయోజనకరమని మంత్రివర్గం అభిప్రాయపడిరది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్‌.బిందు ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. రాష్ట్రంలోని ఉన్నత విద్య, యూనివర్సిటీల్లో దీర్ఘకాలిక సంస్కరణలు తీసుకొచ్చేందుకు వీలుగా గవర్నర్‌ స్థానంలో ప్రముఖ విద్యావేత్తలను ఛాన్సలర్లుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని బిందు తెలిపారు. దీనిపై త్వరలో ఒక ఆర్డినెన్స్‌ తీసుకురానున్నట్లు ఆమె చెప్పారు. ఈ విషయం పై న్యాయ శాఖ తయారు చేసిన ముసాయిదా ఆర్డినెన్స్‌ పై బుధవారం కేబినెట్‌ సమావేశంలో చర్చించారు. అయితే ఈ ఆర్డినెన్స్‌ పై రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ సంతకం పెడితేనే అమలులోకి వస్తుంది. దీంతో ఆయన సంతకం పెడతారా లేదా అన్నదానిపై విద్యా శాఖ మంత్రిని మీడియా ప్రశ్నించగా… గవర్నర్‌ తన రాజ్యాంగ బాధ్యతలకు అనుగుణంగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్లు బిందు తెలిపారు. రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాల వీసీల నియామకానికి వ్యతిరేకంగా గవర్నర్‌ ఖాన్‌ ఇటీవలి చర్యను స్పష్టంగా ప్రస్తావించిన బిందు… ఇటీవల వర్సిటీల పనితీరులో జోక్యం చేసుకున్నారని, ఇది వాటిని చుక్కాని లేకుండా చేసే లక్ష్యంతో ఉందని, ఇది కచ్చితంగా కేరళలో ఉన్నత విద్యకు సంబంధించి హోదాకు సంబంధించి ఆందోళనలను లేవనెత్తిందని అన్నారు. అయితే చర్యను కాంగ్రెస్‌, బీజేపీ రెండూ వ్యతిరేకించాయి. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వి.డి.సతీశన్‌ మంత్రివర్గ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. విశ్వవిద్యాలయాలను ‘కమ్యూనిస్టు కేంద్రాలు’గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి చేసిన తప్పిదాలకు ఛాన్సలర్‌ను మార్చడం పరిష్కారం కాదన్నారు. ఈ నిర్ణయం పశ్చిమ బెంగాల్‌లో జరిగినట్లుగా రాష్ట్రంలో ఉన్నత విద్యకు హాని కలిగిస్తుందని ఆయన అన్నారు. వీసీల నియామకానికి సంబంధించి ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అధిగమించేందుకే ఆర్డినెన్స్‌ను తీసుకువస్తున్నారని సతీశన్‌ ఆరోపించారు.
గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని తొలగించండి : రాష్ట్రపతికి డీఎంకే వినతి
తమిళనాడు అధికార పార్టీ డీఎంకే, ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ప్రశాంతతకు ముప్పు అని ఆరోపించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన ప్రభుత్వం ప్రజలకు సేవలందించకుండా ఆయన అడ్డుకుంటున్నారని మండిపడిరది. ఆయనను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఒక వినతిపత్రాన్ని పంపించింది. ఆర్‌.ఎన్‌.రవి గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించేటప్పుడు రాజ్యాంగాన్ని, చట్టాన్ని పరిరక్షిస్తానని, కాపాడతానని ప్రమాణం చేశారని, ఆ ప్రమాణాన్ని ఆయన ఉల్లంఘిస్తున్నారని రాష్ట్రపతికి సమర్పించిన వినతిపత్రంలో డీఎంకే ఆరోపించింది. ఆయన మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని తెలిపింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన ప్రభుత్వం ప్రజలకు సేవ చేయకుండా అడ్డుకుంటున్నారని పేర్కొంది. శాసనసభ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపకుండా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని పేర్కొంది. ప్రభుత్వం పట్ల అసంతృప్తిని రగిలించే విధంగా ఆయన మాట్లాడుతున్నారని, అటువంటి వ్యాఖ్యలను రాజద్రోహంగా కొందరు పరిగణించే అవకాశం ఉందని తెలిపింది. రాజ్యాంగ పదవికి ఆయన అనర్హుడని పేర్కొంది. ఈ వినతి పత్రం పై డీఎంకే అధిష్ఠాన వర్గం నేతలు, ఆ పార్టీ మిత్ర పక్షాల నేతలు సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. తమిళనాడులో 20 బిల్లులు గవర్నర్‌ ఆమోదం కోసం పెండిరగ్‌లో ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో రెండుసార్లు ఆమోదించిన నీట్‌ మినహాయింపు బిల్లును రాష్ట్రపతికి పంపనందుకు ఏప్రిల్‌లో డీఎంకే నాయకులు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఇదిలాఉండగా, తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో విభేదిస్తున్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ నిబంధనల ప్రకారం మొత్తం 15 రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి నియామక బోర్డుపై చర్చించేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆమె పిలిపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img